అగ్ని మహా పురాణము
సూర్యపూజా విధానము
పరమేశ్వరుడు పలికెను: స్కందా! ఇపుడు అంగన్యాస కరన్యాసములతో సూర్య పూజా విధానమును చెప్పెదను. తేజోమయ సూర్యుడను నేనే” అని భావనచేసి అర్ఘ్య పూజనము చేయవలెను. ఎఱ్ఱటి చందనము కలిపిన జలమును లలాట సమీపమునకు తీసికొని వెళ్ళి దానితో అర్ఘ్య పాత్రమును నింపవలెను. దానిని గంధాదులతో పూజించి సర్వాంగములచే రక్షావగుంఠనము చేయవలెను. పిమ్మట జలముతో పూజాసామగ్రిని ప్రోక్షించి, పూర్వాభిముఖుడై సూర్యుని పూజ చేయవలెను. “ఓం ఆం హృదయాయ నమః” ఇత్యాది విధమున స్వరబీజము మొదటచేర్చి శిరస్సు మొదలగు అన్ని అవయవముల న్యాసము చేయవలెను. పూజాగృహ ద్వారమునందు కుడివైపున దండిని, ఎడమ వైపున పింగళుని పూజింపవలెను. “గం గణపతయే నమః” అను మంత్రముతో ఈశాన్య మున గణేశుని పూజింపవలెను. ఆగ్నేయమున గురుపూజ చేయవలెను. పీఠ మధ్యమునందు కమలాకార ఆసనము భావనచేసి పూజింపవలెను. పీఠము యొక్క ఆగ్నేయాది కోణములలో క్రమముగ విమల, సార, ఆరాధ్య, పరమసుఖములను, మధ్యభాగమున ప్రభూత ఆసనమును పూజింపవలెను.
విమలాదులు నాల్గింటి రంగులు వరుసగ శ్వేత, రక్త, పీత, నీలములుండును. వాటి ఆకారము సింహముతో సమానముగ నుండును. వీటిని అన్నింటిని పూజించవలెను. పీఠముపై నున్న కమలములోపల “రాం దీప్తాయై నమః” అను మంత్రముచే దీప్తా శక్తిని, “రీం సూక్ష్మాయై నమః” అను మంత్రముతో సూక్ష్మాశక్తిని, “రూం జయాయై నమః” అను మంత్రముచే జయాశక్తిని, “రేం భద్రాయై నమః” అను మంత్రముచే భద్రాశక్తిని, “రైం విభూతయే నమః” అను మంత్రముచే విభూతి శక్తిని, “రోం విమలాయై నమః” అను మంత్రముచే విమలాశక్తిని, “రౌం అమోఘాయై నమః” అను మంత్రముచే అమోఘా శక్తిని, “రం విద్యుతాయై నమః” అను మంత్రముచే విద్యుతాశక్తిని పూర్వాది దిక్కులు ఎనిమిదింటి యందును పూజించి, “ఈ సర్వతోముఖ్యై నమః” అను మంత్రముచే మధ్య భాగమునందు, తొమ్మిదవ పీఠశక్తియైన సర్వతోముఖిని పూజించవలెను. పిమ్మట “ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ సౌరాయ యోగపీఠాత్మనే నమః” అను మంత్రముచే సూర్యదేవుని పీఠమును పూజించవలెను. పిమ్మట ‘ఖఖోల్కాయ నమః” అను షడక్షర మంత్రమునకు ప్రారంభమున ‘ఓం హం ఖం’ అను అక్షరములు చేర్చి తొమ్మిది అక్షరములుగల “ఓం హం ఖం ఖఖోల్కాయ నమః” అను మంత్రము ద్వారా సూర్య విగ్రహా ఆవాహనముచేసి సూర్యుని పూజ చేయవలెను. దోసిటిలో ఉన్న ఉదకమును లలాట సమీపమునకు తీసికొని వెళ్ళి రక్తవర్ణుడైన సూర్యుని ధ్యానించి, ఆ సూర్యుడు తన ఎదుట ఉన్నట్లు భావన చేయవలెను. పిదప “హ్రాం హ్రీం సః సూర్యాయ నమః” అని