అగ్ని మహా పురాణము

Table of Contents

శివపూజాంగ హోమ విధి

మహేశ్వరుడు పలికెను: పూజానంతరము ఉపాసకుడు శరీరమును వస్త్రాదులతో ఆచ్ఛాదించు కొని, అర్ఘ్యపాత్రను చేత ధరించి, అగ్నిశాలలోనికి వెళ్లి దివ్య దృష్టిచే యజ్ఞమునకు ఆవశ్యకములగు సమస్త ఉపకరణములను సమకూర్చుకొనవలెను. ఉత్తరాభిముఖుడై అగ్ని కుండమును చూచి కుశలతో దానిని ప్రోక్షించి మార్జనము చేయవలెను. తాడనము (మార్జనము) అస్త్ర మంత్రముతో (ఫట్) చేయవలెను. అభ్యుక్షణము కవచ మంత్రముతో (హుం) చేయవలెను. కవచ మంత్రముచే (హుం) దానికి అభిషేకము, శరమంత్రముచే (ఫట్) భూకుట్టనము చేయవలెను. నమ్మార్జనము, ఉపలేపనము, కలాత్మక రూపకల్పన త్రిసూత్రీపరిధానము, అర్చనము ఇవన్నియు కవచ మంత్రము తోడనే చేయవలెను. కుండమునకు ఉత్తరమున మూడు రేఖలు గీయవలెను. ఒక రేఖ పూర్వాభిముఖమై పై నుండి క్రిందికివచ్చునట్లు గీయవలెను. రేఖలు కుశతోగాని, త్రిశూలముతోగాని గీయవలెను. లేదా ఆ రేఖలు అన్నింటిని క్రిందుమీదుగా ఉన్నట్లుకూడ చేయవచ్చును.

అస్త్రమంత్రము (ఫట్) ను ఉచ్చరించి వజ్రీకరణముచేసి, ‘నమః’ ఉచ్చరించి కుశలచే చతుష్పథన్యాసము చేయవలెను. కవచమంత్రము (హుమ్)తో అక్షపాత్రను, హృదయమంత్ర (నమః)తో విపరమును స్థాపించవలెను. “వాగీశ్వర్యై నమః” “ఈశాయ నమః” అను మంత్రములు ఉచ్చరించి వాగీశ్వరిని, ఈశుని ఆవాహనచేసి పూజించవలెను. పిమ్మట మంచి స్థానము నుండి అగ్నిని, శుద్ధమైన పాత్రలో నుంచి తీసికొని వచ్చి, దానినుండి, “క్రవ్యాద మగ్నిం ప్రహిణోమి దూరమ్” ఇత్యాది మంత్రము పఠించుచు క్రవ్యాదాంశమైన అగ్ని కణమును తొలగించవలెను. పిమ్మట నిరీక్షణాదులచే శోధితమగు ఔదర్య, ఐన్దవ, భౌత, అగ్నిత్రయమును ఏకముచేసి “ఓం హూం వహ్ని చైతన్యాయ నమః” అను మంత్రము ఉచ్చరించి అగ్ని బీజముతో (రం) స్థాపించవలెను.

