అగ్ని మహా పురాణము

Table of Contents

శివ ప్రతిష్టా విధానము

పరమేశ్వరుడు పలికెను-స్కందా! ప్రాతః కాలమున నిత్యకర్మలు ముగించుకొని, ద్వార దేవతలను పూజించి, మండప ప్రవేశము చేసి, పూర్వోక్త విధానమున దేహశుద్ధ్యాదులు చేసికొనవలెను. దిక్పాలకులను, శివకలశమును, వర్ధనిని పూజించి, అష్టపుష్టికతో శివ లింగమును పూజించి, క్రమముగా హోమముచేసి, అగ్ని దేవుని తృప్తుని చేయవలెను. పిదప శివుని ఆజ్ఞ గ్రహించి ‘అస్త్రాయ ఫట్’ అని ఉచ్చరించుచు మందిరమునందు ప్రవేశించి, ‘అస్త్రాయ హూంఫట్’ అని ఉచ్చరించుచు విఘ్నములను తొలగించుకొనవలెను. శిలకు సరిగా మధ్యయందు శివలింగ స్థాపన చేయగూడదు. అట్లు చేయుటచే వేదదోష శంకకు అవకాశముండును. అందుచే మధ్యభాగమును విడచి, ఒక యవ లేదా అర్ధయవ ఈశాన్యము వైపు జరిగి శివలింగమును ఆధారశిలయందు స్థాపించవలెను. మూల మంత్రమును ఉచ్చరించుచు, అనంతనామధారిణియు, సర్వాధార స్వరూపిణియు, సర్వవ్యాపినియు అగు శిలను సృష్టి యోగముతో స్థిరముగ స్థాపించవలెను. లేదా ‘ఓం నమో వ్యాపిని భగవతి స్థిరేఽచరే ధ్రువే మ్రీం లం హ్రీం స్వాహా’ అను మంత్రముతో శివాసన స్వరూపయగు ఆ శిలను పూజించవలెను. పూజ చేయుటకుముందు-‘ఆధారశక్తి స్వరూపిణియగు ఓ శిలా! శివుని ఆజ్ఞ ప్రకారము నీవు ఇచట ఎల్లప్పుడును స్థిరముగా నుండుము’ అని ప్రార్థించవలెను. పూజానంతరము అవరోధినీ ముద్రతో శిలను స్థిరముగా స్థాపించవలెను. వజ్రము మొదలైన రత్నములు, వట్టివేళ్ళు మొదలగు ఔషధులు, లోహము, సువర్ణము, కాంస్యము మొదలగు ధాతువులు, హరితాళాదులు, ధాన్యాది సస్యములు. వెనుక చెప్పిన ఇతర వస్తువులు, క్రమముగ ఒక్కచోట చేర్చి, ఇవన్నియు కాంత్యారోగ్య దేహవీర్య శక్తి రూపములు అని భావన చేయవలెను. ఈ విధముగ ఏకాగ్ర చిత్తముతో భావనచేసి లోకపాలకులను, శివునకును, సంబంధించిన మంత్రముతో ఈ వస్తువులను ఒక్కొక్కటిగ, పూర్వాది కుండములందు వేయవలెను. బంగారముతో లేదా రాగితో చేసిన తాబేలుగాని, వృషభమును గాని ద్వారమునకు ఎదురుగా ఉండునట్లుచేసి, నదీతీరము నందలి మట్టిగాని పర్వత శిఖరమునందలి మట్టిగాని, కలిపి, మధ్యమునందున్న గర్భమునందు వేయవలెను. లేదా సువర్ణ నిర్మితమగు మేరువును, మధూక-అక్షత అంజనములతో కలిపి ఆ కుండమునందు వేయవలెను. లేదా బంగారముతోగాని, వెండితోగాని చేసిన పృథివిని, సకల బీజములతో, సువర్ణముతో మధ్యనున్న కుండములో వేయవలెను. లేదా బంగారము, వెండి లేదా సకల లోహములు కలిపి చేసిన, సువర్ణమయ కేసరములుగల పద్మమునుగాని, అనంత నాగమూర్తి గాని అచట వేయవలెను. శక్తి మొదలు మూర్తి వరకును, లేదా శక్తి మొదలు శక్తి వరకునుగల తత్త్వములను దేవాదిదేవునకు ఆసనముగా ఏర్పరచి, దానిపై పాయసము గుగ్గులు పూయవలెను. పిదప వస్త్రముతో గర్తమును కప్పి కవచ అస్త్ర మంత్రములతో రక్ష చేయవలెను.

