అగ్ని మహా పురాణము

Table of Contents

మహానదిలో సంధ్యోపాసన

అగ్ని దేవుడు పలికెను:

మహానదిలో గాయత్రీ మంత్రముతోడనే స్నానము చేసి సంధ్యోపాసన చేయవలెను. ప్రాతః కాలమునందు గాయత్రీ సముఖమున శ్రాద్ధ పిండ దానములు అక్షయములగును. సూర్యోదయ సమయమునందు, మధ్యాహ్న కాలమునందును స్నానముచేసి గీత వాద్యాదులతో సావిత్రీ ఉపాసనచేసి, తత్సముఖముననే సంధ్యావందన మాచరించి నదీ తటమున పిండదానము చేయవలెను. పిదప అగస్త్య పదమున పిండదానము చేసి, యోని ద్వారమున ప్రవేశించి బైటకు రావలెను. ఇట్లు చేసినవాడు మరల మాతృయోని యందు ప్రవేశించడు; అతనికి పునర్జన్మ ఉండదు. పిదప వాయుతీర్థములందు పిండదానము చేయవలెను. పిదప ఆకాశగంగా, కపిలాతటములపై పిండదానము చేయవలెను. అచట కపిలేశ్వరుడగు శివునకు నమస్కరించి అమోఘపద, గదాలోల, వాసరక, గోప్రచార తీర్థములందు పిండ ప్రదానము చేయవలెను. వైతరణియందు గోవుకు నమస్కారము చేసి, పిండదానము చేసినవాడు ఇరువది యొక్క తరములను ఉద్ధరించును. వైతరణీ తీరముపై శ్రాద్ధపిండదానములు చేసి పిదప క్రౌంచపాదమున పిండదానము చేయవలెను. తృతీయాలిథియందు విశాలా, నిశ్చలా ఋణమోక్ష, పాపమోక్షములందు పిండప్రదానము చేయవలెను. భస్మకుండము నందు భస్మ స్నానము చేసినవాడు సర్వపాప విముక్తుడగును. అచట జనార్దనునకు నమస్కరించి ఈ విధముగా ప్రార్థించవలెను ‘జనార్దనా! ఈ పిండమును నీ చేతిలో ఉంచుచున్నాను. నాకు ఇది పరలోకము నందు అక్షయ రూపమున లభించుగాక’. సాక్షాత్ విష్ణుమూర్తియే గయలో పితృదేవతా రూపమున విరాజిల్లుచున్నాడు. ఆ పుండరీకాక్షుని దర్శనము చేసికొనినవాడు ఋణత్రయ విముక్తుడగును. పిదప మార్కండే యేశ్వరునకును గృధ్రేశ్వరునకును నమస్కారము చేయవలెను. మహాదేవుని మూల క్షేత్రమైన ధారలో పిండ ప్రదానము చేయవలెను. గృధ్ర కూట, గృధ్రవట, ధౌత పాదములందు కూడ పిండ ప్రదానము చేయవలెను. పుష్కరిణి కర్దమాల, రామ తీర్థములందు పిండ ప్రదానముచేసి, ప్రభాసేశ్వరునకు నమస్కరించి, ప్రేతశిలపై పిండ ప్రదానము చేయవలెను.

‘దివ్యలోక, అంతరిక్షలోక, భూలోకములలో ప్రేతరూపమున ఉన్న నా పితరులు, ఇతర బంధువులును, ఈ పిండముల ప్రభావముచే ముక్తి పొందుదురుగాక అని చెప్పుచూ పిండ ప్రదానము చేయవలెను. గయాశీర్షము, ప్రభాస తీర్థము, ప్రేతకుండము అను మూడు స్థానములందు ప్రేతశిల అత్యన్తపావనమైనదని చెప్పబడినది. ఇచట పిండ ప్రదానము చేయువాడు కులోద్ధారము చేసిన వాడగును. వసిష్ఠేశ్వరునకు నమస్కరించి ఆతని ఎదుట పిండప్రదానము చేయవలెను. గయానాభి, సుషుమ్నా, మహాకోష్ఠులందు కూడ పిండ ప్రదానము చేయవలెను. గదాధరుని ఎదుట, ముండ పృష్ఠముపై, దేవీ సమీపమున పిండ ప్రదానము చేయవలెను. వారి పూజచే భయము నశించును. విష రోగాదులు దూరమగును. బ్రహ్మకు నమస్కరించినవాడు తన కులమును బ్రహ్మలోకమునకు పంపును. సుభద్రను, బలభద్రుని, పురుషోత్తముని పూజించినవాడు సకల కామములను పొంది కులమును ఉద్ధరించును! అంతమున స్వర్గమునకు పోవును. హృషీకేశునకు నమస్కరించి ఆతని ఎదుట పిండప్రదానము చేయవలెను. మాధవుని పూజించినవాడు విమానములో సంచరించుచు దేవతగా అగును. మహాలక్ష్మి, గౌరీ, సరస్వతుల పూజ చేసినవాడు తన పితరులను ఉద్ధరించి, తాను కూడ స్వర్గమునకు వెళ్ళి అచట భోగములు అనుభవించి, తిరిగి ఈ లోకమునందు జనించి శాస్త్ర విచారము చేయు పండితుడగును. పిదప ద్వాదశాదిత్యులను అగ్నిని, రేవంతకుని, ఇంద్రుని పూజించినవాడు రోగాది విముక్తుడై అంతమున స్వర్గమునకు పోవును. శ్రీ వరసిద్ధి వినాయకుని, కార్తికేయుని పూజించువానికి నిర్విఘ్నముగ సిద్ధి లభించును. సోమనాథ, కాళేశ్వర, కేదార, ప్రపితా మహ, సిద్ధేశ్వర, రుద్రేశ్వర, రామేశ్వర, బ్రహ్మకేశ్వరులను ఎనిమిది గుప్త లింగములను పూజించుటచే మానవుడు సర్వమును పొందగలడు. లక్ష్మిప్రాప్తి కోరువాడు నారాయణునకు, వారాహునకు, నరసింహునకు నమస్కరించవలెను. బ్రహ్మకును విష్ణువునకును, త్రిపుర నాశకుడగు మహేశ్వరునకును గూడ ప్రణామము చేయవలెను. వారు అన్ని కోరికలను తీర్చు దేవతలు. సీతా, రామ, గరుడ, వామనులను పూజించువాడు సకల కామములను పొందును. పితరులను బ్రహ్మ లోకమునకు పంపును. దేవతా సహితుడైన ఆదిగదాధరుని పూజించినవాడు ఋణత్రయ విముక్తుడై తన కులముసంతను తరింపచేయును.

