అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్నిపురాణ రచనా కాలము – స్థలము

అగ్నిపురాణ రచనము ప్రత్యేకముగా ఒకే కాలమున జరిగినదని చెప్పలేము. ఇందలి అనేక శాస్త్ర విషయములు భిన్నభిన్న కాలములలో రచింపబడినవి. ఇందు చెప్పబడిన అలంకార శాస్త్ర విషయములను అనుసరించి ఇది దండి కావ్యాదర్శ రచన తరువాత రచింపబడినట్లు స్పష్టమగును. దండి క్రీ.శ. 7వ శతాబ్ధి తరువాత జీవించినట్లు నిశ్చయింపవచ్చును. అందుచే అగ్నిపురాణ రచనా కాలము క్రీ.శ. 7వ శతాబ్ది తరువాత అని నిశ్చయింపవచ్చును. భోజుని సరస్వతీ కంఠాభరణ రచనా కాలమునకు ముందుగానే ఈ భాగము రచింపబడినదని చెప్పవచ్చును. భోజుని కాలము 11వ శతాబ్దము మధ్య భాగము కావున అగ్నిపురాణము వివిధ కాలములకు చెందిన వివిధ గ్రంథముల సారోద్ధారమని చెప్పవచ్చును. కావుననే నిబంధ గ్రంథములలో అగ్నిపురాణ మందలివని ఆయా వ్యాఖ్యాకర్తలు ఉద్ధరించిన భాగములు ప్రస్తుత అగ్నిపురాణమున కాన్పించుట లేదు. డా!! హజ్రా వద్దగల వహ్నిపురాణ వ్రాతప్రతియందు అనేక నిబంధకారులు ఉద్ధరించిన అగ్ని పురాణము నందలి భాగములు యథాతథముగా లభ్యములు అగుచున్నవి. కావుననే ఇదియే ప్రాచీన అగ్ని పురాణమని భావింపబడుచున్నది.

ప్రస్తుతము ముద్రింపబడి లభ్యమగుచున్న అగ్నిపురాణము ‘పాంచరాత్ర’ శాఖీయుల ద్వారా సంస్కరింపబడి వైష్ణవుల అర్చన, పూజాదికములను వివరించే గ్రంథముగా మారియున్నది. కావున దీనిని ప్రాచీనమైన మౌలిక పురాణమని చెప్పలేము అని హజ్రా అభిప్రాయం. ప్రస్తుత అగ్ని పురాణము సామాన్య జనోపయోగము కొఱకు ప్రౌఢ గ్రంథముల సారాంశమును కూడా క్రోడీకరించిన రచన. జన సామాన్యమునకు విద్యగ ఉపయోగకరమై రచింపబడి ఉండును. కానీ ఈ రచనా కాలమును గుఱించిన భిన్నాభిప్రాయములు గలవు. ప్రస్తుత అగ్ని పురాణము క్రీ.శ. 9వ శతాబ్దమునకు పూర్తి రూపము సంతరించు కొనినదని భావించవచ్చును.

ప్రస్తుత పురాణం వలన, ప్రజాబాహుళ్యానికి ఉపయోగమైన విద్యల సంగ్రహమేనని గ్రహించవచ్చు. అందువలన మనం దీనిని ఆధునిక పరిభాషలో పౌరాణిక విజ్ఞాన సర్వస్వమని భావించటం సామంజస్యమే. దీని ముఖ్య ఉద్దేశ్యమే వివిధ విద్యలను సర్వులకు పరిచయం చేయటం ఈ ఉద్దేశ్యంతోటే పరిశీలిస్తే పుస్తకం అంతా కూడా ఒక విజ్ఞాన సర్వస్వంగానే భాసిస్తుంది. వివిధ శాస్త్రాలలోని ప్రౌఢ విషయాలను స్వీకరించి, యథార్థంగా ఆ శాస్త్ర గ్రంథాలసారంగా తాను పొందవలసిన స్థానాన్ని పొందగలిగింది. ధర్మశాస్త్ర విషయాలతో పాటు, విజ్ఞానసంబంధ విషయాలను కూడా చాలా మార్మిక దృష్టితో చేసిన పురాణకర్త విజయం సాధించాడు. ధర్మశాస్త్ర విషయాలే కాకుండా శాస్త్ర పరిజ్ఞానాన్ని దీనిద్వారా పొందే అవకాశం కూడా కల్పించబడింది. వాటి సంకలనం చాలా ఉపయోగ కరంగా చేయబడింది. ధర్మ శాస్త్రీయ విషయ వర్ణనలో ఆయుర్వేద, అశ్వాయుర్వేద, గజాయుర్వేద, వృక్షాయుర్వేద (283), గో చికిత్స, రత్నపరీక్ష (243), ధనుర్విద్య (249-292) వాస్తువిద్య (40వ అధ్యాయము, 93-94 అధ్యాయాలు 105-106 అధ్యాయం) ప్రతిమా లక్షణం (49-55 అధ్యాయం) రాజధర్మ, కావ్యవివేచన (337 అధ్యాయం 333-347 అధ్యాయం) మొదలైనవి అన్నీ ఉన్నాయి.

ఈ విషయ వివరణల ఆధారంగా ఈ పురాణ రచనా కాలాన్ని నిర్ణయించవచ్చు. ఇందులోని అలంకార విషయాలు భోజరాజు రచించిన సరస్వతీ కంఠాభరణానికి ముఖ్య ఆధార గ్రంథంగా ఉన్నది. అందువలన ఇది 11వ శతాబ్దికి ముందు గ్రంథం అయి ఉండాలి. అలాగే అగ్ని పురాణానికి ఈ విషయాలపై ముఖ్య ఆధార గ్రంథం దండి రచించిన కావ్యాదర్శం. అందువలన ఇది ఏడవ శతాబ్ధికి తరువాత రచింపబడిన గ్రంథం అయి ఉండాలి. అందువలన ఈ పురాణ రచనా కాలం ఏడవ శతాబ్ధి కంటే ముందుదిగా భావించే అవకాశం లేదు. దీని రచనాకాలం నాల్గవ శతాబ్దానికంటే అర్వాచీనంగా నిర్ణయించటం కుదరదు. అందుచేత అగ్ని పురాణం 7వ శతాబ్దం తరువాత, 11వ శతాబ్దం ముందుగా రచింపబడిన గ్రంథం అయి ఉండవచ్చు.

ఇందులో పేర్కొనబడిన అనేక తాంత్రిక అనుష్ఠానాల ఆచరణ, ఒక్క వంగదేశ ప్రాంతంలో మాత్రమే కనబడుతున్నది. అందువలన దీని ఉద్భవ స్థానం లేక రచనా ప్రదేశం వంగదేశ పశ్చిమ ప్రాంతం అని భావించటం సంగతమే.