అగ్ని మహా పురాణము

Table of Contents

శకున వర్ణనము-1 

పుష్కరుడు పలికెను:

పరశురామా! యాత్రా సమయమున, శ్వేత వస్త్రములు, స్వచ్ఛమైన ఉదకము, ఫలభరితమగు వృక్షము, నిర్మలాకాశము, క్షేత్రములలోని సస్యములు, నల్లని ధాన్యము కనబడుట అశుభము. దూది, తృణములు కలిసిన ఎండిన గోమయము (పిడకలు), సుత్తి, బొగ్గులు, గుడము, కరాయల, తల గొరిగించుకొని తైలము పట్టించుకొనిన నగ్న సాధువు, ఇనుము, బురద, చర్మము, వెండ్రుకలు, పిచ్చివాడు, నపుంసకుడు, చండాలుడు, కారాగారాధికారి, గర్భిణి, విధవ, తెలక పిండి, మృత్యువు, ఊక, బూడిద, నిప్పులు, ఎముకలు, బ్రద్దలైన పాత్రలు-ఇవి యుద్ధయాత్రా సమయమునందు కనబడుట అశుభము. బ్రద్దలైన తాళము చిప్పల ధ్వనివలె భయంకరముగ వినవచ్చు వాద్యధ్వని మంచిదికాదు. ‘బయలుదేరిరమ్ము’ అను శబ్దము ముందు నుండి వినబడినచో శుభము; వెనుక నుండి వినవచ్చినచో అశుభము. ‘వెళ్ళుము’ అను శబ్దము వెనుక నుండి వినబడినచో శుభము; ముందు నుండి వినబడినచో అశుభము. ‘ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఆగుము; వెళ్ళకుము. అచటికి వెళ్ళుటచే నీకేమి లాభము? ఇట్టి మాటలు అనిష్ట సూచకములు. ధ్వజాదులపై గ్రద్ద మొదలగు మాంసాహారి పక్షులు కూర్చున్నను, అశ్వ-గజాది వాహనములు తొట్రుపడి పడిపోయినను, ఆయుధము విరిగిపోయినను, ద్వారాదులు తగిలి శిరస్సుపై దెబ్బతగిలినను, ఛత్ర వస్త్రాదులను ఎవ్వడైనను క్రింద జార విడచినను, ఈ అపశకునములు అన్నియు మృత్యు కారకములు. శ్రీమహావిష్ణువును పూజించి స్తుతించినచో అమంగళములు తొలగిపోవును. రెండవ పర్యాయము కూడ ఈ అపశకునములు కనబడినచో ఇంటికి తిరిగి వచ్చివేయవలెను.

యాత్రా సమయమున తెల్లని పుష్పములు కనబడుట శుభప్రదము. జలపూర్ణ కుంభము కనబడుట అత్యుత్తమము. మాంసము, మత్స్యములు, దూరమునుండి కోలాహలము, ఒంటరియైన వృద్ధుడు, మేకలు, గోవులు, అశ్వములు, గజములు, దేవప్రతిమలు, మండుచున్న అగ్ని, దూర్వలు, గోమయము, వేశ్య, బంగారము, వెండి, రత్నములు, వన ఆవాలు మొదలైన ఓషధులు, పెసలు, ఆయుధములలో ఖడ్గము, ఛత్రము, బల్ల, రాజ చిహ్నములు, కూడా విలపించువారు లేని శవము, ఫలములు, నెయ్యి, పెరుగు, పాలు, అక్షతలు, అద్దము, తేనె, శంఖము, చెరకు, శుభ సూచకములు అగు మాటలు, భక్తుల గాన-వాద్య వాదనములు, మేఘ గంభీర గర్జనము, మెరుపు మెరయుట, మనః సంతోషము-ఇవన్నియు శుభశకునములు. శుభశకునములు అన్నియు ఒకప్రక్క మనః ప్రసాదము ఒక ప్రక్క-ఈ రెండును సమానములు. (230)