అగ్ని మహా పురాణము

Table of Contents

త్వరితామూల మంత్ర వర్ణనము -1

అగ్నిదేవుడు పలికెను:

భుక్తి ముక్తి ప్రదమగు మరియొక త్వరితా విద్యను చెప్పెదను. ధూళిచే నిర్మించ బడినదియు, వజ్ర చిహ్నముచే ఆవరింపబడినది అగు భూపుర మండలమున త్వరితా దేవిని పూజించవలయును. ఆ మండలములో యోగపీఠముపై కమలమును నిర్మించి మండలము యొక్క పూర్వాది దిక్కు లందును, విదిక్కులందును వజ్రచిహ్నమును, మండల ములోపల వీథి ద్వారము, శోభ, ఉపశోభ మొదలగు వాటిని రచించవలెను. దాని లోపల త్వరితా దేవిని భావన చేయవలయును. ఆమెకు పదునెనిమిది భుజము లుండును. ఎడమ కాలు సింహము వీపుపైనను కుడికాలు దానికి రెట్టింపు ఆకారముతో పాద పీఠమునందును ఉంచబడి యుండును. ఆమె (సర్ప) నాగమయ అలంకారములతో అలంకరింపబడి యుండును, కుడివైపున ఉన్న హస్తములలో క్రమముగ వజ్ర-దండ-ఖడ్గ-చక్ర-గదా-శూల బాణ-శక్తి-వరద ముద్రలు, ఎడమ ప్రక్కన వున్న చేతులలో ధనుః-పాశ-శర-ఘంటా-తర్జనీ-శంఖ-అంకుశ-అభయ ముద్ర వజ్రాయుధములను ధరించి యుండును. ఆ దేవుని పూజించుటచే శత్రువులు నశింతురు. అవలీలగా రాష్ట్రమును జయించగలుగును. దీర్ఘాయుర్దాయవంతుడై రాష్ట్రైశ్వర్యమును పొందును. దివ్య సిద్ధులను అదివ్య సిద్ధులను కూడ పొందును. తల అనగా సప్త పాతాళములు కాలము, అగ్ని సకల భువనములు, అంతకుడు అని అర్థము, ఓంకారముచే పరమేశ్వరుడు మొదలు బ్రహ్మాండము లన్నియు ప్రతిపాదింపబడును. తన మంత్రము యొక్క ఆద్యక్షరమగు ఓం కారముచే తల పర్యంతము దేవి తోయము శీఘ్రముగ త్రిప్పును. అందుచే ఆమెకు “తోతలాత్వరితా” యని పేరు.

ఇప్పుడు, త్వరితా మంత్ర ప్రస్తారమును చెప్పెదను. భూతలముపై సర్వ సముదాయమును వ్రాయవలయును. ‘క’ వర్గమునకు సాంకేతిక నామము స్వరవర్గ మొదటిది, తొలువర్గము రెండవది. మూడవది జిహ్వాతాలుక వర్గము నాల్గవది తాలు జిహ్వాగ్ర వర్గము ఐదవది జిహ్వా దంతక వర్గము ఆరవది ఓష్ట పుట సంపన్నము. ఏడవది మిశ్ర వర్గము ఎనిమిదవది ఊష్మ వర్గము. ