అగ్ని మహా పురాణము

Table of Contents

ధ్యాన నిరూపణము

అగ్నిదేవుడు పలికెను: ‘ధ్యై-చింతాయాం ‘ అని ధాతువు చెప్పబడినది. విక్షేపము లేని మనస్సుతో మాటిమాటికి విష్ణువును చింతించుట ధ్యానము. సమస్త ఉపాధి విముక్తమును సమనస్కమును అగు ఆత్మ బ్రహ్మ చింతాలగ్నమైవుండుట ధ్యానము. ధ్యేయముపై నిలచి ఉన్నదియు, సదృశ ప్రత్యయములు మాత్రము కలదియునగు మనస్సు ఇతర ప్రత్యయములు లేకుండగ ఉండుట కూడ ధ్యానము. ఏ ప్రదేశమునందైనను చిత్తమును ధ్యేయమునందు నిలిపి ఏకైక జ్ఞానము కలిగి ఉండుట ధ్యానము. ఇట్టి ధ్యానమునందు లగ్నుడై స్వదేహమును త్యజించినవాడు కులమును, స్వజన మిత్రులను ఉద్ధరించి హరిసారూప్యమును పొందును. ఈ విధముగా ముహూర్తకాలముగాని, అర్ధ ముహూర్తము గాని, శ్రద్ధా పూర్వకముగ హరిని ధ్యానించువాడు. ఏ గతిని పొందునో ఆ గతిని సకల మహాయజ్ఞములచేత కూడ పొందశక్యము గాదు.

ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ధ్యాన ప్రయోజనము అను ఈ చతుష్టమును తెలుసు కొని తత్త్వవేత్తయై యోగాభ్యాసము చేయవలెను. యోగాభ్యాసము వలన అష్టవిధ ఐశ్వర్యములు, ముక్తి కలుగును. జ్ఞాన వైరాగ్యవంతుడు, శ్రద్ధాళువు, క్షమాశీలుడు, విష్ణు భక్తుడు, సర్వదా ధ్యానము చేయువాడు అగు సాధకుడే ధ్యాత. పరబ్రహ్మ, మూర్తము, అమూర్తము అని రెండు విధములు. హరి ధ్యానము చింతనము. సర్వజ్ఞుడైన శ్రీ మహా విష్ణువు సకలుడు, నిష్కలుడని తెలుసుకొనవలెను. అణిమాద్వైశ్వర్య ప్రాప్తియు ముక్తియు ధ్యానమునకు ప్రయోజనము. కర్మఫలము నిచ్చువాడు విష్ణువు. అందుచే ఆ పరమేశ్వరుని ధ్యానించవలెను. నడచునపుడు, నిలిచినపుడు, నిద్రపోవుచున్నపుడు, మేల్కొన్నపుడు, కండ్లు తెరచినపుడు, మూసినపుడు, శుచిగా ఉన్నను, అశుచిగా ఉన్నను సర్వదా పరమేశ్వరుని ధ్యానించవలెను. తన దేహము అనెడు మందిరము మధ్య మనస్సులో హృదయపీఠ మధ్యమునందు కేశవుని స్థాపించి ధ్యానయోగముతో పూజించవలెను. ధ్యానయజ్ఞము చాల శ్రేష్ఠమైనది. సకల దోషరహితమైనది. అట్టి యజ్ఞముచేసి ముక్తి పొందవలెను. బాహ్యశుద్ధి మాత్రము గల యజ్ఞములచే ముక్తి లభింపదు. ధ్యానము హింసా దోషరహితమగుటచే చిత్తశుద్ధికి ఉత్తమ సాధనము. అందువలన ధ్యాన యజ్ఞము ఉత్తమమైనది, మోక్ష ఫలము నిచ్చును. అందువలన అశుద్ధమైనదియు అనిత్యము బాహ్య సాధనములు కలదియు అగు యజ్ఞాది కర్మను త్యజించి యోగాభ్యాసము చేయవలెను. ప్రారంభమున వికారయుక్తము, అవ్యక్తము భోగ్యభోగ సమన్వితము అగు గుణత్రయమును క్రమముగ హృదయమునందు ధ్యానించవలెను. తమోగుణమును రజోగుణముచే ఆచ్ఛాదించి రజో గుణముచే సత్త్వ గుణమును ఆచ్ఛాదించవలెను. ప్రారంభమున వరుసగా కృష్ణ, రక్తసితములగు మూడు మండలములను ధ్యానించవలెను. సత్త్వోపాధి గుణాతీతుడగు ఇరువది యైదవ తత్త్వము పురుషుడు, ఆశుద్ధములగు మొదట చెప్పిన గుణాధులను క్రమముగ త్యజించి శుద్ధమగు ఈ పురుష తత్త్వమును ధ్యానించవలెను. పురుషుని పైన నాభినుండి ఒక దివ్యపంజకము ప్రకటమై యున్నది. అది ఐశ్వర్యరూపము. అది పండ్రెండు అంగుళముల విస్తారముతో పరిశుద్ధమై వికసించి శ్వేతవర్ణముతో ఉండును. నాభి కందము నుండి పుట్టిన దాని మృణాలము ఎనిమిది అంగుళముల పొడవుగలది. దాని ఎనిమిది పత్రములే ఎనిమిది అణిమాది గుణములు. దాని కర్ణిక జ్ఞానము. దాని నాళము ఉత్తమ వైరాగ్యము. విష్ణుధర్మమే దానికి అందము. ఈ విధముగా పద్మమును భావన చేయవలెను. ధర్మ జ్ఞాన వైరాగ్య రూపము శివైశ్వర్యమయము, శ్రేష్ఠమగు ఆ పద్మాసనమును తెలుసుకొన్నవాడు సర్వ దుఃఖములను దాటును.

