అగ్ని మహా పురాణము
మన్వంతర వర్ణనము
అగ్నిదేవుడు చెప్పెను:
ఇపుడు మన్వంతరములను గూర్చి చెప్పెదను. స్వాయంభువ మనువు మొదటివాడు. అగ్నీ ధ్రాదులు ఆతని కుమారులు. ఈ స్వాయంభువ మన్వంతరమున దేవతలు యములు, ఔర్వాదులు సప్తర్షులు, శతక్రతువు ఇంద్రుడు. రెండవది స్వారోచిష మన్వంతరము. పారావతులు, తుషితులు అనువారు దేవతలు. చైత్ర కింపురుషులు స్వారోచిష మనువు కుమారులు. విపశ్చిత్తు ఇంద్రుడు, ఊర్జస్వంతుడు మొదలగువారు సప్తర్షులు. మూడవ వాడు ఉత్తముడు. అజాదులు అతని పుత్రులు, అతని మన్వంతరమున సుశాంతి ఇంద్రుడు; సుధామాదులు దేవతలు; వసిష్ఠపుత్రులు సప్తర్షులు, నాల్గవ మనువు తామసుడు. ఆతనికి ఖ్యాతి మొదలగువారు తొమ్మండుగురు కుమారులు. ఆతని మన్వంతరమున స్వరూపాదులు దేవతలు. శిఖరి ఇంద్రుడు. జ్యోతిర్హోమాదులు సప్తర్షులు. ఖ్యాతి మొదలగు తొమ్మండుగురు సుతులు. ఐదవదగు రైవత మన్వంతరమున వితథుడు ఇంద్రుడు. అమితాభులు దేవతలు. హిరణ్య రోమాదులు సప్తర్షులు. బలబంధాదులు రైవతుని కుమారులు. ఆరవదైన చాక్షుష మన్వంతరమున మనోజవుడు ఇంద్రుడు. స్వాత్యాదులు దేవతలు. సుమేధన్ మొదలగువారు సప్తర్షులు. పురు మొదలగువారు చాక్షుషుని పుత్రులు. ఏడవ మన్వంతరమున సూర్య పుత్రుడైన శ్రాద్ధదేవుడు మనువాయెను. ఈతని మన్వంతరమున ఆదిత్య, వసు, రుద్రాదులు, దేవతలు. పురందరుడు ఇంద్రుడు. వసిష్ఠ, కాశ్యప, అత్రి, జమదగ్ని, గౌతమ, విశ్వామిత్ర, భరద్వాజులు సప్తర్షులు. ఇది ఇప్పుడు జరుగుతూన్న మన్వంతరము. వైవస్వతమనువునకు ఇక్ష్వాకు మొదలగువారు పుత్రులు. ఈ అన్ని మన్వంతరములందును శ్రీమహావిష్ణువు అంశావతారరూపమున అవతరించెను. స్వాయంభువమన్వంతరమునందు ‘మానసుడు’ అను పేరుతోను, పిదప మిగిలిన ఆరు మన్వంతరములందు, క్రమముగా-అజిత, సత్య, హరి, దేవవర, వైకుంఠ, వామన రూపములతోను అవతరించెను. ఛాయాదేవి గర్బసంజాతుడైన పుత్రుడు సావర్ణి ఏడవ మనువు కాగలడు. ఇతని వర్ణము (శరీరచ్ఛాయ) తన అన్నదైన శ్రాద్ధ దేవుని శరీరచ్ఛాయతో సమానముగా ఉండును. అందుచే ‘సావర్ణి’ అని పేరు. ఇతని కాలమున సుతపన్ మొదలగువారు దేవతలు గాన పరమతేజః శాలులైన అశ్వత్థా మాధులు సప్తర్షులుగాను, బలి ఇంద్రుడుగాను అగుదురు. విరజాదులు మనుపుత్రులు. తొమ్మిదవ మనువు పేరు దక్షసావర్ణి. ఆతని మన్వంతరమున పారాదులు దేవతలుగాను, అద్భుతుడు ఇంద్రుడుగాను, సవనుడు మొదలగువారు సప్తర్షులుగాను అగుదురు. మను పుత్రుడు ధృతకేతువు. పదవ మనువు బ్రహ్మ సావర్ణి. సుఖాదులు దేవగణములుగాను, శాంతి ఇంద్రుడుగాను, హవిష్యాదులు సప్తర్షులుగాను అగుదురు. సుక్షేత్రాదులు మనుపుత్రులు,