సంహితామంత్రముచే అభిమంత్రితమై, ధేనుముద్రా ప్రదర్శన పూర్వకముగ అమృతీకరణ క్రియచే సంస్కృతమై అస్త్రమంత్రముచే సురక్షితమై, కవచ మంత్రముచే అవగుంఠితమై, పూజింపబడిన అగ్నిని, అగ్నికుండము పై మూడు పర్యాయములు ప్రదక్షిణముగా త్రిప్పి, “ఇది శివుని బీజము” అని భావనచేసి, “వాగీశ్వర దేవునిచే ఈ బీజమును వాగీశ్వరీ గర్భమునందు స్థాపింపబడెను” అని ధ్యానముచేసి, మంత్రసాధకుడు మోకాళ్లు భూమిపైఆన్చి నమస్కార పూర్వకముగ ఆ అగ్నిని తన ఎదుట కుండమునందు స్థాపించవలెను. పిమ్మట ఏకుండమునందు బీజ రూపాగ్ని ధ్యానము చేయబడినదో దాని నాభి దేశమునందు కుశలచే పరిసంవహనము చేయవలెను, పరిధాన-సంభారము, శుద్ధి ఆచమనము, నమస్కారముచేసి గర్భాగ్నిని పూజించి, ఆగర్భజాగ్ని రక్షణము కొరకై అస్త్రమంత్రముచే, వాగీశ్వరీదేవి పాణిపల్లవము నందు కంకణము (రక్షా సూత్రము) కట్టినట్లు భావన చేయవలెను. సద్యోజాత మంత్రముతో, గర్భాధానము కొరకై, అగ్నిపూజనముచేసి, హృదయ మంత్రముతో మూడు ఆహుతులు ఇవ్వవలెను. మూడవ మాసమున జరుగు పుంసవన సంస్కారమును భావన చేసి, అది సిద్ధించుటకై వామదేవ మంత్రముతో అగ్నిని పూజించి “శిరసే స్వాహా” అని పలుకుచు, మూడు హోమములు చేయవలెను. పిమ్మట ఆ అగ్నిపై జలబిందువును చల్లవలెను. పిమ్మట ఆరవమాసమున జరుగు సీమంతోన్నయమును భావనచేసి అఘోర మంత్రముతో అగ్నిని పూజించి, “శాఖాయై వషట్” అని ఉచ్చరించుచు మూడుహోమములుచేసి, ఆ మంత్రముతోడనే ముఖాద్యంగకల్పన చేయవలెను. ముఖోద్ఘాటనమును ప్రకటీకరణమును చేయవలెను. పిమ్మట వెనుకటి వలెనే పదవ మాసమున జరుగు జాతకర్మ, నరకర్మలను భావించుచు తత్పురుష మంత్రముతో దర్భాదులతో అగ్నిని పూజించి, జ్వలింపచేసి, గర్భమలమును తొలగించుటకై స్నానము చేయించి, దేవి హస్తమునందు సువర్ణ బంధనము చేసినట్లు భావనచేసి, హృదయ మంత్రముతో పూజించవలెను. సూతకము వెంటనే నివర్తించుటకై అస్త్ర మంత్రముతో అభి మంత్రించిన జలముతో అభిషేకము చేయవలెను.

కుండమును, బైటనుండి, అస్త్రమంత్రము చదువుచు కుశలతో మార్జనము చేయవలెను. ‘హుం’ అని ఉచ్చరించుచు ఉదకముతో తడపవలెను. కుండము వెలుపల నున్న మేఖలలపై, అస్త్ర మంత్రముతో, ఉత్తర, దక్షిణ దిక్కులందు పూర్వాగ్రముగాను, పూర్వ పశ్చిమములందు ఉత్తరాగ్రముగాను కుశలు పరవవలెను. వాటిపై హృదయ మంత్రముతో పరిధివిష్టరము స్థాపింపవలెను. పిమ్మట సద్యోజాతాది ముఖపంచకమునకు సంబంధించిన మంత్రములు చదువుచు, అస్త్రమంత్రము ఉచ్చరించుచు, నాలచ్ఛేదనము కొరకై, ఐదు సమిధల మూలములను ఆజ్యమునందు ముంచి హోమము చేయవలెను. పిమ్మట దూర్వా క్షతాదులతో బ్రహ్మ, శివ, విష్ణు, అనంతులను వారి నామములకు ‘నమః’ చేర్చుచు పూజించవలెను. కుండమునకు నాలు వైపులందును పరచిన ఎనిమిది ఆసనములపై పూర్వాది దిక్కులందు వరుసగ ఇంద్రాది దిక్పాలకులను ఆవాహనచేసి, స్థాపనచేసి, వారందరును అగ్నివైపు ముఖములతో కూర్చున్నట్లు భావన చేయుచు, వారి నామములకు ‘నమః చేర్చుచు పూజ చేయవలెను. “ఓ దేవతలారా! మీరందరును విఘ్నములను తొలగించి ఈ బాలకుని (అగ్నిని) సంరక్షించుడు” అను శివాజ్ఞను ఆ దేవతలకు వినిపించి, స్రుక్, స్రువములను ఊర్ధ్వముఖములుగ గ్రహించి వాటిని మూడేసి సార్లు అగ్నిపై వెచ్చచేయ వలెను. కుశమూల, మధ్య, అగ్రభాగములతో వాటిని స్పృశించుచు ఆ స్థానములందు క్రమముగ ఆత్మతత్త్వ, విద్యాతత్త్వ, శివతత్త్వముల న్యాసము చేయవలెను. “ఓం హాం ఆత్మతత్త్వాయ నమః” “ఓం హ్రీం విద్యాతత్త్వాయ నమః” “ఓం హూం శివతత్త్వాయ నమః” అనునవి న్యాస మంత్రములు. పిమ్మట ‘శక్త్యై నమః “శివాయ నమః” అను మంత్రములతో స్రుక్ స్రువములపై శివశక్తి న్యాసము చేయవలెను. మూడు పేటల రక్షా సూత్రమును స్రుక్ స్రువముల కంఠభాగమునందు చుట్టబెట్టవలెను. పుష్పాదులతో వాటిని పూజించి కుడి ప్రక్కన ఉన్న కుశములపై ఉంచవలెను. గోఘృతము గ్రహించి దర్శనాదులచే దానిని పరిశుద్ధముచేసి, తాను బ్రహ్మమయుడని భావన చేయుచు ఆ ఘృత పాత్రమును హృదయ మంత్రముతో అగ్నికుండముపై ఆగ్నేయమున త్రిప్పి, మరల నేను విష్ణుస్వరూపుడనని భావన చేయుచు, ఘృతమును హృదయ మంత్రముతో అగ్ని కుండముపై ఆగ్నేయమున త్రిప్పి, మరల నేను విష్ణు స్వరూపుడనని భావన చేయుచు, ఘృతమును ఈశాన్యమునందు ఉంచి, కుశాగ్ర భాగముచే ఘృతము తీసి “శిరసే స్వాహా “విష్ణవే స్వాహా” అను మంత్రములతో విష్ణువునకు ఆ ఘృత బిందువులను హోమము చేయవలెను. నేను రుద్రమయుడనని భావన చేయుచు, ఘృతమును కుండనాభి స్థానము నందు ఉంచి, దాని ఆప్లావనము చేయవలెను.

