అగ్ని మహా పురాణము

Table of Contents

శాంతి కళా శోధన విధానము

పరమేశ్వరుడు చెప్పెను: పూర్వోక్త విధానముచే విద్యాకళను శాంతికళతో విధి పూర్వకముగ సంధానము చేయవలెను. అందుకు ‘ఓం హాం హూం హాం’ అనునది మంత్రము. శాంతికళలో ఈశ్వరుడు, సదాశివుడు అను రెండు తత్త్వములు ఇమిడి యున్నవి. దీని వర్ణములు హకార క్షకారములు. భువనములలో సమాన నామధేయులు గల రుద్రులు వీరు-ప్రభవ, సమయ, క్షుద్ర, విమల, శివ, ఘన, నిరంజన, అంగార, సుశిరా, దీప్తకారణ, త్రిదళేశ్వర, కాలదేవ, సూక్ష్మ, అంబుజేశ్వరులను పదునాలుగురు రుద్రులు శాంతికళలో ప్రతిష్ఠితులు. ‘వ్యోమవ్యాపినే, వ్యోమరూపాయ, సర్వవ్యాపినే, శివాయ, అంతాయ, అనాధాయ, అనాశ్రితాయ, ధ్రువాయ, శాశ్వతాయ, యోగపీఠ సంస్థితాయ, నిత్యయోగినే, ధ్యానాహరాయ’ అనునవి పండ్రెండు పదములు. పురుష, కవచములు రెండు మంత్రములు. బిందు జకారములు బీజములు. అలంబుష, యశ అనునవి రెండునాడులు. కృకర-కూర్మములు రెండు ప్రాణ వాయువులు. త్వక్కు హస్తములు రెండు ఇంద్రియములు. విషయము స్పర్శ, స్పర్శ-శబ్దములు రెండు గుణములు. ఈశ్వరుడు ఏకైక కారణము. దీనిఅవస్థ తురీయావస్థ. ఈ విధముగ భువనాది సకల తత్త్వములను శాంతికళలో ఉన్నట్లు భావనచేసి, వెనుకటివలెనే, తాడన, భేదన, హృదయ ప్రవేశ, చైతన్య వియోజన, ఆకర్షణ గ్రహణములు చేయవలెను. పిదప శాంతి ముఖసూత్రముచే చైతన్యమును తనలో ఆరోపించుకొని, కళను గ్రహించి, కుండమునందు ఉంచవలెను. పిమ్మట ఈశ్వరుని ఈ విధముగ ప్రార్థించవలెను. ‘ఓ పరమేశా! నేను ఈ ముముక్షువునకు నీ అధికారము నందు దీక్ష ఇచ్చుచున్నాను. ఈతనికి అనుకూలుడవుగ నుండుము.’ మాతాపిత్రా వాహనాదికము, శిష్యతాడనాదికముచేసి, చైతన్యమును గ్రహించి ఆత్మతో యోజనము చేయవలెను. వెనుకటి వలెనే మాతాపితృ సంయోగభావనచేసి, హృదయ మంత్ర సంపుటితమగు ఆత్మ బీజము ఉచ్చరించుచు, ఉద్భవవాడితో ఆ చైతన్యమును దేవీగర్భము నందుంచవలెను. దేహోత్పత్తి కొరకు హృదయ మంత్రముతోను, జన్మకొరకు శిరో మంత్రముతోను, అధికార సిద్ధికొరకు శిఖామంత్రముతోను, భోగము కొరకు కవచ మంత్రముతోను, లయకొరకు శస్త్ర మంత్రముతోను, స్రోతః శుద్దికొరకు శివ మంత్రముతోను, తత్త్వశోధనము కొరకు హృదయ మంత్రముతోను ఐదేసి హోమములు చేయవలెను. గర్భాధానాది సంస్కారములు గూడ వెనుకటివలెనే చేయవలెను.

పాశ శైథిల్యము కొరకును, నిష్కృతికొరకును, కవచ మంత్రము నూర్లు సార్లు జపించవలెను. మలశక్తి తిరోధానము కొరకు శస్త్రమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. పిమ్మట అస్త్ర మంత్రమును ఏడు పర్యాయములు జపించి, బీజ యుక్తాస్త్ర మంత్ర రూప ఖడ్గముతో (ఓం హౌం శాన్తి కలాపాశాయ నమః హాం హూం ఫట్) పాశమును ఛేదించవలెను. వెనకటివలెనే అస్త్ర మంత్రముతో పాశ విమర్దన వర్తులీకరణములు చేసి నేతితో నింపిన స్రువములో ఉంచి, కలాస్త్ర మంత్రముతో దానిని హోమము చేయవలెను. పాశాంకుర నివృత్తి కొరకై అస్త్రమంత్రముతో ఐదు ఆహుతులు ఇచ్చి ప్రాయశ్చిత్త నివారణార్థమై ఎనిమిది హోమములు చేయవలెను. ‘ఓం హం అస్త్రాయ హూం ఫట్’ అనునది మంత్రము. హృదయ మంత్రముతో ఈశ్వరుని ఆవాహనచేసి పూజా తర్పణాద్యనంతరము ‘ఓం హాం ఈశ్వర, బుద్ధ్యహఙ్కారౌ శుల్కం గృహాణ స్వాహా’ అను మంత్రముతో యథాశాస్త్రముగ శుల్కమును సమర్పించవలెను. పిదప ఈశ్వరునకు ‘ఈశ్వరా! ఈ పశువు పాశములు అన్నియు దగ్ధములైనవి. ఇక నీవు వీనికి బంధములు కలిగించరాదు.’ పిమ్మట ఈశ్వరుని విసర్జించి ఆత్మలో రౌద్రీశక్తిని చేర్చవలెను. ఈశ్వరుడు చంద్రునకు తన శిరస్సుపై ఆశ్రయము ఇచ్చినట్లు శిష్యుని జీవాత్మను గురువు తన ఆత్మతో సంబంధింపచేయవలెను. పిదప దానిని శుద్ధా-ఉద్భవముద్రతో సూత్రమునందు చేర్చి, అమర బిందు స్వరూపమగు ఆ చైతన్య సూత్రమును, మూల మంత్రముతో, శిష్యుని శిరముపై నుంచవలెను. పిదప అగ్నిని, పితరులను పుష్పాదులతో పూజించి, విసర్జనము చేసి, సమస్త విధాన సంపూర్తి కొరకై, పూర్ణాహుతి ఇవ్వవలెను. తాడనాదికము వెనుకటి వలెనే చేయవలెను. ఈ కళకు సంబంధించిన బీజమును ఉపయోగించుట ఒక్కటియే విశేషము. ఈ విధముగ శాంతి కళా శుద్ధి చెప్పబడినది. (87)