ఆచార్యుడు దిక్పాలకులకు బలి ఇచ్చి ఆచమనముచేసి, శిలాగర్త సంగదోష నివృత్తి కొరకై శివమంత్రముతోగాని, అస్త్రమంత్రముతోగాని విధిపూర్వకముగ నూరుహోమములు చేసి, పూర్ణాహుతి కూడ ఇవ్వవలెను. వాస్తుదేవతలకొరకై ఒక్కొక్క హోమము చేసి; తృప్తి పరచి, హృదయమంత్రముతో దేవుని ఎత్తి మంగలవాద్య-మంగల పాఠాదులతో తీసికొనిరావలెను. గురువు దేవునకు ముందు నడచుచుండగా, యజమానుడు నాలుగు దిక్కులందు ఉన్న మూర్తిపాలులతో, దేవుని వాహనమునకు వెనుక నడవవలెను. దేవాలయాదులకు నాల్గు వైపుల త్రిప్పి, శివలింగమునకు భద్రద్వారము ఎదుట స్నానము చేయించి, అర్ఘ్యమిచ్చి, లోనికి తీసికొని వెళ్లవలెను. తెరచిన ద్వారముగుండా గాని, ద్వారము కొరకై నిశ్చయించిన స్థానముగుండా గాని దేవుని దేవాలయములోనికి తీసికొని వెళ్లవలెను. ఇది ఏదియు లేనిచో, ద్వారమును బంధించు శిలమీదుగా గాని, శూన్యమార్గమునుండి గాని, లేదా ఆ శిలపై నుండిగాని ఆలయము లోనికి తీసికొని వెళ్లవలెను, మహేశ్వరుని ద్వారము నుండియే లోనికి తీసికొని వెళ్లవలెను. కాని ద్వారస్పర్శ కలుగకుండ తీసికొని వెళ్లవలెను. దేవాలయ ప్రారంభము జరుగుచున్నప్పుడు మాత్రము ఏ మూలనుండియైనను శివలింగమును లోనికి తీసికొని వెళ్ళవచ్చును. స్థూల శివలింగమును లోనికి తీసికొని వెళ్ళునప్పుడు ఇదియే విధానము. గృహములో ప్రవేశించుటకు ద్వారమే మార్గమను విషయము సాధారణ మానవులకు గూడ తెలియును. ద్వారము లేని గృహమునందు ప్రవేశించినచో గోత్రనాశనమగునని శాస్త్రము. శివలింగమును ద్వారము ఎదుట ఉంచి నానావిధములగు వాద్యములతోను, మంగళధ్వనులతోను దూర్వాక్షతాదులు సమర్పించి ‘సముత్తిష్ఠ నమః’ అని అనుచు మహా పాశుపత మంత్రమును పఠించవలెను. ఆచార్యుడు గర్తమునందు ఉంచిన ఘటమును బైటకుతీసి, మూర్తి పాలకులతోకూడ దానిని యంత్రము నందు స్థాపించి, దానిపై కుంకుమాది లేపముచేసి, శక్తి, శక్తిమంతుల ఏకత్వమును భావించుచు, లయాంత మూలమంత్రము ఉచ్చరించుచు ఆలంబన లక్షితమగు ఆ ఘటమును స్పర్శపూర్వకముగ గర్తమునందు స్థాపించవలెను.