పలుకుచు సూర్యునకు అర్ఘ్య మీయవలెను. పిదప బింబముద్ర చూపుచు ఆవాహనాద్యుప చారములు సమర్పింపవలెను. పిదప సూర్యుని ప్రీతికొరకై గంధాదికము సమర్పింపవలెను. ఆగ్నేయము నందు “ఓం ఆం హృదయాయ నమః” అనుమంత్రముచే హృదయమును, నైరృతి దిక్కు నందు “ఓం భూః అర్కాయ శిరసే స్వాహా” అను మంత్రముచే శిరస్సును, వాయవ్యమున “ఓం భువః సురేశాయ శిఖాయై వషట్” అను మంత్రముచే శిఖను, ఈశాన్యమునందు “ఓం స్వః కవచాయ హుం” అను మంత్రముచే కవచమును, ఇష్ట దేవతకును ఉపాసకునకును మధ్య “ఓం హాం నేత్ర త్రయాయ వౌషట్” అను మంత్రముచే నేత్రమును, దేవతకు పశ్చిమ భాగము నందు” వః అస్త్రాయ ఫట్” అను మంత్రముచే అస్త్రమును పూజింపవలెను. పిమ్మట పూర్వాది దిశలందు ముద్రలను ప్రదర్శింపవలెను.
హృదయ, శిరః, శిఖా, కవచములకు పూర్వాది దిక్కులందు ధేను ముద్రను ప్రదర్శింపవలెను. నేత్రములకు గోశృంగ ముద్ర చూపవలెను. అస్త్రమునకు త్రాసనీ ముద్ర చూపవలెను. పిమ్మట గ్రహములకు నమస్కారము, పూజ చేయవలెను. “ఓం సోం సోమాయ నమః” అను మంత్రముతో తూర్పునందు చంద్రుని, “ఓం బుం బుధాయ నమః” అను మంత్రముతో దక్షిణమున బుధుని, “ఓం బృం బృహస్పతయే నమః” అను మంత్రముతో పశ్చిమమున బృహస్పతిని, “ఓం భం భార్గవాయ నమః” అను మంత్రముతో శుక్రుని పూజింపవలెను. ఈ విధముగ పూర్వాది దిశలందు చంద్రాది గ్రహములను పూజించి ఆగ్నేయాది విదిక్కులందు మిగిలిన గ్రహములను పూజింపవలెను. ఎట్లనగా-“భౌం భౌమాయ నమః” అను మంత్రముతో ఆగ్నేయమున కుజుని, “ఓం శం శనైశ్చ రాయ నమః” అను మంత్రముతో నైరృతి దిక్కునందు శనైశ్చరుని, “ఓం రాం రాహవే నమః” అను మంత్రముతో వాయువ్యమునందు రాహువును, “ఓం కేం కేతవే నమః” అను మంత్రముతో ఈశాన్యమునందు కేతువును గంధాద్యుపచారములతో పూజింపవలెను. ఖఖోల్కీ (సూర్య భగవానుని) తో పాటు ఈ అన్ని గ్రహములపూజ కూడ చేయవలెను. మూలమంత్రము జపించి, అర్ఘ్యపాత్రమునందు జలము గ్రహించి సూర్యునకు సమర్పించి, పిదప స్తుతించవలెను. ఈ విధముగ స్తుతి చేసిన పిదప అభిముఖముగ నిలబడి సూర్యునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. “ప్రభో! నా అపరాధములను, లోపములను క్షమింపుము”. పిమ్మట “అస్త్రాయ ఫట్” అను మంత్రముతో అణుసంహార సమాహరణము చేసి, “శివసూర్య” అని పలుకుచు సంహారిణీ ముద్ర ద్వారా సూర్యుని ఉపసంహృతమగు తేజస్సును తన హృదయ కమలములో నుంచి సూర్య నిర్మాల్యమును ఆతని పార్షదుడైన చండునకు సమర్పింపవలెను. ఈ విధముగ జగదీశ్వరుడగు సూర్యుని పూజచేసి, ధ్యాన హోమములు చేయుటచే సాధకుని మనోరథములు అన్నియు సిద్ధించును. (78)