ఆ పద్మము యొక్క కర్ణికా మధ్యమున శుద్ధ దీపశిఖ వంటి ఆకారము కలవాడును, అంగుష్ట మాత్ర ప్రమాణము కలవాడును నిర్మలుడును ఓంకార స్వరూపుడును, కంద పుష్పమువలె గోళాకారముగల తారారూపము కలవాడును అగు పరమేశ్వరుని ధ్యానించవలెను. లేదా ఈ కమలముపైన ప్రకృతి పురుషుల కంటే అతీతుడగు పరమాత్మ ఉన్నట్లు ధ్యానము చేయుచు ఆ పరమాత్మ కిరణ సముదాయముతో నలువైపుల ప్రకాశింపచేయునట్లు భావించుచు ధ్యానించవలెను. పరమాక్షరమగు ఆ ‘ఓం’ కారమును సర్వదా ధ్యానించవలెను, సాధకుడు మనస్సును స్థిరము చేసుకొనుటకై ముందుగా స్థూలమును ధ్యానించవలెను. మనస్సు స్థిరమైన పిమ్మట దానిని సూక్ష్మముపై నిలుపుట శక్యమగును. నాభి కమలమున దశాంగుల దీర్ఘమగు నాళము వున్నది. దానిపై పండ్రెండు అంగుళముల విస్తారము గల అష్టదళ పద్మము ఉన్నది. కర్ణికా కేసరములు గల దానిపై సూర్య, సోమ, అన్ని మండలములున్నవి. ఆ అన్ని మండల మధ్యమున శంఖ, చక్ర, గదా, పద్మములు ధరించిన చతుర్భుజుడగు విష్ణువుగాని, శార్ఙ్గ అక్షవలయ, పాశాంకుశములను కూడ ధరించిన అష్టభుజవిష్ణువుగాని ఉన్నట్లు భావించవలెను. ఆతని విగ్రహము సువర్ణ వర్ణమై లేదా శ్వేత వర్ణమై ఉండును. ఆతడు పీతాంబరధారియై, శ్రీవత్స, కౌస్తుభ-వనమాలా, సువర్ణహార, మకర కుండల రత్నోజ్జ్వల కిరీటములను ధరించి యుండును. ఈ విధముగ సర్వాభరణ భూషితుడగు ఆతని ఆకారము జానెడు వున్నట్లుగాని, ఇచ్ఛానుసారము అంతకంటే అధికముగా వున్నట్లుగానే భావన చేయవచ్చును. నేనే జ్యోతిరాత్మాయగు బ్రహ్మను, ఓంకారరూపమగు దేవుడను, విముక్తుడను అని ధ్యానము చేయవలెను. ధ్యానముచేసి అలసినవాడు మంత్రమును జపించవలెను. జపము వలన అలసినవాడు ధ్యానము చేయవలెను. ఈ విధముగ జపధ్యానాదులు చేయువానికి విష్ణువు ప్రసన్నుడగును. యజ్ఞములన్నియు జపయజ్ఞము యొక్క పదునారవ వంతుకు కూడ సరితూగవు. జపము చేయువానిని వ్యాధులుకాని, ఆధులుగాని, గ్రహములుకాని పీడించవు. జపము వలన భుక్తిని ముక్తిని మృత్యు జయమును పొందును. (874)