అగ్ని మహా పురాణము

Table of Contents

వాగీశ్వరీ పూజా విధానము

శివుడు చెప్పెను:

ఇప్పుడు మండలసహిత వాగీశ్వరీ పూజా విధానమును చెప్పెదను. ఊకారమును ఘాతో చేర్చి దానికి అనుస్వారము చేర్చినచో, ‘ఘాం’ అను ఏకాక్షర మంత్రము ఏర్పడును. నిషాదముపై ‘ఈ’ చేర్చి దాని బిందు విసర్గ యుక్తము చేయవలయును. ఈ ఏకాక్షర మంత్రము అందరికిని ఉపదేశించరాదు. వాగీశ్వరీ దేవిని ఈ విధముగా ధ్యానించవలెను. దేవి శరీర కాంతి చంద్రకుంద కుసుమములవలె వుండును. ఏబది అక్షరముల మాలామయమగు రూపము ధరించి ఉండును. ముత్యాల హారములు శ్వేత పుష్పహారములు ధరించి ఉండును. త్రినేత్రియగు ఆమె హస్తములలో వరుసగ వరద, అభయ, అక్షమాల, పుస్తకములు శోభించుచుండును. ఇట్లు ధ్యానించి పైన చెప్పిన ఏకాక్షర మంత్రము ఒక లక్ష జపించవలెను. పాదముల నుండి మస్తకము వరకు లేదా స్కందమువరకు అకారాది క్షకారాంతమగు వర్ణమాలను ఆమె ధరించి ఉన్నట్లు భావన చేయవలెను. గురువు మంత్రోపదేశము చేయుటకు దీక్షార్థమై ఒక మండలము ఏర్పరుపవలయును. అది సూర్యాగ్రమై ఇందు విభక్తమై ఉండవలెను. రెండు భాగములందు కమలము ఏర్పరుపవలెను. ఆ కమలము సాధకునకు హితకరమగును. పిదప వీథిపదిక ఏర్పరచి నాలుగు పదములందు కమలములను వాటి బాహ్యభాగమున వీథి పదికలను నిర్మించవలెను. రెండేసి పదములతో ఒక్కొక్క దిక్కునందు ద్వారములను ఉప ద్వారములను నిర్మించవలెను. కోణములందు రెండేసి పట్టికలు నిర్మించవలెను. తొమ్మిది కమలములను శ్వేత వర్ణములుగా చేసి కర్ణికపై బంగారు రంగుగల చూర్ణము చల్లి పచ్చగాను కేసరములను వివిధ వర్ణములుగను కోణములను రక్తవర్ణములుగను చేయవలెను. వ్యోమ రేఖాంతరము కృష్ణ వర్ణముగా చేసి ద్వారముల మానము ఇంద్రగజమానమును అనుసరించి ఉండునట్లు చేయవలెను. మధ్య కమలమున సరస్వతిని, పూర్వ కమలమున వాగీశిని ఆగ్నేయాది విదిక్కుల క్రమమున హృల్లేఖా, చిత్రవాగీశి, గాయత్రి, విశ్వరూప, శాంకరీ, మతిధృతులను స్థాపించి పూజించ వలెను. నామ ప్రారంభము హ్రీంచేర్చి నామాద్యక్షరమున బీజ రూపమున ఉచ్చరించి పూజించవలెను. సరస్వతిని వాగీశ్వరీ రూపమున ధ్యానించవలెను. కపిల ఘృతముతో హోమము చేయవలెను. ఇట్లు చేసినవాడు సంస్కృత ప్రాకృత భాషలలో, కావ్యరచన చేయు కవియగును. కావ్యశాస్త్ర విద్వాంసుడగును. (319)