అగ్ని మహా పురాణము

Table of Contents

ద్వారప్రతిష్ఠా విధానము

పరమేశ్వరుడు చెప్పెను: ఇప్పుడు ద్వారమునకు సంబంధించిన ప్రతిష్ఠావిధి చెప్పెదను. ద్వారాంగ భూతములగు ఉపకరణములను కషాయజలాదులతో సంస్కరించి, శయ్యపై ఉంచవలెను. ద్వారము యొక్క మూల, మధ్య, అగ్ర భాగములందు ఆత్మ, విద్యా, శివ తత్త్వముల న్యాసముచేసి సంరోధనీ ముద్రచే వాటిని నిరోధించవలెను. పిదప తగిన హోమ జపములు చేసి, ద్వారాధోభాగమున అనంత దేవతా మంత్రముతో వాస్తు దేవతా పూజ చేయవలెను. అచటనే రత్నాది పంచక ముంచి శాంతి హోమము చేయవలెను. పిదప యవలు, ఆవాలు, ఆక్రాంతా, బుద్ధి, వృద్ధులను ఓషధులు, తెల్ల ఆవాలు, మహా తిలలు, గోపీచందనము, దరదము నాగకేసరము, మోహిని, లక్ష్మణ, అమృత, గోరోచనము, ఆరగ్వధము, దూర్వలు దేవాలయము పునాదుల క్రిందవేసి, పొట్లము కట్టి ద్వార రక్షణార్థమై దాని పైన ప్రణవము ఉచ్చరించుచు కట్టవలెను. ద్వారము కొంచెము ఉత్తరము వైపు నిలుపవలెను. ద్వార అధోభాగమున ఆత్మతత్త్వమును రెండు పార్శ్వములందును విద్యాతత్త్వమును, ఆకాశదేశము నందును, పూర్తి ద్వారమండల మందును సర్వవ్యాపి శివతత్త్వమును న్యాసము చేయవలెను, పిదప మూలమంత్రముతో మహేశ నాధుని న్యాసము చేయవలెను. ద్వారమును ఆశ్రయించి ఉండునంది మొదలగు ద్వార పాలకులకొరకు, వారి నామములకు నమః చేర్చి నూరులేదా ఏబది హోమములు చేయవలెను. శక్తి ఉన్నచో రెట్టింపు హోమములు చేయవలెను. న్యూనాతిరిక్తతా దోష పరిహారార్థమై అస్త్రమంత్రముతో నూరు హోమములు చేయవలెను. పిదప మొదట చెప్పిన విధముగ దిక్కులందు బలులు ఇచ్చి దక్షిణాది ప్రదానము చేయవలెను. (100)