అగ్ని మహా పురాణము

Table of Contents

కోటచక్రము

పరమేశ్వరుడు పలికెను:

ఇపుడు కోట చక్రమును గూర్చి చెప్పెదను. మొదట చతుర్భుజము గీసి, దాని లోపల రెండవ చతుర్భుజమును, దాని లోపల మూడవ చతుర్భుజమును, దాని లోపల నాల్గవ చతుర్భుజమును గీయవలెను. ఇట్లు గీయగా కోటచక్రము ఏర్పడును. దీని లోపల ఏర్పడు మూడు రేఖలకు ప్రథమనాడి, మధ్యనాడి, అంతనాడి అని పేర్లు. కోట చక్రముపైన పూర్వాది దిశలు వ్రాసి రాశులుకూడ వ్రాయవలెను. తూర్పున కృత్తిక, ఆగ్నేయమున ఆశ్లేష, దక్షిణమున మఘ, నైరృతియందు విశాఖ, పశ్చిమమున అనూరాధ, వాయవ్యమున శ్రవణము, ఉత్తరమున ధనిష్ఠ, ఈశాన్యము నందు భరణి వ్రాయవలెను. ఈ విధముగ ప్రథమ నాడియందు ఎనిమిది చక్రములగును. ఇట్లే పూర్వాది దిశల క్రమమున, మధ్యనాడి యందు రోహిణీ, పుష్యమి, పూర్వ ఫల్గుని, స్వాతి, జ్యేష్ఠ, అభిజిత్తు, శతభిషము, అశ్విని నక్షత్రములు వ్రాయవలెను. అంత నాడియందు, పూర్వాది దిశాక్రమమున మృగశిర, పునర్వసు, ఉత్తర, చిత్త, మూల, ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర, రేవతి వ్రాయవలెను.

ఈ విధముగ అంతనాడి యందు గూడ ఎనిమిది నక్షత్రములగును. ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర- ఈ నాల్గు నక్షత్రములు కోట చక్రమధ్య స్తంభములగును. ఈ విధముగ చక్రము వ్రాయగా బాహ్య స్థానము దిక్పాలకుల స్థానమగును. అగంతుకుడైన యోధుడు ఏ దిక్కు నందు ఏ నక్షత్రమునందో, ఆ దిక్కు ద్వారా కోటలో ప్రవేశించినచో ఆతడు విజయము పొందును. కోట మధ్య నున్న నక్షత్రములందో శుభగ్రహములు వచ్చినపుడు యుద్ధము చేసినచో మధ్యనున్న వానికి విజయము, ఆక్రమణ చేసినవానికి పరాజయము కలుగును. ప్రవేశించువాని నక్షత్రమునందు ప్రవేశించవలెను. బైటకు వచ్చు నక్షత్రము నందు బైటకి రావలెను. శుక్ర, కుజ, బుధులు నక్షత్రాంతము నందు ఉన్నపుడు యుద్ధారంభము చేసినచో ఆక్రమణకర్త పరాజితుడగును. ప్రవేశ నక్షత్రములు నాల్గింటి యందు యుద్ధము ప్రారంభమైనచో దుర్గము వశమగును. ఆశ్చర్యపడవలసిన పనిలేదు. (128)