పిదప ధర్మసావర్ణి అను పదునొకండవ మనువు అధికారమునందుండును. ఆ మన్వంతరము నందు విహంగాదులు దేవతలు, గణుడు ఇంద్రుడు; నిశ్చరాదులు సప్తర్షులు కాగలరు. సర్వత్ర గాదులు, మనుపుత్రులగుదురు. పండ్రెండవ మనువు రుద్రసావర్ణి. ఆ మన్వంతరమున ఋత ధాముడు ఇంద్రుడు. హరితాదులు దేవతలు. తపస్యాదులు సప్తర్షులు అగుదురు. దేవవంతుడు మొదలగు వారు మనుపుత్రులు అగుదురు. పదమూడవ మనువు రౌచ్యుడు. ఆ సమయమున సుత్రామణ్యాధులు దేవతలుగను, దివస్పతి ఇంద్రుడుగను అగుదురు. ఈ ఇంద్రుడు దైత్యదాన వాదులను మర్దించును. నిర్మోహాదులు సప్తర్షులుగ ఉందురు. చిత్రసేనాదులు మనుపుత్రులు. పదునాల్గవ మనువు భౌత్యుడు. ఆ సమయమున శుచి ఇంద్రుడుగను, చాక్షుషాదులు దేవతలుగను, అగ్ని బాహ్వాదులు సప్తర్షులుగను ఉందురు. ఉరుమొదలగువారు మనుపుత్రులు. సప్తర్షులు భూమండలముపై వేద ప్రచారము చేయుచుందురు. దేవతా గణములుగా పూజింపబడుదురు. మను పుత్రులు ఈ భూమిని పాలింతురు. ఓ మునీ ! ఒక్క బ్రహ్మ దివసమున పడునాలుగురు మనువులు ఆవిర్భవింతురు. దేవతా ఇంద్రాదులు పదునాల్గుసార్లు పుట్టుదురు. ద్వాపరాంతమున శ్రీమహా విష్ణువు వేదవ్యాస రూపమున అవతరించి, వేదవిభాగము చేయును. మొట్టమొదట వేదము ఒక్కటే. దానిలో నాలుగు చరణములు, ఒక లక్ష ఋక్కులు ఉన్నవి. మొదట యజుర్వేద మొక్కటిగానే ఉండగా వ్యాసుడు దానిని నాల్గుగా విభజించెను.
అధ్వర్యువు యజుర్వేదముచేతను, హోత ఋగ్వేదము చేతను, ఉద్గాత సామ మంత్రముల చేతను, బ్రహ్మ అథర్వ వేదముచేతను, తమ తమ ఆర్త్విజ్యము నడుపవలెనని నిశ్చయించెను. వ్యాసుని ప్రథమ శిష్యుడైన పైలుడు ఋగ్వేద పారంగతుడు. ఇంద్రుడు ప్రమతికిని, బాష్కలునకును సంహితను ఇచ్చెను. బాష్కలుడు తన సంహితను నాల్గుగా విభజించి బౌద్ధాదులకు ఇచ్చెను. వ్యాస శిష్యుడును, బుద్ధిమంతుడును అగు వైశంపాయనుడు యజుర్వేదమను వృక్షమునకు ఇరువది ఏడు శాఖలు నిర్మించెను. యాజ్ఞవల్క్యాదులు కాణ్వ-వాజసనేయాది శాఖలను సంపాదించిరి. వ్యాసశిష్యుడైన జైమిని సామవేదమను వృక్షమునకు శాఖలు నిర్మించెను. సుమంతు-సుకర్మలు ఒక్కొక్క సంహిత రచించిరి. సుకర్మ తన గురువునుండి వెయ్యి సంహితలను గ్రహించెను. వ్యాస శిష్యుడైన సుమంతుడు అథర్వ వేదమునకు ఒకశాఖ ఏర్పరచి పైప్పలుడు మొదలగు వేలకొలది శిష్యులకు నేర్పెను. వ్యాసుని అనుగ్రహముచే సూతుడు పురాణ సంహితా విస్తారము చేసెను. (150)