ప్రాదేశ (చాపిన బొటన వ్రేలు చివరి నుంచి చూపుడు వ్రేలు చివర వరకు ఉన్న పొడవు ప్రాదేశము) ప్రమాణముగల రెండు కుశలను అంగుష్ఠ, అనామికాంగుళులతో పట్టుకొని, వాటితో అస్త్రమంత్రో (ఫట్) చ్చారణము చేయుచు, నేతిని అగ్నివైపు కదప వలెను. హృదయ మంత్రము (నమః) ఉచ్చరించుచు, చేతిలోని దర్భను కాల్చి, దానిని ‘ఫట్’తో అగ్నిచే పవిత్రము చేయవలెను. మండుతున్న కుశతో దానికి హారతిఇచ్చి, మరొక కుశతో దానిని కాల్చవలెను. మండిన కుశను అస్త్రమంత్రముతో అగ్నిలో పడవేయవలెను. పిమ్మట, ముడివేసిన, ప్రాదేశ ప్రమాణముగల కుశను చేతిలో ఉంచవలెను. ఘృతములో రెండు పక్షములు, ఇడాది నాడీత్రయము ఉన్నట్లు భావన చేయవలెను. ఇడ మొదలగు మూడు భాగముల నుండి క్రమముగ సువముతో ఘృతము గ్రహించి హోమము చేయగా మిగిలిన ఘృతమును, వేరుగా ఉంచిన పాత్రలో ఉంచవలెను. ఇడాభాగము నుండి ఆజ్యము గ్రహించి “ఓం హాం అగ్నయే స్వాహా” అను మంత్రము ఉచ్చరించుచు హోమము చేసి, హుత శేషమును ఒక పాత్రలో ఉంచవలెను. పింగలా భాగము నుండి ఆజ్యము గ్రహించి  “ఓం హాం సోమాయ స్వాహా” అని ఉచ్చరించుచు హోమముచేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. సుషమ్ణానాడీ భాగము నుండి ఆజ్యము గ్రహించి “ఓం హాం అగ్నీ షోమాభ్యాం స్వాహా” అని ఉచ్చరించుచు స్రువముతో హోమముచేసి, హుత శేషమును ఒక పాత్రలో ఉంచుకొనవలెను. పిమ్మట బాలకుడైన అగ్నియొక్క ముఖము నందున్న నేత్రత్రయ స్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, ఘృతపూర్ణమగు స్రువముతో “ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా” అను మంత్రమును ఉచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలెను. “ఓం హాం హృదయాయ నమః” ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చరించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేను ముద్రతో మేల్కొల్పవలెను. కవచ మంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శరమంత్రముచే ఘృత బిందూక్షేపణము చేసి, అభ్యుక్షణ శోధనములు చేయవలెను. శివస్వరూపుడగు అగ్ని యొక్క ఐదు ముఖములకు అఘార హోమము, అనుసంధాన హోమము, ముఖముల ఏకీకరణమునకై చేయు హోమమును చేయవలెను. “ఓం హాం సద్యోజాతాయ స్వాహా, క్షం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం మాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా” అను ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆజ్యాహుతిచేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో ఆప్లావితము చేయవలెను. ఇది ముఖాభిఘార హోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధాన హోమము. దానిని “ఓం హాం సద్యోజాత వామ దేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోర తత్పురుషా భ్యాం స్వాహా, ఓం హా తత్పురుషేశానాభ్యాం స్వాహా” అను మంత్రములతో చేయవలెను.

