అగ్ని మహా పురాణము

Table of Contents

శిక్షా నిరూపణము

అగ్నిదేవుడు పలికెను: ఇపుడు శిక్ష చెప్పెదను. మొత్తము వర్ణములు అరువది మూడు లేదా అరువది నాలుగు. వీటిలో ఇరువది ఒక్క స్వరములు, ఇరువది యైదు స్పర్శలు, ఎనిమిది యాదులు, నాలుగు యమములు చెప్పబడినవి. అనుస్వార విసర్గలు, పరాశ్రితములగు జిహ్వా మూలీయ ఉపధ్మానీయములు, దుస్సృష్ట లకారము, ఇవి అరువది మూడు వర్ణములు. ప్లుతలు కారము చేర్చినచో అరువది నాలుగు. అనుస్వారోచ్చారణము ఖే. అరా వలె ఉండును. ‘హ’ అనునది ‘ఙ్’ కారాది పంచమాక్షరములు, య, ర, ల, వ, లు వీటితో కలిసినపుడు ఉరస్యమగును. వీటితో సంయుక్తము కానిచో కంఠ్యము ఆత్మ బుద్ధితో పదార్థములను ఆలోచించి చెప్పవలెనను ఇచ్ఛచే మనస్సుతో కలియును. ఆ మనస్సు జఠరాగ్నిని కొట్టును. జఠరాగ్ని వాయువును ప్రేరేపించును. ప్రాణవాయువు హృదయమునందు చరించుచు ప్రాతస్సవన కర్మకు సాదరమును, గాయత్రి ఛందస్స మాశ్రితమును అగు మంద్రస్వరమును పుట్టించును. పిదప ప్రాణవాయువు కంఠమున తిరుగుచు మాధ్యందినయుతమగు మంత్రోపయోగియైన మధ్యమ స్వరమును పుట్టించును. పిదప ఆ వాయువు శిరోదేశమును చేరి ఉచ్చ ధ్వని యుక్తమగు జగతీచ్ఛంద సమాశ్రితయైన సాయంసవన కర్మ సాధనమైన స్వరమును పుట్టించును. పైకి వెళ్లిన ఆ ప్రాణవాయువు మూర్ధస్థానమున ఆఘాతము చెంది ముఖము నందలి కంఠాదిస్థానము నందు చేరి వర్ణములను పుట్టించును. స్వరము, కాలము, స్థానము ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నము వీటిని బట్టి వర్ణములలో ఐదు విభాగములు ఉండును. వక్షము, కంఠము, మూర్ధా, జిహ్వామూలము, దంతములు, నాసిక, ఓష్ఠములు, తాలువు అని ఎనిమిది వర్ణోచ్చారణ స్థానములు. ఊష్మ వర్ణములకు విసర్గా భావము. వివర్తనము, సంధ్య భావము శకారాదేశము, షకారాదేశము, సకారాదేశము, రేఫాదేశము, జిహ్వామూలీయత్వము, ఉపధ్మానీయత్వము అని ఎనిమిది విధములైన గతులుండును. ఉకారము పరమగునపుడు ఓకార ప్రసంధానము అయినచో ఆ ఓ కారము స్వరాంతమని తెలియవలెను. దీనికి భిన్నముగ సంతి స్థలమున ఏర్పడు ఓ కారము ఊష్మయొక్క గతివిశేషము. చెడ్డ గురువు నుండి లభించిన వేదాధ్యయనము దగ్ధమై నీరసముగ నుండును. అక్షరములను ఇటులాగి అటులాగి అర్థము చెప్పినచో అది భక్షితము ఉత్తమ గురువునుండి అధ్యయనము చేసినచో అది శుభకరము. సుస్వరముతో మంచి వక్త్రముతో చేయబడిన వేదాధ్యయనము ప్రకాశవంతముగ ఉండును. వికృతమైన ఆకారము లేనివాడు, లంబోష్టుడుకాని వాడు, అవ్యక్తోచ్చారణ చేయనివాడు, ముక్కుతో పలకనివాడు, గద్గద కంఠము లేనివాడు, జిహ్వాబంధము లేనివాడు అట్టి మనుష్యుడే వర్ణములను సరిగా ఉచ్చరింప గలుగును. వర్ణములను అవ్యక్తముగా గాని, పీడితములుగా గాని ఉచ్చరించకూడదు. వర్ణ ప్రయోగము చక్కగా చేసినచో బ్రహ్మలోకమున పూజించబడును. ఉదాత్తము, అనుదాత్తము స్వరితము అని స్వరము మూడు విధములు. ఉచ్చారణ కాలమును బట్టి హ్రస్వము దీర్ఘము ప్లుతము అని మూడు విధములు. అ, హ, కారములు కంఠ్యములు. ఇ, చ వర్గ య కార ‘శ’ కారములు తాలవ్యములు ‘ఉ’ కార పవర్గము, ఓష్ఠ్యములు ఋకార ‘ట’ వర్గ, రేఫ షకారములు మూర్ధన్యములు. ‘ఐ’కార ‘త’ వర్గ ‘ల’కార ‘స’వర్ణములు దంత్యములు ‘క’వర్గ జిహ్వా మూలీయము, ‘వ’కారము దంత్యోష్ఠ్యము ‘ఏఐ’కారములుకంఠతాలవ్యములు ‘ఓ ఔ’ కారములు కంఠోష్ట్య జములు. ఏ ఐ ఓ ఓఔ లలో, కంఠస్థానీయమగు ఆకారము యొక్క అర్ధమాత్ర ఉండును. అయోగవాలు తమ ఆశ్రయమునకు ఏ స్థానమో ఆస్థానము కల్గియుండును. అచ్చులు అస్పృష్టములు యణ్ లు ఈషత్స్పృష్టములు, శల్’ లు అర్ధ స్పృష్టములు మిగిలిన హల్లులు స్పృష్టములు. ఞ మ్ లు అనునాసికములు. ఆరేపలు అను నాసికములు కావు. హ, ఝ, షలకు సంవార ఘోషనాద ప్రయత్నములు, యణ్ జశ్ లకు ఈషన్నాద ప్రయత్నము ఖ, ఫ, మొదలగునవి వివార అఘోష శ్వాసప్రయత్నకములు చర్ లు ఈశచ్ఛ్యాసములు. (336)