అగ్ని మహా పురాణము

Table of Contents

ఏకాదశీ వ్రతములు

అగ్ని పలికెను:

ఇపుడు భుక్తి ముక్తి ప్రదాయకమగు ఏకాదశీ వ్రతమునుగూర్చి చెప్పెదను. దశమి యందు నియతాహారవంతుడై మాంస మైథునములను వర్ణించవలెను. రెండు పక్షములందును, ఏకాదశులందు భోజనము చేయగూడదు. ఏకాదశీ ద్వాదశులు కలిసిన దినమున శ్రీహరి సన్నిహితుడై యుండును. ఆ రోజున ఉపవాసముచేసి త్రయోదశినాడు పారణము చేసినచో నూరు యజ్ఞములు చేసిన ఫలము లభించును. ఏకాదశినాడు కొంచెము ఏకాదశి ఉండి పిదప ద్వాదశి వచ్చినచో, అపుడు ఉపవాసముచేసి త్రయోదశినాడు పారణము చేసిన వానికి నూరు యజ్ఞముల ఫలము లభించును. ఏకాదశినాడు దశమి కలసినచో ఉపవాసము ఉండరాదు. నరకము వచ్చును. ఏకాదశినాడు ఉపవాసము ఉండి మరుసటి రోజున-’పుండరీకాక్షా! నేనీ రోజున భుజింతును; నాకు రక్షకుడవు అగుము’ అని ప్రార్థించి భోజనము చేయవలెను. శుక్లైకాదశి యందు పుష్యమీ నక్షత్రము ఉన్నపుడు ఉపవాసము ఉన్నచో అది అధిక ఫలప్రదము. పాపవినాశకము. ఏకాదశీ ద్వాదశీ తిథులు శ్రవణ నక్షత్ర యుక్తములైనచో అది విజయతిథి. భక్తులకు జయప్రదము. ఫాల్గుణ మాసమున పుష్యమీ నక్షత్ర యుక్తమగు ఏకాదశి కూడ విజయాతిథి. అది అనేక కోట్ల రెట్టింపు ఫలమును ఇచ్చునట్టిది. ఏకాదశినాడు విష్ణుపూజ చేయవలెను. అది అందరికిని ఉపకారకము. అట్లు చేసినవాడు ధనపుత్రాదిమంతుడై విష్ణు లోకమునందు పూజింపబడును. (187)