అగ్ని మహా పురాణము
యుద్ధ జయార్ణవమున నానాచక్ర వర్ణన
పరమేశ్వరుడు చెప్పెను: ‘ఓం హ్రీం కర్ణమోటని బహురూపే బహుదంష్ట్రే హూం ఫట్ ఓం హః ఓం గ్రస గ్రస, కృన్త, కృన్త, ఛక, ఛక, హూం ఫట్ నమః’-ఇది కర్ణమోటీ మహావిద్య. ఇది అన్ని వర్ణములందును రక్ష నిచ్చునది. ఈ మంత్రమును చదివినంత మాత్రముననే మనుష్యుడు క్రోధావిష్టుడగును, వానికండ్లు ఎర్రబడును. ఈ మంత్రము మారణ, పాత, మోహన, ఉచ్చాటనముల యందు ఉపయోగించును. అపుడు స్వరోదయముతో పాటు పంచవిధ వాయుస్థానములను, వాటి ప్రయోజనములను చెప్పెదను. హృదయమునుండి నాభివరకును వాయు సంచారము జగుచుండును, దానికి మారుతచక్రమని పేరు. జపహోమాదులు చేయు సాధకుడు క్రోధవంతుడై, దానిచే సంగ్రామాది కార్యములందు ఉచ్చాటనాది కార్యములు చేయును. కర్ణములనుండి నేత్రముల వరకును ఉన్న వాయువుచే ప్రభేదన కార్యమును, హృదయమునుండి గుదము వరకును ఉండు వాయువుచే జ్వర దాహములను శత్రు మారణమును చేయవలెను. ఈ వాయువు పేరు వాయు చక్రము. హృదయము నుండి కంఠము వరకును ఉన్న వాయువునకు రసమని పేరు. దీనికి రసచక్రమని పేరు. దీనిచే శాంతి ప్రయోగము చేయబడును. దాని గుణము పౌష్టిక రసతుల్యము. కనుబొమ్మల నుండి నాసికా భాగము వరకును ఉన్న వాయువు పేరు దివ్యము. దీనికి తేజశ్చక్రమని పేరు. దీనికి గంధము గుణము. దీనిచే స్తంభన-ఆకర్షణములు చేయబడును. సాధకుడు మనస్సును నాసికాగ్రమునందు స్థిరముచేసి, నిస్సందేహముగ స్తంభన-కీలనములు చేయును. పైన చెప్పిన వాయు చక్రమునందు చండఘంటా, కరాలీ, సుముఖీ, దుర్ముఖీ, రేవతీ, ప్రథమా, ఘోర అను శక్తులను అర్చించవలెను. ఉచ్చాటనము చేయు శక్తులు తేజశ్చక్రమునందు ఉండును. సౌమ్య, భీషణీ, దేవీ, జయా, విజయా, అజితా, అపరాజితా, మహాకోటీ, మహారౌద్రీ, శుష్కకాయా, ప్రాణహరా అను పదకొండు గురుశక్తులు రసచక్రమునందు ఉండును. విరూపాక్షీ, పరా, దివ్యలు, పదకొండుగురు ఆకాశ మాతృకలు, సంహారీ, జాతహారీ, దంష్ట్రాలా, శుష్కరేవతీ, పిపీలికా, పుష్టిహరా, మహాపుష్టి, ప్రవర్ధనా, భద్రకాళీ, సుభద్రా, భద్రభీమా, సుభద్రికా, స్థిరా, నిష్ఠురా, దివ్యా, నిష్కంపా, గదినీ, రేవతీ అను ముప్పది ఇద్దరు మాతృకలు మారుత, వాయు, రస, దివ్య చక్రములు నాల్గింటి యందును ఎనమండుగురు చొప్పున ఉందురు.
