అగ్ని మహా పురాణము
ప్రాయశ్చిత్తములు – 2
పుష్కరుడు చెప్పెను:
ఇటుపై పాపములకు ప్రాయశ్చిత్తములను చెప్పెదను. బ్రహ్మహత్య చేసినవాడు కుటి నిర్మించుకొని పండ్రెండు సంవత్సరములు వనములో నివసించవలెను. శిరస్సు గుర్తును తన దేహముపై ఏర్పరచుకుని ఆత్మశుద్ధికై భిక్షాన్నము తినవలెను. లేదా ప్రజ్వలించుచున్న అగ్నిలో తలక్రిందులుగా తన శరీరమును పడవేయవలెను. లేదా అశ్వమేధ యాగము గాని, స్వర్గలోకమును ఇచ్చు గోసవము కాని చేయవలెను. లేదా ఏదైన ఒక వేదమును జపించుచు, నూరు యోజనములు నడచి వెళ్లవలెను, లేదా వేదవేత్తయగు బ్రాహ్మణునికి తన సర్వస్వమును ఇచ్చివేయవలెను. మహాపాతకము చేసినవారు ఈ వ్రతములచే తమ పాపములను తొలగించుకొందురు. ఉపపాతకములు చేసిన వాడును, గోహత్య చేసిన వాడును ఒక మాసము యవలు త్రాగవలెను. ముండనము చేయించుకొని, గోచర్మమును కప్పుకొని గోష్టమునందు నివసించవలెను. ఉప్పు, పులుపులేని ఆహారమును మితముగా దినమునందలి నాల్గవ భాగమున తినవలెను. నియంతేంద్రియుడై రెండు మాసములు గోమూత్రముతో స్నానము చేయవలెను. పగలు గోవుల వెంట వెళ్లుచు, నిలబడి గోపరాగమును (ఆవు గిట్ట యందలి దుమ్ము కలిపిన జలము) త్రాగవలెను. వ్రతము పూర్తిచేసికొని పదిగోవులను, ఒక వృషభమును దానము చేయవలెను. అందుకు శక్తి లేనిచో వేదవేత్తలకు సర్వస్వమును దానము చేయవలెను. గోవును నిరోధించగా అవి చనిపోయినచో ఒక పాదము, ప్రాయశ్చిత్తమును కట్టివేయుటచే చనిపోయినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తము నాగలికి కట్టినపుడు చనిపోయినచో మూడు వంతులును, కొట్టగా చనిపోయినచో పూర్తిగను ప్రాయశ్చిత్తము చేయవలెను. అడవులందును, దుర్గములందును, విషమ ప్రదేశములందును, భయములందును గోవుకు ఆపద కలిగినచో ఒక పాదము ప్రాయశ్చిత్తము విహితము. అలంకారార్థమై ఘంటాదులు కట్టుటచే మరణించినచో రెండు పాదముల ప్రాయశ్చిత్తము. గోవును దమనము చేయునపుడు (ఆవును లొంగదీసుకొనుట యందు) గాని, చేయించునపుడు గాని, కట్టినపుడు గాని, గుదికఱ్ఱ, గొలుసు, పాశము కట్టుటచేగాని మరణించినచో మూడువంతులు ప్రాయశ్చిత్తము ఆచరించవలెను. గోవుకు కొమ్ము విరిగినను, ఎముక విరిగినను, తోక తెగినను దానికి పూర్తి ఆరోగ్యము చేకూరువరకును, గంజి త్రాగవలెను. గోమతీ విద్యను జపించుచు, గో స్తుతి-గోమతులను స్మరించుచుండ వలెను. దైవవశమున ఒక గోవును అనేకులు చంపినచో వారు ఒక్కొక్కరు పాదము చొప్పున ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. గోవుకు సహాయము చేయబోగా అది మరణించినచో పాపములేదు. ఉప పాతకములు చేసిన వారందరును, అవకీర్ణి (వ్రత మధ్యమునందు స్త్రీ సంగమము చేసినవాడు) తప్ప ఇతరులకు, శుద్ధి నిమిత్తమై, ఈ వ్రతమునే చేయవలెను. లేదా చాంద్రాయణము చేయవలెను.
