అగ్ని మహా పురాణము
ధ్వజారోపణాది విధానము
శ్రీ పరమేశ్వరుడు పలికెను: స్కందా! దేవాలయములో శిఖరమును, ధ్వజదండమును, ధ్వజమును ప్రతిష్ఠ చేయవలసిన విధానమును చెప్పుచున్నాను వినుము. శిఖరము సగము భాగమునందు శూలమును ప్రవేశపెట్టి లేదా శూలము సగము భాగమును శిఖరమందు ప్రవేశపెట్టి ప్రతిష్ఠ చేయవలెను. ఇటుకలతో నిర్మించిన దేవాలయమందలి శూలమును దారువుతో నిర్మించవలెను. ఆలయము శిలానిర్మితమైనచో శూలము కూడ శిలానిర్మితము కావలెను. విష్ణ్వాది దేవాలయములందు కలశమును చక్ర సంయుక్తము చేయవలెను. ఆ కలశము దేవతామూర్తి ప్రమాణమునకు అనురూపముగా ఉండవలెను. కలశము త్రిశూల యుక్తమైనచో దానికి ‘అగ్రచూలము’ అని పేరు. దాని శిరోభాగమునందు శివలింగమున్నచో దానికి ‘ఈశ శూలము’ అని పేరు. శిరోభాగము బీజపూరకయుక్తమైనను ఇదియే పేరు అని శైవశాస్త్రములలో చెప్పబడినది. జంఘావేదితో సమానమైన చిత్తుగలది లేదా జంఘావేది ఎత్తులో సగము ఎత్తుగలది ‘చిత్రధ్వజము’ లేదా దాని మానదండమును అనుసరించిగాని, తమ ఇచ్చను అనుసరించి గాని ఉండవచ్చును. పీఠమును ఆవేష్టించి యున్నది. ‘మహాధ్వజము’. పదునాలుగు హస్తముల దండము ఉత్తమము. తొమ్మిది హస్తములది మధ్యమము, ఆరు హస్తములది అధమము అని విద్వాంసుల నిర్ణయము. ధ్వజదండములు ఎదురైనను, సాలవృక్ష సంబంధమైనదైనను సకల కామపూరకము. ఆరోపణ సమయమున ఈ ధ్వజము విరిగిపోయినచో రాజునకు గాని, యజమానునకుగాని హాని కలుగునని తెలియవలెను. అపుడు బహురూప మంత్రములతో వెనుక చెప్పిన విధముగ శాంతి చేయవలెను. ద్వారపాలాది పూజ, మంత్రతర్పణము చేసి, ధ్వజమును, దానిదండమును అస్త్రమంత్రముతో స్నానము చేయించవలెను. గురువు ఈ మంత్రముతో ధ్వజ ప్రోక్షణముచేసి, మట్టికషాయోదకము మొదలగు వాటితో దేవాలయమునుకూడ స్నానము చేయించవలెను. ధ్వజము పైభాగమున గంధాదులుపూసి, వస్త్రముచే ఆచ్ఛాదించి, మరల వెనుకటి వలెనే దానిని శయ్యపై ఉంచి, లింగమునకువలెనే న్యాసము చేయవలెను. కాని జ్ఞాన శక్తి క్రియాశక్తుల న్యాసము మాత్రము చేయరాదు. విశేషార్థబోధిక యగు చతుర్థి కూడ వాంఛనీయముకాదు. కుంభ, కుండాదుల ఏర్పాటు కూడ అనావశ్యకము. దండముపై, విద్యాతత్త్వమును, సద్యోజాతాది ముఖ పంచకమును న్యాసము చేయవలెను. పిదప ధ్వజముపై శివతత్త్వ న్యాసముచేసి, నిష్కల శివుని న్యాసముచేసి, హృదయాద్యంగపూజ చేయవలెను. పిదప, మంత్రజ్ఞుడైన గురువు, ధ్వజమునందును ధ్వజాగ్ర భాగము నందును, సంనిధీకరణము కొరకై ఫడంత సంహితా మంత్రములతో, ప్రత్యేక భాగమునందు హోమము చేయవలెను. మరియు ఇతర సంస్కారములు చేసినను, ఈ విధముగ అస్త్రయాగము చేసియే చేయవలెను. ఈ విషయములను పండితులు చేసి చూపించి యున్నారు.
