అగ్ని మహా పురాణము

Table of Contents

ధనుర్వేద వర్ణనము-4

అగ్నిదేవుడు చెప్పెను:

వశిష్ఠా! భ్రాంత, ఉద్భ్రాంత, ఆవద్ధ, ఆపుత, విష్ణుత, సంపాత, సముదీర్ణ, శ్యేనపాత, ఆకుల, ఉద్ధూత, అవధూత, సవ్య, దక్షిణ, అనాలక్షిత, విస్ఫోట, కరాలేంద్ర, మహాసఖ, వికరాల, నిపాత, విభీషణ, భయానక సమగ్ర, అర్ధ, దృతీయాంశ, పాద, పాదార్ధ, వారిజ, ప్రత్యాలీడ, ఆలీడ, వరాహ, లులితములు అనునవి యుద్ధ రంగమున చూపు కత్తి డాలుతో యుద్ధము చేయునపుడు చూపు ఇరువది రెండు చలనక్రమములు. వీటిని తెలుసుకొనవలెను. పాశమును విసరుటలో పరావృత్త, అపావృత్త, గృహీత, లఘు, ఊర్ధ్యక్షిప్త, అధఃక్షిప్త, విధారిత, శ్యేనపాత, గజపాత, గ్రాహ్య గ్రాహ్యములు అను పదునొకండు ప్రకారములున్నవి. వ్యస్తపాశమున మహాత్ములు, ఋజు, ఆయత, విశాల, తిర్యక్, భ్రామితములను ఐదు కర్మలు చెప్పిరి. ఛేదన, భేదన, పాత, భ్రమణ, శమన, వికర్తన, కర్తనములను ఏడును చక్ర కర్మలు. ఆస్పోట, క్ష్వేడన, భేద, త్రాస, ఆందోలితక, ఆఘాతములను ఆరును శూల కర్మలు, ద్విజోత్తమా! దృష్టిఘాత, భుజఘాత, పార్శ్వఘాత, ఋజుపాత, పక్షపాత, ఇషుపాతములనునవి తోమర కార్యములు.

విప్రశ్రేష్ఠా! ఆహత, విహృత, ప్రభూత, కమలాసన, నతోర్ధ్వగాత్ర, నమిత, వామదక్షిణ, ఆవృత్త, పరావృత్త, పాదోద్ధూత, ఆవపుత, హంసమర్ద, విమర్దములు గదా కర్మలు. కరాల, అవఘాత, దంశోపప్లుత, క్షిప్తహస్త, స్థిత, శూన్యములు పరశు కర్మలు. తాడన, భేదన, చూర్ణన, ప్లవన, ఘాతనములు ముద్గర కర్మలు. సంశ్రాంత, విశ్రాంత గోవిసర్గ, సుదుర్ధరములు భిందిపాల, లగుడముల కర్మలు. అంత్య, మధ్య, పరావృత్త, విదేశాంతములు వజ్ర పట్టిశముల కర్మలు. హరణ, ఛేదన, ఘాత, భేదన, రక్షణ, పాతన, స్ఫోటనములు కృపాణ కర్మలు. త్రాసన, రక్షణ, ఘాత, బలోద్ధరణ ఆయతములు క్షేపణీ కర్మలు; యంత్ర కర్మలు కూడ ఇవియే. సత్యాంగ, అవదంశ, వరాహోద్ధూతక, హస్తావహస్త, అలీన, ఏకహస్త, అవహస్తక, ద్విహస్త, బాహుపాశ, కటిరేచితక, ఉద్గత, ఉరోఘాత, లలాటఘాత, భుజావిధమన, కరోద్ధూత, విమాన, పాదాహతి, విపాదిక, గాత్రసంశ్లేషణ, శాంత, గాత్ర విపర్యయ, ఊర్ధ్వ ప్రహార, ఘాత, గోమూత్ర, సవ్య దక్షిణ, పారక, తారక, దండ, కబరీబంధ, ఆకుల, తిర్యగ్బంధ, అపామార్గ, భీమవేగ, సుదర్శన, సింహాక్రాంత, గజాక్రాంత, గర్దభాక్రాం తములు గదాయుద్ధ చలనములని తెలియవలెను. ఇపుడు మల్ల యుద్ధ గతులను చెప్పెదను.

ఆకర్షణ, వికర్షణ, బాహుమూల, గ్రీవా పరివర్తన, సుదారుణ పృష్ఠ, భంగ, పర్యాసన, విషర్యాసన, పశుమార, ఆజావిక, పాదప్రహార, ఆస్ఫోట, కటిరేచితక, గాత్రాశ్లేష, స్కంధగత, మహీవ్యాజన, ఉరోలలాట ఘాత, విస్పష్టకరణ, ఉర్ధూత, అవధూత, తిర్య ఙ్మార్గగత, గజస్కంధ, అవక్షేప, అపరాఙ్ముఖ, దేవమార్గ అధోమార్గ, అమార్గ, గమనాకుల, యష్టిఘాత, అవక్షేప, వసుధారణ, జానుబంధ, భుజాబంధ, సుదారుణగాత్ర బంధ, విషృష్ఠ, సోదక, శ్వభ్ర, భుజావేష్టితములు (మల్లయుద్ధ గతులు) కవచము ధరించి, అస్త్రశస్త్ర సంపన్నుడై, గజాది వాహనారూఢుడై యుద్ధరంగమున ప్రవేశించవలెను. ఏనుగుమీద ఇద్దరు మావంటి వాండ్రు ఉత్తమమైన అంకుశములు ధరించి ఉండవలెను. వారిలో ఒకడు మెడమీదను రెండవవాడు భుజముమీదను కూర్చుండవలెను. వీరుకాక ఇద్దరు ధనుర్ధరులు, ఇద్దరు ఖడ్గధారులుకూడ ఏనుగుపై కూర్చుండవలెను. ఒక్కొక్క రథమును, గజమును రక్షించుటకు ముగ్గురేసి ఆశ్వికులు ఉండవలెను. అశ్వమును రక్షించుటకై ధనుర్ధరులైన ముగ్గురేసి కాలి బంటులు ఉండవలెను. ధనుర్ధల రక్షణము నిమిత్తము కత్తి, డాలు ధరించిన యోధులను నియమించవలెను. ఒక్కొక్క ఆయుధమును దానికి సంబంధించిన మంత్రముతో పూజించి, త్రైలోక్యమోహన కవచము’ పఠించి, యుద్ధ రంగమునందు ప్రవేశించువాడు శత్రువులపై విజయము పొంది, భూతలమును రక్షించును. (252)