సూర్యుడు ఒక్కడే; చంద్రుడును ఒక్కడే; వారి శక్తులు కూడ భూత భేదమును బట్టి ఒక్కొక్కటియే; భూమిపై నున్న నదీజలమునకు స్థానభేదమును బట్టి తీర్థసంజ్ఞ కలిగినట్లే శరీరమునందలి అస్థి పంజరములో నున్న ఒకే ప్రాణము అనేక మండలముల రూపమున విభక్తమైనది. వాయు దక్షిణాంగములతో యోగముచే అదే వాయువు పది విధములైనట్లు, అదే వాయువు తత్త్వరూపమగు వస్త్రమునందు దాగి విచిత్ర బిందు రూపమగు ముండము ద్వారా, కపాలరూప బ్రహ్మాండమునకు సంబంధించిన అమృతమును త్రాగుచుండును. పంచవర్గ బలముచే యుద్ధమునందెట్లు జయము కలుగునో వినుము. అ, ఆ, క, చ, ట, త, ప, య, శ లు ప్రథమ వర్గము. ఇ, ఈ, ఖ, ఛ, ఠ, థ, ఫ, ర, ష లు ద్వితీయ వర్గము. ఉ, ఊ, గ, జ, డ, ద, బ, ల, స లు తృతీయ వర్గము. ఏ, ఐ, ఘ, ఝ, ఠ, ధ, భ, వ, హ లు చతుర్థ వర్గము. ఓ, ఐ, అం, అః, ఙ, ఞ, ణ, న, మ లు పంచవర్గము.
ఈ నలుబది యైదు అక్షరములును మానవులకు అభ్యుదయము ఇచ్చునవి. వీటికి వరుసగ బాల, కుమార, యువన్, వృద్ధ, మృత్యువులని పేరు. కాలము, ఆత్మపీడము, శోషకము, ఉదాసీనము అని మూడు విధములు. మంగళవారము నందు ప్రతిపత్తు, కృత్తిక వచ్చినచో అవి లాభదాయకములు. మంగళవారమున షష్ఠీ-మఘా నక్షత్రములు వచ్చినచో అవి పీడాకరములు. మంగళవారమున ఏకాదశీ-ఆర్ద్రా నక్షత్రములు వచ్చినచో అవి మృత్యుదాయకములు. బుధవారమున ద్వితీయా-మఘా యోగము, సప్తమీ ఆర్ద్రా నక్షత్ర యోగము లాభదాయకములు. బుధవార-భరణీ నక్షత్ర యోగము హానికరము. బుధవార-శ్రవణ నక్షత్ర యోగము ‘కాలయోగము’. బృహస్పతి వారమున తృతీయా-పూర్వ ఫల్గునీ యోగము లాభకరము. బృహస్పతి వారమున అష్టమీ తిథి ధనిష్ఠా నక్షత్ర యోగము, అష్టమీ-ఆర్ద్రా యోగము, త్రయోదశీ-ఆశ్లేషా యోగము మృత్యు కారకములు. శుక్రవారమున చతుర్థీ-పూర్వాభాద్రా యోగము లక్ష్మీ వృద్ధికరము. శుక్రవారమున నవమీ-పూర్వాషాఢా యోగము దుఃఖ ప్రదము; ద్వితీయా భరణీ నక్షత్ర యోగము యమ దండమువలె హానికరము, శనివారమున పంచమీ-కృత్తికా యోగము లాభకరము; దశమీ-ఆశ్లేషాయోగము పీడాకరము. పూర్ణిమా-మఘా యోగము మృత్యు ప్రదము.
