అగ్ని మహా పురాణము

Table of Contents

షష్ఠి సంవత్సర నిరూపణము

పరమేశ్వరుడు పలికెను:

పార్వతీ! ఇప్పుడు అరువది సంవత్సరముల (లో కొన్నింటి) శుభాశుభ ఫలములను చెప్పెదను, సావధానముగా వినుము. ప్రభవ సంవత్సరమున యజ్ఞకర్మలు అధికముగా జరుగును. ‘విభవ’ యందు ప్రజలు సుఖవంతులు. శుక్లయందు సమస్త ధాన్య సమృద్ధి. ‘ప్రమోదమున సకలానందము. ‘ప్రజాపతి’ యందు వృద్ది. అంగిరస యందు భోగవృద్ధి శ్రీముఖమున జనసంఖ్యావృద్ది. ‘యువ’ యందు ప్రచుర వర్షము. ధాత’ యందు ఔషధుల అధికోత్పత్తి, ‘ఈశ్వర’ యందు క్షేమ-ఆరోగ్యప్రాప్తి, బహుధాన్యమున ప్రచురధాన్యోత్పత్తి ప్రమాదియందు మధ్యవృష్టి. ‘విక్రమ’యందు అన్న సమృద్ధి. ‘వృష’ యందు సకల ప్రజా పోషణము. చిత్ర భానువునందు విచిత్రత, సుభానువునందు కల్యాణా రోగ్యములు. ‘తారణ’ యందు శుభకరములగు మేఘములు. పార్థివమున సస్యసంపత్తి, అవ్యయమున అతివృష్టి, సర్వజిత్తునందు ఉత్తమవృష్టి, సర్వధారియందు ధాన్యాది సమృద్ధి, విరోధియందు మేఘ వినాశము. ‘వికృతి’ యందు భయము ‘ఖర’ యందు పురుషులలో పౌరుషాధిక్యము. నందన యందు ప్రజానందము. ‘విజయ’ యందు శత్రునాశనము, జయ యందు రోగ వినాశనము, ‘మన్మథ’ యందు జ్వరపీడ, దుష్కరము నందు ప్రజలకు దుష్కర్మ ప్రవృత్తి. దుర్ముఖమున కటు భాషిత్వము. హేమలంబమున సంపత్ర్పాప్తి. విలంబమున అన్న ప్రాచుర్యము, వికారియందు శత్రుకోపము. శార్వరియందు అక్కడక్కడ సర్వ లాభము ప్లవయందు వరదలు. ‘శోధన శుభకృతు’ లందు నామానుకూలముగ శుభము. ‘రాక్షస’ యందు ప్రజలలో నిష్ఠురత్వము ‘అనల’ యందు వివిధ ధాన్యోత్పత్తి. ‘పింగల’ యందు అచ్చటచ్చట వృష్టి. ‘కాలయుక్త’ మున ధనహాని, ‘సిద్ధార్థమున సకల కార్యసిద్ధి. రౌద్రము నందు ప్రపంచమున రౌద్రభావ ప్రవృత్తి. దుర్మతి యందు మధ్యవృష్టి. ‘దుందుభి’ యందు మంగళము ధన ధాన్య ప్రాప్తి. రుధిరోద్గారి రక్తాక్షులందు రక్త పానము. క్రోధనమున విజయము. ‘క్షయ’ యందు ప్రజాక్షయము. ఈ విధముగ అరువది సంవత్సరముల (లోకొన్నింటిని) గూర్చి చెప్పబడినది. (139)