దేవాలయమును కడిగి, పుష్పమాలావస్త్రాదులచే అలంకరించి, జంఘావేదిపై త్రితత్త్వాదిన్యాసము, హోమాదులు, శివపూజ వెనుకటివలెనే చేసి, సర్వతత్త్వమయమగు ఆ శివుని వ్యాపక స్వరూపమును ధ్యానించవలెను. శివుని చరణారవిందము నందు అనంత కాలరుద్రులను, పీఠమున కూష్మాండ, హాటక, పాతాళ, నరకములను భావన చేయవలెను. పిదప భువనములచేతను, లోకపాలులచేతను, శతరుద్రాదులచేతను పరివేష్టితమగు ఈ బ్రహ్మాండమును ధ్యానించి, జంఘావేదిపై స్థాపించవలెను. పృథ్వీ, జల, తేజో, వాయు, ఆకాశరూప పంచాష్టకములను, సర్వావరణ సంజ్ఞకములను, బుద్ధియోన్యష్టకమును, యోగ్రాకమును, ప్రళయమువరకు ఉండు త్రిగుణములను, తటస్థ పురుషుని, వామసింహమును కూడ జంఘావేదిపై భావన చేయవలెను. కాని మంజరీ వేదికపై విద్యాది తత్త్వ చతుష్టయము భావన చేయవలెను. కంఠమున మాయా రుద్రులను, అమల సారమున విద్యలను, కలశమున ఈశ్వర బిందు, విద్వేశ్వరులను భావన చేయవలెను. చంద్రార్ధ [vs1] స్వరూపమగు త్రిశూలమున జటాజూటభావన చేయవలెను. ఆ శూలముమీదనే త్రివిధ శక్తులను, దండమునందు నాభిని భావనచేసి, ధ్వజముపై కుండలినీశక్తిని భావన చేయవలెను. ఈ విధముగ ఆలయ అవయవములపై విభిన్న తత్త్వముల భావన చేయవలెను. జగతితో ప్రాసాద సంధానమును, పిండికతో లింగ సంధానమును భావనచేసి మిగిలిన విధానమునంతను వెనుకటివలె చేయవలెను. పిదప గురువు మంగళవాద్య ఘోషముతో, వేద ధ్వనితో, మూర్తిధరులతో కలిసి, శివరూపమగు మూలము గల ధ్వజదండమును ఎత్తి మంత్రోచ్చారణ పూర్వకముగ శక్తిమయకమల న్యాసము ఎచట చేయబడెనో, రత్నాది పంచకము ఉంచబడెనో, అట్టి ఆధార భూమిపై ఆ ధ్వజములు స్థాపించవలెను. ప్రాసాద శిఖరముపై ధ్వజారోహణమైన పిదప, యజమానుడు బంధుమిత్రాదులతో ఆలయ ప్రదక్షిణము చేసినచో సకలాభీష్ట ఫలములను పొందును. గురువు, అస్త్రాదులతో పాశుపతమును చాలసేపు ధ్యానించి, శస్త్రయుక్తులగు ఆ అధిపతుల నందరిని, దేవాలయ రక్షకై ప్రార్థించవలెను. న్యూనతాది దోష పరిహారార్థమై హోమ, దాన, దిగ్బల్యాదులు పూర్తిచేసిన పిదప యజమానుడు గురువునకు దక్షిణ ఈయవలెను. అలయ నిర్మాణ ప్రతిష్ఠలు చేసిన యజమానుడు ప్రతిమా, లింగ, వేదులలో ఎన్ని పరమాణువులుండునో అన్ని వేల యుగములపాటు, దివ్య లోకమునందు ఉత్తమ భోగములను అనుభవించును. ఇది అతడు పొందుఫలము. (102).
