అగ్ని మహా పురాణము

Table of Contents

గంగా మాహాత్మ్యము

అగ్ని దేవుడు పలికెను-

ఇపుడు గంగా మాహాత్మ్యమును చెప్పెదను. సర్వదా గంగను సేవించవలెను. గంగ భుక్తి ముక్తి ప్రదాయిని. ఏ దేశములందు గంగ ప్రవహించునో ఆ దేశములు పవిత్రములు. ఉత్తమగతిని అన్వేషించువారికి గంగ ఒక్కటియే సర్వోత్తమగతి. గంగను సేవించినచో మాతృపితృ వంశములు రెండును ఉద్ధరింపబడును. వేయి చాంద్రాయణ వ్రతములు చేయుట కంటె గంగాజల పానము ఉత్తమము. ఒక మాసము గంగాసేవ చేసినవాడు సకల యజ్ఞముల ఫలములు పొందును. గంగాదేవి సకల పాపములను తొలగించును, స్వర్గమునిచ్చును. గంగాజలములో ఎముక పడి ఉన్నంత కాలము, ఆ జీవుడు స్వర్గములో నివసించును. అంధాదులు గంగాసేవ చేసి దేవతాతుల్యులగుదురు. గంగాతీర్థమునుండి మట్టి తీసి ధరించువాడు సూర్యుడు వలె సకలపాపములను నశింపచేయును. గంగాదర్శన, స్పర్శ, జలపానములు చేయువాడును, గంగానామ సంకీర్తన చేయువాడును తన వంశము నందలి ఎన్నో వేల తరముల వారిని పవిత్రము చేయును. (110)