అగ్ని మహా పురాణము

Table of Contents

మత్స్యాది ప్రతిమా లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: ఇప్పుడు మత్స్యాది దశావతార విగ్రహములను గూర్చి చెప్పెదను. మత్స్యావతార విగ్రహము మత్స్యాకారమునను, కూర్మావతార విగ్రహము కూర్మాకారమునను ఉండవలెను. భూమిని పైకి లేవనెత్తుచున్న వరాహావతార విగ్రహమును మనుష్యాకారమున నిర్మింపవలెను. కుడిచేతిలో గదా, చక్రములు, ఎడమచేతిలో శంఖ పద్మములు ఉండవలెను. లేదా పద్మమునకు బదులు ఎడమ ప్రక్క లక్ష్మీదేవి ఉండవలెను. లక్ష్మి ఆతని ఎడమ మోచేయి ఆనుకొని ఉండును. పృథివి, ఆదిశేషుడు చరణములను అనుసరించి ఉండవలెను. వరాహమూర్తి స్థాపించినవారికి రాజ్యము లభించును; అంతమున వారు, భవసాగరము దాటి మోక్షము పొందుదురు. నృసింహమూర్తి స్థాపించిన వారికి రాజ్యము లభించును; అంతమున వారు, భవసాగరము దాటి మోక్షము పొందుదురు. నృసింహమూర్తి ముఖము తెరచి ఉండును. తన ఎడమతొడపై హిరణ్య కశిపుని అణచి ఉంచి వాని వక్షమును చీల్చుచుండును. ఆతని కంఠమున మాలయు హస్తములందు చక్ర, గదలుండును. వామనుని విగ్రహము ఛత్రముతోడను, దండముతోను ప్రకాశింప వలెను. నాలుగు భుజములుండవలెను. పరశురాముని చేతిలో ధనుర్బాణములు, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉండవలెను. శ్రీరాముని విగ్రహము ధనుర్బాణ ఖడ్గ శంఖములతో ఒప్పారుచుండును. లేదా ఆతనికి రెండు భుజములు మాత్రమే ఉండవచ్చును. బలరాముడు గదను, నాగలిని ధరింపవలెను. లేదా ఆతనికి నాలుగు భుజములుండవచ్చును. ఆతనిపై ఎడమచేతిలో నాగలి, క్రింది చేతిలో అందమైన శంఖముపై కుడిచేతిలో ముసలము, క్రిందచేతిలో సుదర్శన చక్రము ఉండవలెను. బుద్ధుడు శాంత స్వరూపముతో, వరద-అభయ ముద్రలు ధరించి, ఉన్నతమైన పద్మాసనముపై కూర్చుండవలెను. తెల్లని శరీర వర్ణముతో, పొడవైన చెవులతో, అందమైన పీతవస్త్రముచే కప్పబడి యుండవలెను. కల్కి ధనుస్తూణీరములను ధరించి, మ్లేచ్ఛులను సంహరించు బ్రాహ్మణుడు. లేదా ఆతని విగ్రహమును గుఱ్ఱముపై ఎక్కి నాలుగు చేతులలో ఖడ్గ, శంఖ, చక్ర, గదలను ధరించి ఉండవలెను.