బ్రహ్మ భాగములు ఒక అంశముగాని, రెండు అంశములుగాని, సగము అంశము గాని, ఎనిమిదవ అంశముగాని, లేదా పూర్తి బ్రహ్మ భాగమునుగాని గర్తములో నుంచవలెను. నాభిపర్యంతము దీర్ఘలతో కూడ సీసమును కప్పి, ఏకాగ్రచిత్తుడై, క్రింది గరమును ఇసుకతో పూడ్చి, ‘దేవా! నీవు సుస్థిరముగా నుండుము’ అని ప్రార్థించవలెను. లింగము స్థిరమైన పిదప, రూపవంతుడగు పరమేశ్వరుని ధ్యానముచేసి, శక్త్యంతమూల మంత్రోచ్చారణము చేయుచు, శివలింగమును స్పృశించి, దానిపై నిష్కలీకరణ న్యాసము చేయవలెను. శివలింగ ప్రతిష్ఠ జరుగుచున్నప్పుడు ఏ ఏ దిక్కుల వైపున ఉండునో ఆ యా దిక్కుల పాలకుల మంత్రములు ఉచ్చరించుచు పూర్ణాహుతి పర్యంతము హోమములు చేసి దక్షిణ ఈయవలెను. శివలింగమునుండి శబ్దము వచ్చినను, దాని ముఖ భాగము కదలినను, బ్రద్ధలైనను మూలమంత్రముతోగాని, బహురూప మంత్రముతోగాని నూరు హోమములు చేయవలెను. ఇట్టి ఇతర దోషములు ఏవైన వచ్చినచో జీవశాస్త్రోక్త ప్రకారము శాంతి చేయవలెను. ఈ విధముగ శివలింగమునందు న్యాసము చేసినచో కర్తకు దోష మేదియు అంటదు. పిదప లక్షణ స్పర్శ రూపమగు పీఠబంధము చేసి గౌరీ మంత్రముతో దానిని లయముచేసి, మరల పిండిపై సృష్టిన్యాసము చేయవలెను. లింగము ప్రక్కనున్న గర్త ఛిద్రమును ఇసుకతోను, వజ్రలేపము తోను పూడ్చివేయవలెను. పిదప గురువు మూర్తిపాలక సమేతుడై శాంతి కలశమునందలి అర్ధ జలముతో శివలింగమునకు స్నానము చేయించి, ఇతరకలశలతోను, పంచామృతముతోను కూడ స్నానము చేయించి, చంద నాదులు పూసి, శివుని పూజించి, ఉమామహేశ్వర మంత్రములతో, లింగముద్రతో ఆ ఇరువురిని స్పృశించవలెను. షడధ్వన్యాస పూర్వకముగా త్రితత్త్వన్యాసముచేసి, మూర్తి న్యాస, దిక్పాల న్యాస, అంగన్యాస, బ్రహ్మన్యాస పూర్వకముగ లింగమున జ్ఞానశక్తిని, పీఠమున క్రియాశక్తిని న్యాసముచేసి, పిదప స్నానము చేయించవలెను. గంధము పూసి, ధూపము సమర్పించి, వ్యాపక ధూపమున శివుని న్యాసముచేసి, హృదయ మంత్రముతో పుష్పమాలా, ధూప, దీప, నైవేద్య, ఫలములు సమర్పించవలెను. పిదప శివునిచే ఆచ మనము చేయించవలెను. విశేషార్ఘ్యమిచ్చి, మంత్రము జపించి, పరమేశ్వరుని వరదాయక హస్తమున ఆ జపమును అర్పించి, ‘దేవా! సూర్యచంద్ర నక్షత్రములు ఉన్నంతవరకును నీవు మూర్తీశులతోడను మూర్తీపాలకులతోడను కలిసి స్వేచ్ఛానుసారముగా ఈ ఆలయమున సర్వదా నివసింపుము’ అని ప్రార్థించవలెను. పిదప ప్రణామముచేసి బైటకు వెళ్లి హృదయమంత్రముతోగాని, వృషభస్థాపన చేసి వెనుకటివలెనే బలి నివేదనము చేయవలెను.