అవకీర్ణి మాత్రము (వ్రతమధ్యమునందు స్త్రీ సంగము చేసినవాడు) రాత్రియందు చతుష్పథమున, నిరృతిని ఉద్దేశించి నల్లని గాడిదను పాకయజ్ఞ విధానమున పూజించవలెను. పిమ్మట ఆ ధీమంతుడు ‘సమాసిఞ్చన్తు మరుతః’ ఇత్యాది ఋక్కుతో చంద్ర, ఇంద్ర, గురువులను ఉద్దేశించి ఘృతాహుతి ఇవ్వవలెను. లేదా గార్దభ చర్మముకప్పికొని ఒక సంవత్సరము భూమిపై సంచరించవలెను. తెలియక భ్రూణహత్య చేసినవాడు బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక సురాపానము చేసిన బ్రాహ్మణుడు అగ్నివలె కాలుతున్న సురగాని, గోమూత్రమును గాని, జలముగాని త్రాగవలెను. సువర్ణము అపహరించిన బ్రాహ్మణుడు రాజు వద్దకు వెళ్ళి నేను ఈ అపరాధము చేసితిని, నాకు దండమును ఇమ్ము’ అని చెప్పవలెను. ఈ విధముగ తనంతట తాను వచ్చి చెప్పిన వానిని రాజు ముసలముతో ఒక్క దెబ్బ కొట్టవలెను. ఈ విధముగ చచ్చుటచే గాని, తపస్సు చేయుటచే గాని సువర్ణస్తేయము చేసిన బ్రాహ్మణుని పాపము తొలగును. గురుపత్నీ గమనము చేసినవాడు స్వయముగ శిశ్నమును, వృషణములను ఖండించుకొని, వాటిని దోసిటిలో ఉంచుకొని చనిపోవువరకును నైరృతి దిక్కు వైపు వెళ్లవలెను. లేదా నియతేంద్రియుడై చాంద్రాయణ వ్రతము చేయవలెను. జాతి భ్రంశకరమగు పాపమేదైన తెలిసి చేసినవాడు ‘సాంతపన కృఛ్చ్రమును’, తెలియక చేసినవాడు ‘ప్రాజాపత్య కృచ్చమును’ చేయవలెను. ‘సంకరీకరణ’, ‘అపాత్రీకరణ’ పాపములు చేసినవాడు చాంద్రాయణ వ్రతము చేయవలెను. ‘మలినీకరణ’ పాపము చేసినవాడు మూడు దినములు తప్త యావకమును త్రాగవలెను. క్షత్రియ వధ చేసినవాడు బ్రహ్మ హత్యా ప్రాయశ్చిత్తములో నాల్గవవంతు చేసికొనవలెను. వైశ్యుని వధించినచో ఎనిమిదవ వంతు, సదాచారవంతుడైన శూద్రుని వధించినచో పదునారవ వంతు ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. పిల్లి, ముంగిస, నెమలి, కప్ప, కుక్క, ఉడుము, గుడ్లగూబ, కాకి-వీటినిగాని, నాలుగు వర్ణములకు చెందిన ఏ స్త్రీనైన గాని చంపినచో శూద్రహత్యా ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. సర్పాదులను చంపినపుడు నక్త వ్రతమును, ఎముకలు లేని జీవులను చంపినప్పుడు ప్రాణాయామము చేయవలెను.
ఇతరుల గృహము నుండి అల్పమైన సారముగల వస్తువుల చౌర్యము చేసినవాడు కృచ్ఛ్ర సంతపనము చేయుటచే శుద్ధుడగును. భక్ష్య భోజ్యములను-యాన-శయ్యా, ఆసనములను, పుష్ప-ఫల-మూలములను అపహరించినవానికి పంచగవ్యప్రాశనము ప్రాయశ్చిత్తము. తృణ-కాష్ఠ-వృక్షములను, బెల్లమును, వస్త్రమును, చర్మమును, మాంసమును అపహరించినవాడు మూడు రోజులు భోజనము చేయరాదు. మణులు, ముత్యములు, ప్రవాళములు, రాగి, వెండి, ఇనుము, కంచు, రాళ్లు అపహరించినవాడు పండ్రెండు రోజులు కొంచెము అన్నము మెతుకులు మాత్రము తినవలెను. నూలు, పట్టు, ఉన్ని బట్టలను, రెండు డెక్కలుగల పశువులను, ఒక డెక్కగల పశువులను, పక్షులను, గంధములను, ఓషధులను, త్రాడును అపహరించినవాడు మూడు దినములు పాలు మాత్రమే త్రాగవలెను. సమానోదరులగు స్త్రీలతోను, మిత్ర-పుత్రాది స్త్రీలతోను, బాలికలతోను, అంత్యజాతి స్త్రీలతోను, మేనత్త కుమార్తెతోను, సోదరితోను, తల్లి సోదరి కుమార్తెతోను, తల్లి సోదరుని కుమార్తెతోను, ఆప్తుని స్త్రీతోను సంగమము చేసినవాడు చాంద్రాయణ వ్రతము చేయవలెను. మనుష్య భిన్న పశ్వాదులందును, రజస్వలయందును, యోనిభిన్న ప్రదేశములందును, జలమునందును రేతఃసేకము చేసినవాడు కృచ్ఛ్ర సంతపనము చేయవలెను. ఎద్దుల బండి యందును, నీటియందు, పగటి భాగమునందు స్త్రీతోగాని, పురుషునితో గాని మైథునము చేసిన ద్విజుడు సచేల స్నానము చేయవలెను. విప్రుడు తెలియక చండాల స్త్రీతోగాని, అంత్యజాతి స్త్రీలతోగాని సమాగమము చేయుట, భుజించుట, దానము పట్టుట అను పనులు చేసినచో పతితుడగును. తెలిసిచేసినచో వారితో సముడైపోవును. చెడిపోయిన స్త్రీని భర్త ఒక ఇంటిలో నిరోధించి ఉంచి, పరదార సంబంధముగల పురుషుడు ఏ వ్రతము చేయవలెనో ఆ వ్రతమును ఈమెచే చేయించవలెను. సమాన జాతీయునిచే పిలవబడి ఆమె మరల చెడిపోయినచో కృచ్ఛ్రమును, చాంద్రాయణమును చేయవలెను. దానితో ఆమె పవిత్రురాలగును. ద్విజుడు ఒక రాత్రి శూద్రస్త్రీ సమాగమము చేసిన పాపమును, నిత్యము భిక్షాన్నము తినుటద్వారా మూడు సంవత్సరములలో పోగొట్టుకొనును. (169)