పిమ్మట కుండమునందు ఆగ్నేయము నుండి వాయవ్యము వరకును నైరృతి నుండి ఈశాన్యము వరకును, “ఓం హాం సద్యోజాత, వాసుదేవా ఘోర తత్పురుషేశానేభ్యః స్వాహా” అను మంత్రముతో అవిచ్ఛిన్నాజ్యధారా హోమము చేసి పంచముఖముల ఏకీకరణము చేయవలెను. ఈ విధముగ ఇష్టముఖమునందు అన్ని ముఖములును అంతర్భూతములగును. అందుచే ఒకే ముఖము అన్ని ముఖముల ఆకారమును ధరించును. కుండమునందు ఈశాన్యమున అగ్నిని పూజించి, అస్త్ర మంత్రముతో మూడు ఆహుతుల నిచ్చి, అగ్నికి నామకరణము చేయవలెను. ‘ఓ అగ్నిదేవా! నీవు అన్ని విధముల శివుడవు, మంగళప్రదుడవు. అందుచే నీ పేరు శివుడు” అని నామకరణముచేసి, పూజింపబడిన మాతా పితరులగు వాగీశ్వరీ వాగీశ్వరులను, నమస్కార పూర్వకముగ అగ్నియందు విసర్జించి, వారికొరకై విధి పూర్వకముగ పూర్ణాహుతి ఈయవలెను. మూలమంత్రము చివర ‘వౌషట్’చేర్చి శివశక్తులకు యథావిధిగ పూర్ణాహుతి ఈయవలెను. పిమ్మట అంగ, సేనాసమేతుడగు, పరమతేజఃశాలియైన శివుని హృదయ కమలమునందు ఆవాహనచేసి, వెనుకటివలెనే పూజించి ఆ శివుని ఆజ్ఞగైకొని ఆయనను పూర్తిగ తృప్తుని చేయవలెను.

యజ్ఞాగ్నికిని, శివునకును తనతో నాడీసంధానముచేసి, శక్త్యానుసారముగ మూల మంత్రముతో అంగసహితముగ దశాంశహోమము చేయవలెను. ఒక్కొక్క కర్ష ప్రమాణముగల ఘృత, క్షీర, మధులను, శుక్తి ప్రమాణముగల పెరుగును, చారెడు పాయసమును హోమము చేయవలెను. లాజలు, సర్వ భక్ష్యములు పిడికిలి ప్రమాణమున గ్రహించి హోమము చేయవలెను. మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఈయవలెను. ఫలములు వాటి ప్రమాణము ఎంత ఉండునో అంతే చేయవలెను. అన్నము ప్రమాణము గ్రాసములో సగము. చిన్న (కిస్‌మిస్ వంటి) వాటిని పర్యాయమునకు ఐదేసి గ్రహించి హోమము చేయవలెను. చెరకు ఒక కణుపు గ్రహించవలెను. లతలు రెండేసి అంగుళములు ఉండవలెను. పుష్పపత్రముల ప్రమాణము వాటి ప్రమాణమును అనుసరించి ఉండవలెను. సమిధలు పది అంగుళముల పొడవు ఉండవలెను.

