అగ్ని మహా పురాణము
కాలగణనము
అగ్ని దేవుడు పలికెను:
మహామునీ! ఇప్పుడు సంవత్సర సముదాయ రూపమగు కాలమును గూర్చి చెప్పెదను. కాలమును గూర్చి తెలుసుకొనుటకై గణితమును చెప్పెదను (బ్రహ్మ దినాది కాలమునుండి గాని, సృష్ట్యారంభ కాలమునుండి గాని, లేదా నిర్ణీతమైన శక ప్రారంభము నుండి గాని) వర్ష సముదాయమును పండ్రెండు (12)చే గుణించవలెను. దానితో గడచిన చైత్రాది మాసముల సంఖ్య చేర్చవలెను. దానిని రెండుచే గుణించి రెండు స్థానములందు ఉంచుకొనవలెను. ప్రథమ స్థానమునందు నాలుగు కలుపవలెను. ద్వితీయ స్థానమునందు ఎనిమిది వందల అరువదియైదు (865) కలుపవలెను. ఈ విధముగ ఏర్పడిన రెండు అంకములకు సుగుణములని పేరు. దానిని మూడు స్థానములందు ఉంచవలెను. వాటిలో మధ్యనున్న దానిని ఎనిమిదిచే గుణించి మరల నాలుగుచే గుణించవలెను. ఈ విధముగ మధ్యనున్న దాని సంస్కారముచేసి గోమాత్రికా క్రమమున ఉంచబడిన మూడింటిని యథాస్థానముగ కూడవలెను. మొదటి దానిని ఊర్ధ్వమనియు, రెండవ స్థానమున నున్న దానిని మధ్య మనియు, తృతీయ స్థానమున ఉన్న దానిని అధః అనియు పేర్లతో ఉంచుకొనవలెను. అధోంకము నుంచి 388, మధ్యాంకము నుంచి 87 తీసివేయవలెను. పిదప దానిని 60చే విభజించి శేషమును వేరుగా ఉంచుకొనవలెను. పిదప లబ్ధమును తరువాతి అంకముతో కలిపి 60తో భాగించవలెను. ప్రథమ స్థానాంకమును 7చే భాగించగా శేషించిన సంఖ్యను అనుసరించి రవ్యాదివారములు వచ్చును. మిగిలిన రెండు స్థానముల అంకములు తిథిధ్రువలగును. ‘సగుణ’మును రెండుచే గుణించి, దాని నుండి మూడు తీసివేసి, దాని క్రింద సగుణము వ్రాసి దానికి 30 కలుపవలెను. పిదప 6; 12; 8; అంకములను మూడు స్థానములందును కలపవలెను. మరల 60చే భాగించి ప్రథమ స్థానమును 28చే భాగించి శేషమును వ్రాయవలెను. దానిక్రింద పూర్వానీత తిథి ధ్రువను వ్రాయవలెను. అన్నింటిని కలపగా ధ్రువ ఏర్పడును. మరల ఆ సగుణమునే చేయవలెను. దానిలో మూడు తీసివేసి రెండుచే గుణించవలెను. మధ్యను పదకొండుచే గుణించి క్రింద ఒకటి కలపవలెను. ద్వితీయ స్థానమునందు 39తో భాగించి, లబ్ధమును ప్రథమ స్థానమున తగ్గించవలెను. దానికే మధ్యమని పేరు. మధ్యయందు 22 తీసివేయవలెను. దానిని 60చే భాగించగా శేషము ఋణము. లబ్ధిని ఊర్ధ్వమునందు, అనగా నక్షత్ర ధ్రువయందు కలపవలెను. 27చే భాగించగా, శేషము నక్షత్ర-యోగముల ధ్రువ అగును. ఇపుడు తిథి నక్షత్రముల మాసికధ్రువ చెప్పబడుచున్నది. (2-32-00) ఇది తిథి ధ్రువ (2-11-00) ఇది నక్షత్ర ధ్రువ ఈ ధ్రువమును ప్రతి మాసమునందును జోడించి, వారస్థానమున ఏడుచే భాగించి, శేషమును వారమునందు తిథియొక్క దండ ఫలముగా గ్రహించవలెను. నక్షత్రముకొరకు 27చే భాగించి, అశ్విని నుండి శేష సంఖ్య గల నక్షత్రము యొక్క దండాదిగా గ్రహించవలెను.
(పైన చెప్పిన విధముగ తిథ్యాది మానము మధ్యమానమును అనుసరించి నిశ్చయింప బడినది. దానిని స్పష్టము చేయుటకై సంస్కారమును చెప్పుచున్నాడు) చతుర్దశ్యాది తిథులందు చెప్పిన ఘటికలను క్రమముగా ఋణ-ధనములు గాను చేసికొనవలెను. చతుర్దశి యందు శూన్య ఘటిని, త్రయోదశీ-ప్రతిపత్తులందు ఐదు ఘటికలను క్రమముగా ఋణముగాను, ధనముగాను చేయవలెను. ద్వాదశీ-ద్వితీయల యందు పది ఘటికలు ఋణ ధనములుగా చేయవలెను. తృతీయైకాదశులందు 15 ఘటికలు, చతుర్థీ దశములందు 19 ఘటికలు, పంచమీ-నవములందు 22 ఘటికలు, షష్ఠీ-అష్టములందు 24 ఘటికలు, సప్తమియందు 25 ఘటికలు ధన-ఋణ సంస్కారము చేయవలెను. ఈ అంశాత్మక ఫలమును చతుర్దశ్యాది తిథి పిండమునందు చేయవలెను. కర్కటకాది రాశీ త్రయము నందు 6; 4; 3, తులాది రాశి త్రయమునందు 3, 4, 6 సంస్కారము చేయుటకై ‘ఖండ’ ఏర్పడును. మేషాది రాశి త్రయమునందు 50, 40, 12లను ధనము చేయవలెను. కర్కటకాది రాశిత్రయము నందు 12, 40, 50లు చేయవలెను. తులాదిరాశి షట్కమునందు వీటితో ఋణ సంస్కారము చేయవలెను. చతుర్గుణితమగు తిథియందు వికలాత్మక ఫల సంస్కారము చేయవలెను. ‘గత’ ‘ఏష్య’ ఖండల అంతరముచే కలను గుణించవలెను. 60చే భాగించవలెను. లబ్ధము ప్రథమోచ్చారమునందు ఋణఫలమైనను, ధనము చేయవలెను. ధనమైనచో ధనముగనే ఉంచవలెను. ద్వితీయోచ్చారిత వర్గము ఉన్నప్పుడు విపరీతము చేయవలెను. తిథిని రెట్టించి దాని ఆరవ భాగమును దానినుంచి తీసివేయవలెను. సూర్య సంస్కారమునకు విపరీతముగ తిథి దండమును కలపవలెను. ఋణ ఫలమును తగ్గించగా తిథిదండాదిమాన మేర్పడును, ఋణఫలము తీసివేయ వీలుకానిచో దానియందు 60 కలిపి సంస్కారము చేయవలెను. ఫలమే 60 కంటే అధికమైనచో దానిలో నుండి 60 తీసివేసి మిగిలినదాని సంస్కారము చేయవలెను. దానిచే తిథితోపాటు నక్షత్ర మానము కూడ ఏర్పడును. చతుర్గుణితమగు తిథియందు తిథి త్రిభాగమును కలిపి దానికి ఋణ ఫలము కూడా కలపవలెను. తృతము చేయగా యోగమానము వచ్చును. తిథి మానము స్పష్టమే. లేదా సూర్య-చంద్రయోగము చేసికూడ యోగమానము సాధించవచ్చును. తిథి సంఖ్యనుండి ఒకటి తీసివేసి, దానిని రెట్టించి, మరల ఒకటి తీసివేయగా చరాది కరణముల ఏర్పడును. కృష్ణపక్ష చతుర్దశి పరార్ధము నుండి శకుని, చతుష్పదము, కింస్తుఘ్నము, నాగము అను నాలుగు స్థిర కరణములు వచ్చును. శుక్లపక్ష ప్రతివత్పూర్వార్ధ మున కింస్తుఘ్నకరణము ఉండును.(122)