పిదప న్యూనత్వాది దోషనిరాకరణము కొరకై మృత్యుంజయ మంత్రముతో సమిధలతో సూరు హోమములు చేయవలెను. శాంతికొరకు పాయసహోమము చేయవలెను. పిదప ‘దేవా జ్ఞానపూర్వకముగగాని అజ్ఞాన పూర్వకముగ గాని ఏవైన లోపములు జరిగినచో వాటిని నీవు పూర్ణము చేయుము’ అని ప్రార్థించి యథాశక్తిగ సువర్ణ, పశు, భూమ్యాది సంపత్తి సమర్పించి, గీతావాద్యాద్యుత్సవములను గూడ సర్వకారణభూతుడును, అంబికా నాథుడును అగు శివునకు ఏర్పరచవలెను. పిదప నాలుగు దివసములు, అవిచ్ఛిన్నముగ దానములు, ఉత్సవములు చేయవలెను. ఈ నాలుగు దివసములలో మూడు దివసములు మంత్రజ్ఞుడైన ఆచార్యుడు మూర్తి పాలకులతో కలసి హోమములుచేసి నాల్గవ దివసమున పూర్ణాహుతి ఇచ్చి, బహురూప మంత్రముతో చరు నివేదనము చేయవలెను. అన్ని కాండములనుండియు, సంపాతాహుతిచే శోధితమైన చరువును అర్పించవలెను. ఆ నాలుగు దినములును నిర్మాల్యమును తీయకూడదు. నాల్గు దినముల తరువాత నిర్మాల్యము తొలగించి, స్నానము చేయించి, పూజ చేయవలెను. సాధారణ లింగములందు సాధారణ మంత్రములతో పూజచేయవలెను. లింగ చైతన్యమును విడచి స్థాణు విసర్జనము చేయవలెను. అసాధారణ లింగముల విషయమున ‘క్షమస్వ’ ఇత్యాదికము చెప్పి విసర్జనము చేయవలెను. ఆవాహనము, అభివ్యక్తి విసర్గము, శక్తిరూపత అను ఈ ఐదు విషయములును ముఖ్యమైనవి. ప్రతిష్ఠాంతమున స్థిరత్వాదిగుణ సిద్ధికై ఏడు హోమములు చేయు పద్ధతి కూడ ఉన్నది. శివుడు స్థిరుడు, అప్రమేయుడు, అనాది, బోధస్వరూపుడు, సర్వవ్యాపి, అవినాశి, ఆత్మతృప్తుడు. మహేశ్వర సన్నిధి విషయమున ఈ నోములు చెప్పబడినవి.

‘ఓం నమః శివాయ స్థిరోభవ నమః స్వాహా’ ఇత్యాదికము ఆహుతి క్రమము. పిదప శివకలశము వంటి రెండు కలశములను సిద్ధము చేయవలెను. ఒక కలశచే శివునకు స్నానముచేయించి రెండవది యజమానుని స్నానము కొరకు ఉంచవలెను. బలియిచ్చి ఆచమనముచేసి, శివానుజ్ఞ పొంది బైటకు రావలెను, యాగమండపము వెలుపల ఈశాన్యమున చండుని స్థాపించి పూజించవలెను. పిదప మండపమున, స్నానగర్భముతో సమానమైన ఉత్తమపీఠముపై ఆసనము కల్పించి, వెనుకటివలె న్యాస హోమాదులు చేయవలెను. ధ్యాన పూర్వకముగా సద్యో జాతాది స్థాపన చేసి,  అచట బ్రహ్మాంగములతో యథావిధిగా పూజచేయవలెను. బ్రహ్మాంగములు వెనుక చెప్పబడినవి. మంత్రములతో పూజచేయు విధానమును వినుము. ‘ఓం వం సద్యో జాతాయ హ్రూం ఫట్ నమః ఓం విం వామదేవాయ హ్రూం ఫట్ నమః అనునవి మంత్రములు. ఈ విధముగ జపము తర్పణము చేసి, స్తుతి పూర్వకముగా ‘ఓం చండేశా! శివుడు ఉన్నంత వరకు నీవుకూడ ఇచటనే ఉండును. అజ్ఞానవశమున నేను చేసిన కర్మదోషములు అన్నియు నీ కృపచే పూర్ణములగుగాక. ఆ లోపములను నీవే పూర్ణము చేయవలెను అని ప్రార్థించవలెను. బాణలింగమునందును, లోహమయ లింగమునందును, సిద్ధలింగమునందును, స్వయంభూ లింగమునందును, ఇతర ప్రతిమలయందును ఉన్న నిర్మాల్యము విషయమున చండేశ్వరునకు అధికారములేదు. అద్వైత భావనాయుక్తుడగు యజమానుని విషయము నందును, స్ధండివేశ విధియందును గూడ చండేశునకు అధికారములేదు. చండుని పూజచేసి, స్నానము చేయించు గురువే పత్నీపుత్ర సమేతుడైన యజమానునకు పూర్వము స్థాపించిన కలశలోని జలముతో స్నానము చేయించవలెను. స్నానము చేయించిన గురువును యజమానుడు మహేశ్వరునివలె పూజించి, ధనలోభము చేయక, భూసువర్ణాది దక్షిణ ఈయవలెను.

పిదప, మూర్తి పాలకులను, జపకర్తలను, జ్యోతిష్కుని, శిల్పిని యధావిధిగా పూజించి, దీన అనాధాదులకు భోజనము పెట్టవలెను. పిదప యజమానుడు గురువును-‘పూజ్యా! సంముఖకరణమునకై మీకు కష్టము ఇచ్చినందులకు క్షమింపుము. నీవు కరుణా సాగరుడవు. అందువలన సకలాపరాధములను క్షమింపుము’ అని ప్రార్ధించవలెను. ఈ విధముగ ప్రార్ధించు యజమానునకు, గురువు కుశ, పుష్ప, అక్షతలతో, నక్షత్రమువలె ప్రకాశించుచున్న ప్రతిష్ఠాజన్య పుణ్య సత్తను అర్పించవలెను. పాశుపత మంత్రజపముచేసి, పరమేశ్వరునకు నమస్కారము చేసిన పిదప భూత గణములకు బలిఇచ్చి, వాటిని అన్నింటిని ఈ విధముగ దగ్గరకు తీసికొని ‘పరమేశ్వరుడు ఉన్నంత కాలము, మీరిచట ఉండవలెను’ అని ప్రార్ధించవలెను. వస్త్రాదియుక్తమగు యాగమండపమును గురువు తీసికొనవలెను.

ఉపకరణ సహితమగు స్నాపన మండపమును శిల్పి తీసికొనవలెను. ఆగమోక్త మంత్రములతో అన్యదేవతా స్థాపన చేయవలెను. సూర్యుని యందున్న వివిధ వర్ణముల ప్రకారము ఆ దేవతల వర్ణములుండును. ఆ దేవతలు తమ తైజసతత్త్వమున వ్యాప్తులై ఉన్నారని భావన చేయవలెను. సాధ్యాది దేవతలు, నదులు, ఔషధులు, క్షేత్రపాలులు, కింనరులు మొదలగువారు పృథివీ తత్త్వాశ్రితులు సరస్వతీ, లక్ష్మినదుల స్థానము జలమునందలి కొన్ని చోట్ల చెప్పబడినది. భువనాధిపతులకు వారున్నదే స్థానము, అహంకారము, బుద్ధి, ప్రకృతి అను మూడు తత్త్వములు బ్రహ్మ స్థానము తన్మాత్రలు మొదలు ప్రధానము వరకును ఉన్న మూడు తత్త్వములు విష్ణు స్థానములు. అండజాది శుద్ధ విద్యాంతతత్త్వములు నాట్యేశ, గణమాతృకా, యక్షరాజ కార్తికేయ గణేశుల స్థానములు, మాయాంశదేశము మొదలు శక్తి పర్యంతము ఉన్నతత్త్వములు శివాశివులకును, ఉగ్రతేజః శాలియగు సూర్యునకును స్థానములు వ్యక్త ప్రతిమలకు పదము ఈశ్వర పర్యంతమని చెప్పబడినది. స్థాపన సామగ్రిలో వున్న కూర్మాదులను, రత్నాది పంచవస్తువులను, దేవపీఠము క్రిందనున్న గర్భములో వేయవలెను. ఐదు బ్రహ్మ శిలలకు మాత్రము వేయగూడదు.