పూర్వ, ఉత్తర, ఆగ్నేయ, నైరృతి, దక్షిణ, వాయవ్య, పశ్చిమ, ఈశాన్యములు పరస్పరము చూచుకొనును. ప్రతిపత్తు నవమి మొదలగు తిథులలో మేషాది రాశులతో రవ్యాది వారములను కలపవలెను. ఈయోగము కార్యసిద్ధికరము. ఉదా: తూర్పు, ప్రతిపత్తు మేషలగ్నము, రవివారము-ఈ యోగము పూర్వ దిశయందు యుద్ధాది కార్యములందు సిద్ధిప్రదము. మేషాదిరాశులు నాలుగు, కుంభము-ఈ లగ్నములు పూర్ణ విజయమును ఇచ్చును. ఇతర రాశులు మృత్యు కారకములు. సూర్యాది గ్రహములను, రిక్తాపూర్ణాది తిథులను వెనుక దిక్కుల విషయమున చెప్పినట్లు న్యాసము చేయవలెను. సూర్య సంబంధముచే యుద్ధమునందు ఉత్తమ ఫలమేదియు లభించదు. సోమ సంబంధము సంధిని కలిగించును. మంగళ సంబంధముచే కలహమగును. బుధ సంబంధమున యుద్ధము చేయుటచే అభీష్ట సాధనములు చేకూరును. గురు సంబంధముచే విజయలాభము కలుగును. శుక్ర సంబంధముచే అభీష్ట సిద్ధి యగును. శని సంబంధముచే పరాజయము కలుగును. ఒక పక్షి ఆకారము గీసి దానిముఖ, నేత్ర, లలాట, శీర్ష, హస్త, కుక్షి, చరణ, పక్షములందు సూర్యనక్షత్రము మొదలు మూడేసి నక్షత్రములు వ్రాయవలెను. పాదము నందున్న మూడు నక్షత్రములలో యుద్ధము చేసినచో మృత్యువగును. రెక్కలపై నున్న మూడు నక్షత్రములందు ధననాశము. ముఖమునందలి మూడు నక్షత్రములందు పీడ కలుగును. శిరస్సునందున్న మూడు నక్షత్రములందు కార్యనాశనము. కుక్షియందలి మూడు నక్షత్రములందు యుద్ధము చేయగా ఉత్తమ ఫలము లభించును. తూర్పు నుండి నైరృతి వరకును, నైరృతి నుండి ఉత్తరము వరకును, ఉత్తరము నుండి ఆగ్నేయము వరకును, ఆగ్నేయము నుండి పశ్చిమము వరకును, పశ్చిమము నుండి ఈశాన్యము వరకును, ఈశాన్యము నుండి దక్షిణము వరకును, దక్షిణము నుండి వాయవ్యము వరకును, వాయవ్యము నుండి ఉత్తరము వరకును నాలుగేసి దండముల వరకు రాహు భ్రమణము ఉండును. రాహువును పృష్ఠమునందు ఉంచుకొని యుద్ధము చేయుట జయప్రదము. రాహువు ఎదురుగా ఉండగా యుద్ధము చేసినచో మృత్యువు. ఇప్పుడు తిథిరాహు విషయము చెప్పెదను. పూర్ణిమ పిమ్మట కృష్ణ ప్రతిపత్తు మొదలు ఆగ్నేయము నుండి ఈశాన్యము వరకు, అనగా కృష్ణ అష్టమివరకు రాహువు పూర్వదిక్కున ఉండును. అచట యుద్ధము చేయుటచే జయము కలుగును. ఈశాన్యము నుండి ఆగ్నేయము వరకును, నైరృతి నుండి వాయవ్యము వరకును రాహు భ్రమణ ముండును. మేషాదిరాశులను పూర్వాది దిక్కులందు ఉంచవలెను. ఇట్లుండగా మేష, సింహ, ధనూరాశులు తూర్పునను, వృషభ, కన్యా, మకర రాశులు దక్షిణము నందును, మిథున, తులా, కుంభములు పశ్చిమము నందును, కర్కటక, వృశ్చిక, మీనములు ఉత్తరమునందును ఉండును. సూర్యరాశిని బట్టి సూర్యుని దిక్కు తెలిసికొని, సూర్యుడు సమ్ముఖుడై ఉన్నప్పుడు యుద్ధము చేయుట మృత్యు కారకము. కృష్ణ పక్షమునందు తృతీయా, సప్తమీ, దశమీ, చతుర్దశీ తిథులు భద్రతిథులు. శుక్ల పక్షమునందు చతుర్థీ, ఏకాదశీ, అష్టమీ పూర్ణిమలు భద్ర తిథులు. ఆగ్నేయము నుండి వాయవ్యము వరకును భద్రా నివాసము.