ప్రేతశీల దేవ రూపమైనది అగుటచే పరమపవిత్రమైనది. గయలో ఆ శిల దేవమయి. గయలో ఎవరిపేర ఈ పిండదానము చేసినను అది అతనిని సనాతన బ్రహ్మమునందు ప్రతిష్ఠింపచేయును. ఫల్గీశ్వర, ఫల్గుచండీ, అంగారకేశ్వరులకు నమస్కరించి మతంగముని స్థానమునందు పిండప్రదానము చేయవలెను. పిదప భరతాశ్రమమునందు కూడ పిండ ప్రదానము చేయవలెను. అదేవిధముగ హంసతీర్థ, కోటి తీర్థములందు గూడ చేయవలెను. పాండుశిలానదమున్న స్థానము నందు అగ్నిధారా, మధుశ్రవా తీర్థములందు పిండదానము చేయవలెను. పిదప ఇంద్రేశ్వర, కిలకిలేశ్వర, వృద్ధి వినాయకులకు నమస్కరించి, ధేనుకారణ్యమున పిండ ప్రదానముచేసి ధేను పదమునందు గోవుకు నమస్కారము చేయవలెను. అందరు పితరులును ఉద్ధరింపబడుదురు. పిదప సరస్వతీ తీర్థమునకు వెళ్ళి పిండ ప్రదానము చేయవలెను. సాయంకాలమున సంధ్యోపాసన చేసి సరస్వతీదేవికి నమస్కరించవలెను. ఇట్లు చేయువాడు త్రికాల సంధ్యావందనము చేయు, వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడు అగును. గయా ప్రదక్షిణముచేసి అక్కడనున్న బ్రాహ్మణులను పూజించుటచే గయాతీర్థములో చేసిన అన్నదానాదిక పుణ్యము అక్షయ మగును. గదాధరుని స్తుతించి ఈ విధముగా ప్రార్థించవలెను. ‘ఆదిదేవుడును, గదాధారియు గయానివాసియు, పితరులకు సద్గతినిచ్చువాడును, యోగదాతయు అగు గదాధరునకు ధర్మార్ధ కామ మోక్షప్రాప్తికై నమస్కరించుచున్నాను. అతడు దేహేంద్రియ మనో బుద్ధి ప్రాణ అహంకార శూన్యుడు. నిత్యశుద్ధ, బుద్ధ, ముక్త, స్వభావుడు. ద్వైత శూన్యుడు దేవదానవాది వందితుడు దేవతలను, దేవీగణమునకు కూడ సర్వదా ఆయన సేవ చేయుచుందురు. నేను అతనికి నమస్కరించుచున్నాను! అతడు కలి కల్మషములను, కలిపీడను తొలగించువాడు. అతని కంఠమున వనమాల ప్రకాశించుచున్నది. సకలలోక పాలకులను పాలించువాడు కూడ ఆతడే. అందరి కులములను ఉద్ధరించుటకై నిశ్చయించుకొని యున్నవాడు. తన స్వరూపమును వ్యక్తావ్యక్త రూపములగు అన్ని వస్తువులందును విభజించియున్నను అతడు వాస్తవమున అవిభక్త స్వరూపుడు. అత్యంత స్థిరుడు సార భూతుడు; భయంకరములగు పాపములను తొలగించువాడు. నేను అతని చరణములకు నమస్కరించుచున్నాను. దేవా! గదాధరా! నేను నాపితరులకు శ్రాద్ధము చేయుటకై గయకు వచ్చినాను. నీవే ఈ విషయమున సాక్షిగా నుండుము. నేనీనాడు ఋణత్రయ విముక్తుడ నైతిని. బ్రహ్మ రుద్రాది దేవతలు నాకు సాక్షులుగా ఉందురుగాక. గయవచ్చి నేను పితరులను ఉద్ధరించితిని. శ్రాద్ధాది సమయములందు ఈ గయా మాహాత్మ్యమును పలి కించుటచే మానవుడు బ్రహ్మ లోకమునకు పోవును. గయలో చేసిన పితృశ్రాద్ధము అక్షయము. అక్షయ బ్రహ్మలోకమును ఇచ్చును. (116)