ఆలయ గర్భమును ఆరు భాగములుగా విభజించి ఆరవ భాగమును విడచి ఐదవ భాగమునందు దేవతా ప్రతిష్ఠ చేయవలెను. లేదా ఆలయ గర్భమును ఎనిమిది భాగములు చేసి ఏడవ భాగమున విగ్రహ ప్రతిష్ఠ చేసినచో సుఖావహమగును. చిత్రమయ విగ్రహములను స్థాపించినపుడు ధారణ ద్వారా పంచభూతశుద్ధి కలుగును. స్నానాదికమును జలముతో కాక మానసికముగా చేయవలెను. విగ్రహములను శిలా-రత్నాది భవనములందు ఉంచవలెను. నేత్రోన్మీలన ఆసనాదులు కల్పన చేయుట మంచిది. చిత్రములు చెడిపోకుండుటకై వాటి పూజ, జల రహిత పుష్పములతో చేయవలెను. ఇపుడు చలలింగస్థాపనా విధానము చెప్పబడుచున్నది. గర్భస్థానమును మూడు లేదా ఐదు భాగములుచేసి ఒక భాగము విడచి, మూడవ భాగమునందు గాని రెండవ భాగమునందు గాని లింగమును స్థాపించవలెను. వాటి పీఠములు కల్పన గూడ ఈ విధముగనే చేయవలెను. లింగముల తత్త్వభేదమును బట్టి పూజాప్రక్రియలో భేదముండును. స్పటికాదిలింగముల సంస్కారము ఇష్టమంత్రముచే చేయవలెను. బ్రహ్మశిలా రత్నాదుల నివేదనము ఆవశ్యకముకాదు. పిండికా యోజనము గూడ మానసికముగనే చేయవలెను. స్వయంభూలింగ, బాణ లింగాదులకు సంస్కారాది నియమము లేదు. సంహిళా మంత్రములతో వీటికి స్నానము చేయించవలెను. వాటికి న్యాసహోమాదులు వైదిక విధిచేతనే చేయవలెను. నదీ, సముద్రా ద్యుద్గత లింగముల స్థాపన వెనుకటి వలెనే చేయవలెను. ఇహలోకమున మృత్తికాపిష్టాదులతో చేసిన శివలింగము తాత్కాలికము. పూజనకాలము నందు మాత్రమే లింగ నిర్మాణము చేసి వీక్షణాదులతో దానికి శుద్ధిచేయవలెను. పిదప యధావిధిగ పూజ చేయవలెను. పూజ అనంతరము మంత్రోచ్చారణము చేయుచు, లీనలు స్థాపించుకొని ఆ లింగమును జలములో పడవేయవలెను. ఒక సంవత్సరము అట్లు చేయుటచే ఆ లింగము, ఆ లింగపూజయు మనోవాంఛిత ఫలములను ఇచ్చును. విష్ణ్వాది దేవతాస్థానోప యుక్తములగు మంత్రములు వేరుగా ఉండును. ఆ మంత్రములతోడనే ఆ దేవతల స్థాపన చేయవలెను. (97)