ఇపుడు వాసుదేవాదులగు తొమ్మండుగురి మూర్తుల లక్షణము చెప్పెదను. వాసు దేవునకుపై కుడిచేతిలో చక్రముండుట ప్రధాన చిహ్నము. ఒక పార్శ్వమున బ్రహ్మ, మరొక పార్శ్వమున శివుడు సర్వదా ఉందురు. ఇతర విషయములన్నియు వెనుక చెప్పినట్లే. శంఖమునుగాని, వరద ముద్రనుగాని ధరించి యుండును. ద్విభుజుడు కావచ్చును, చతుర్భుజుడు కావచ్చును. బలరామునకు నాలుగు భుజములుండును. కుడిచేతులలో హల, ముసలములను, ఎడమ చేతులలో గదా, పద్మములను ధరించి ఉండును. ప్రద్యుమ్నుడు కుడిచేతులలో చక్ర, శంఖములను, ఎడమ చేతులలో ధనుర్బాణములను ధరించి యుండును. లేదా రెండు భుజములుండి ఒకచేతిలో గదను, రెండవ దానిలో ధనస్సును ధరించి యుండును. ఈ ఆయుధములను ప్రసన్నతా పూర్వకముగ ధరించి ఉండును. లేదా ఒక హస్తమున ధనస్సు, రెండవ హస్తమున బాణము ఉండును. అనిరుద్ధ, నారాయణుల విగ్రహములు చతుర్భుజములు. బ్రహ్మ హంసారూఢుడు. నాలుగు ముఖములు, ఎనిమిది భుజములు, విశాలమైన ఉదరమండలము, పొడవైన గడ్డము, శిరస్సుపై జటలు ఉండును. కుడిచేతులలో అక్షసూత్రమును, స్రువమును, ఎడమ చేతులలో కుండికను, ఆజ్యస్థాలిని ధరించి యుండును. ఎడమ ప్రక్కసరస్వతి, కుడి ప్రక్కసావిత్రి ఉండును. విష్ణువు గరుడారూఢుడై ఎనిమిది భుజములతో కుడిచేతులలో ఖడ్గ, గదా, బాణ, వరద ముద్రలను; ఎడమ చేతులలో ధనుష్, ఖేటక, చక్ర, శంఖములను ధరించి యుండును. లేదా ఆతని విగ్రహము చతుర్భుజము కూడ కావచ్చును. చతుర్భుజుడైన నృసింహుడు రెండు చేతులలో శంఖ చక్రములను ధరించి, రెండు చేతులలో హిరణ్యకశిపుని వక్షము చీల్చు చుండును.

వరాహమూర్తికి నాలుగు బాహువులుండును. ఆదిశేషుని చేతితో పట్టుకొనును. ఎడమచేతిలో భూదేవిని ధరించును. ఎడమ పార్శ్వమున లక్ష్మి ఉండును. లక్ష్మి ఉన్నపుడు భూమి ఆతని పాదములందు లగ్నమైనట్లు చేయవలెను. త్రైలోక్య మోహనమూర్తియైన శ్రీహరి గరుడారూఢుడు; ఎనిమిది భుజములు. కుడిచేతులలో చక్ర, శంఖ, ముసల అంకుశములను, ఎడమచేతులలో శంఖ, శార్ఙ్గ, గదా, పాశములును ఉండును. వామ భాగమున పద్మహస్తయైన లక్ష్మి ప్రతిమను, దక్షిణ పార్శ్వమున సరస్వతి ప్రతిమను నిర్మింపవలెను. విశ్వరూపుని విగ్రహము ఇరువది చేతులతో ప్రకాశించుచుండును. కుడిచేతులలో చక్ర, ఖడ్గ, ముసల, అంకుశ, పట్టిశ, ముద్గర, పాశ, శక్తి, శూల, బాణములను; ఎడమచేతులలో శంఖ, శార్ఙ్గ, గదా, పాశ, తోమర, హల, పరశు, దండ, ఛురికా (బాకు), చర్మలను ధరించియుండును. కుడివైపున చతుర్భుజుడగు బ్రహ్మ, ఎడమ వైపు త్రినేత్రుడును ఉందురు. జలశాయి జలములో శయనించి ఉండును. ఈ మూర్తిని శేషశయ్యపై శయనించి ఉన్నట్లు చేయవలెను. లక్ష్మీదేవి ఒక పాదము ఒత్తుచుండును. విమల మొదలగు శక్తులు స్తుతించుచుండును. ఈ శ్రీహరి నాభికమలమున చతుర్భుజుడగు బ్రహ్మ ప్రకాశించుచుండును. హరిహర మూర్తి కుడిచేతులలో శూల, ఋష్టులును, ఎడమచేతులలో గదా చక్రములను ధరించి ఉండును. శరీరము కుడిభాగమున రుద్ర చిహ్నములు, ఎడమ భాగమున కేశవ చిహ్నములు ఉండును. దక్షిణ పార్శ్వమున పార్వతి, వామ పార్శ్వమున లక్ష్మి ఉందురు. హయగ్రీవుని నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా, వేదములు ఉండును. ఎడమపాదము ఆదిశేషుని మీదను, కుడిపాదము కచ్ఛపము వీపు పైనను ఉంచియుండును. దత్తాత్రేయునకు రెండు బాహువులు ఉండును. వామాంకమున లక్ష్మి ఉండును. భగవంతుని పార్షదుడైన విష్వక్సేనుడు నాలుగుచేతులలో చక్ర, గదా, హల, శంఖములను ధరించియుండును. (49)