అగ్ని మహా పురాణము

Table of Contents

లక్షహోమ, కోటి హోమములు

పరమేశ్వరుడు పలికెను:

హోమము చేయుటచే యుద్ధమునందు విజయము కలుగును, విఘ్నము నశించును. ముందుగా కృచ్ఛ్ర వ్రతముచేసి దేహమును శుద్ధము చేసికొనవలెను, నూరు ప్రాణాయా మములతో శరీరమును శుద్ధముచేసికొని జలమునందు నిలిచి గాయత్రీ జపము చేసి పదునారు ప్రాణాయామములు చేయవలెను. పూర్వాహ్ణమునందు అగ్నిలో ఆహుతులు సమర్పించవలెను. భిక్షాప్రాప్తమగు యవనిర్మిత భోజ్యపదార్థములను, ఫల-మూలములను, క్షీరమును, పేలాలపిండిని, ఘృతమును యజ్ఞకాలమున ఆహారముగా తీసికొనవచ్చును. పార్వతీ! లక్షహోమములు పూర్తి అగునంతవరకు ఒక పర్యాయమే భోజనము చేయవలెను. లక్షహోమములు పూర్ణాహుతి చేసిన పిమ్మట గోవులను, వస్త్రములను, సువర్ణమును దక్షిణగా ఇవ్వవలెను. ఏ విధమైన ఉత్పాతములు కనబడినను ఐదుగురు లేదా పది మంది ఋత్విక్కులతో పైన చెప్పిన యజ్ఞము చేయించవలెను. ఈ లోకములో దీనిచే శాంతించని ఉత్పాతమేదియు లేదు. దీనిని మించిన మంగళకరమైనది మరేదియు లేదు. పూర్వోక్త విధానము ప్రకారము ఋత్విక్కులచే ఈ యజ్ఞము చేయించిన రాజు ఎదుట శత్రువు రణరంగమున నిలువ జాలడు. ఆతని రాజ్యములో అతివృష్టి, అనావృష్టి, ఎలుకలబాధ, మిడుతల బాధ, చిలుకలబాధ, భూత రాక్షసాధులు, యుద్ధమునందు సమస్త శత్రువులు నశించును. కోటి హోమముల కొరకు ఇరువదిమంది గాని, వందమంది గాని, వేయిమందిగాని, బ్రాహ్మణుల వరణము చేయవలెను. దీనిచే యజమానునకు అభీష్ట ధన వైభవ ప్రాప్తి కలుగును. కోటి హోమాత్మక యజ్ఞము చేసిన బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని ఏది కోరిన అది పొందగలుగును. అతడు సశరీరముగ స్వర్గమునకు వెళ్లును. హోమ పూజాదులు గాయత్రీ మంత్ర, గ్రహ మంత్ర, కూష్మాండ మంత్ర, అగ్ని మంత్ర, ఐంద్ర మంత్ర, వారుణ, వాయవ్య, యామ్య, ఆగ్నేయ, వైష్ణవ, శాక్త, శైవ, సూర్య మంత్రములు-వీటిలో చేయు పద్ధతి చెప్పబడినది. లక్షహోమము సకలదుఃఖములను తొలగించును. కోటి హోమము సకల క్లేశములను నశింప చేయును, సకల పదార్థములను ఇచ్చును. యవ, ధాన్య, తిల, క్షీర, ఘృత, కుశ, ప్రాసాతికా, కమల, నల, బిల్వ, ఆమ్రదళములు హోమమునకు తగిన పదార్థములు. కోటిహోమమునకు ఎనిమిదిహస్తముల లోతు అగ్ని కుండమును, లక్షహోమమునందు నాలుగు హస్తముల లోతు అగ్నికుండమును నిర్మింప వలెను. అయుత, లక్ష, కోటి హోమములందు ఆజ్యము ఉపయోగించవలెను. (149)