అ, క, చ, ట, త, ప, య, శ-అని ఎనిమిది వర్గములు. వీటి అధిపతులు వరుసగ సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహువులు. ఈ వర్గముల పక్షులు క్రమముగ గృధ, ఉలూక, శ్యేన, పింగళ, కౌశిక, సారస, మయూర, గోరంకు పక్షులు మొదట హోమములుచేసి మంత్రసిద్ది చేసికొనవలెను. ఉచ్చాటనమున మంత్ర ప్రయోగము పల్లవ రూపమున చేయవలెను. వశ్య, జ్వర, ఆకర్షణములందు పల్లవ ప్రయోగము సిద్ధికరము. శాంతియందును, మోహన ప్రయోగమునందును, ‘నమః’ అని చెప్పుట మంచిది. పుష్టి-వశీకరణములందు ‘వౌషట్’, మారణ-ప్రీతి వినాశములందు ‘హుం’ ప్రయోగించవలెను. విద్వేషణమునందును, ఉచ్చాటనమునందు ‘ఫట్’ చెప్పుట మంచిది. పుత్రాది ప్రాప్తి ప్రయోగమునందును దీప్త్యాదులందును ‘వషట్’ చెప్పుట మంచిది. ఈ విధముగ మంత్రములలో ఆరు జాతులు ఏర్పడినవి. ఇపుడు అన్ని విధముల రక్షణము నిచ్చు ఓషధులను గూర్చి చెప్పుచున్నాను. మహాకాళీ, చండీ, వారాహీ, ఈశ్వరీ, సుదర్శనా, ఇంద్రాణీ-ఈ ఓషధులను శరీరముపై ధరించుటచే ధారకునకు రక్ష కలుగును. బలా, అతిబలా, భీరు, ముసలీ, సహదేవీ, జాతీ, మల్లికా, యూథీ, గారుడీ, భృంగరాజ, చక్రరూపా-ఈ మహౌషధులను ధరించుటచే యుద్ధమునందు విజయము కలుగును. మహాదేవీ! ఈ ఓషధులను గ్రహణ సమయమున వెలికి తీయుట శుభదాయకము. మట్టితో సర్వాంగ సంపన్నమైన ఏనుగుమూర్తి ఒకటి నిర్మించి, దాని పాదము క్రింద శత్రువు మూర్తి నుంచి, స్తంభన ప్రయోగము చేయవలెను. లేదా ఒకే వృక్షమున్న ఒక పర్వతో పరిభాగమునందు ఆ చెట్టు క్రింద గాని, పిడుగుపడిన చోటున గాని, పుట్టమట్టితో ఒక స్త్రీమూర్తిని నిర్మించి ‘ఓం నమో మహాభైరవాయ వికృతదంష్ట్రోగ్ర రూపాయ పిఙ్గలాక్షాయ, త్రిశూల ఖడ్గధరాయ ‘నౌషట్’ అను మంత్రముచే ఆ మృత్తికమయ దేవీమూర్తికి పూజచేసి, శత్రువువద్ద నున్న శస్త్ర సమూహమును స్తంభింపచేయవలెను.
ఇపుడు యుద్ధమున విజయము చేకూర్చు అగ్నికార్యమును గూర్చి చెప్పెదను. రాత్రి శ్మశానమునకు వెళ్ళి నగ్నుడై శిఖ విరబోసికొని, దక్షిణాభిముఖముగ కూర్చుండి జ్వలించుచున్న చితియందు మనుష్య మాంసరక్తములను, విషమును, ఊక ఎముకలు కలిపి, శత్రువు పేరు చెప్పుచు ‘ఓం నమో ........... విద్యేస్వాహా’ అను (మూలములోనున్న) మంత్రముతో ఎనిమిదివందల పర్యాయములు హోమము చేయవలెను. అట్లు చేయగా శత్రువు బద్ధుడై పోవును. (గ్రుడ్డివాడగును) దేవీ! ‘ఓం వజ్రకాయ ........... హుం ఫట్’ అను (మూలములో నున్న) మంత్రమును మూడువేల ఎనిమిదివందల (3800) పర్యాయములు జపము చేయగా హనుమంతుడు అన్ని కార్యములను సమకూర్చును. వస్త్రముపై వ్రాసిన హనుమన్మూర్తిని చూపగనే శత్రువులు నశింతురు. (125)