కర్పూర, చందన, కేసర, కస్తూరీ, యక్షకర్దమములు కలాయ ప్రమాణమున (శనగ గింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉండవలెను. కందములు ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్నమగునటుల చేయవలెను. పిమ్మట ఘృతముతో నింపిన స్రుక్కుపైన అధోముఖమగు స్రువము ఉంచి, స్రుక్కునకు చివర పుష్పములు ఉంచవలెను. రెండు చేతులతోడను ఆ రెండింటిని, శంఖముద్రతో పట్టుకొనవలెను. శరీరము పైభాగము ఉన్నతమగునట్లు చేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలచి, స్రుక్స్రువముల మూల భాగములను నాభికి ఆన్చి, దృష్టిని స్థిరముగ నిలిపి, భావనచే బ్రహ్మాది కారణములను విడచుచు, సుషుమ్నా నాడీ మార్గమున బైటకు వచ్చి పైన నిలబడవలెను. స్రుక్స్రువముల మూల భాగములను నాభినుండి పైకిలేపి ఎడమ స్తనమువైపు తీసికొని రావలెను. శరీరముచేతను, మనస్సుచేతను ఆలస్యమును రూపముచేసి, వషట్ వరకును మూలమంత్రములు (ఓం నమః శివాయ వౌషట్) మెల్లగ చదువుచు ఆ ఘృతమును యవవలె సన్ననైన ధారతో హోమము చేయవలెను. పిదప, ఆచమన, చందన, తాంబూలాదులు సమర్పించి భక్తి భావముతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగ వందనముచేసి మరల అగ్నిపూజ చేసి, ‘ఓం హః అస్త్రాయ ఫట్” అని ఉచ్చరించుచు సంహారముద్రచే శంబరాహరణము చేసి, భగవంతుడా! నా అపరాధములను క్షమింపుము అని ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్రము ఉచ్చరించుచు పూరక ప్రాణాయామముచే, శ్రద్ధతో, తేజఃశాలులగు ఆ సంధులను తన హృదయ కమలమునందు నిలుపవలెను. వండిన పదార్థములలోని అగ్రభాగము తీసి, కుండ సమీపమున అగ్ని కోణమునందు, రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఈయవలెను. రెండవదానియందు బాహ్యబలి ఈయవలెను. ప్రథమ మండలమునందు, పూర్వ దిక్కున, “ఓం హాం రుద్రేభ్యః స్వాహా” అను మంత్రముతో రుద్రులకు బలి ఈయవలెను. దక్షిణమున “ఓం హాం మాతృభ్యః స్వాహా” అను మంత్రముతో మాతృ కలకును, పశ్చిమమున ఓం హాం గణేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అను మంత్రముతో గణములకును, ఉత్తరమున “ఓం హాం యక్షేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అను మంత్రముతో యక్షులకును, ఈశాన్యమునందు ‘ఓం హాం గ్రహేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు’ అని చెప్పి గ్రహములకును, ఆగ్నేయమున ‘ఓం హాం అసురేభ్యః స్వాహా’ తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అసురులకును, నైరృతియందు ‘ఓం మాం రక్షోభ్యః స్వాహా’, తేభ్యోయం బలిరస్తు అని చెప్పి రాక్షసులకును, వాయవ్యము నందు ‘ఓం మాం నాగేభ్యః స్వాహా’, తేభ్యోయం బలిరస్తు అని నాగులకును, మండల మధ్యభాగమున ఓం హాం  నక్షత్రేభ్యః స్వాహాతేభ్యోయం బలిరస్తు అని చెప్పి నక్షత్రములకును బలి ఇవ్వవలెను. ‘ఓం హాం రాశిభ్యః స్వాహా’ తేభ్యోయం బలిరస్తు అని చెప్పి ఆగ్నేయమునందు రాశులకును, ‘ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యః స్వాహా’ తేభ్యోయం బలిరస్తు అని చెప్పి నైరృతి యందు విశ్వేదేవతలకును, ‘ఓం హాం క్షేత్రపాలాయ స్వాహా’, తస్మా అయం బలిరస్తు అని చెప్పి పశ్చిమమునందు క్షేత్రపాలునకును బలి ఈయవలెను. పిమ్మట రెండవ బాహ్య మండలమునందు, పూర్వాది దిక్కులందు, వరుసగ ఇంద్ర, అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులకు బలి సమర్పించవలెను. పిదప ఈశాన్యమునందు ఓం బ్రహ్మణే నమః స్వాహా అని చెప్పి బ్రహ్మకును, నైరృతియందు ఓం విష్ణవే నమః స్వాహా అని చెప్పి విష్ణువునకు బలి ఇవ్వవలెను. మండలము వెలుపల కాకాదులకు గూడ బలి అంతర, బాహ్యబలుల నిచ్చునపుడు ఉపయోగించిన మంత్రములను సంహారముద్రచే తనలో లీనము చేసికొనవలెను. (75)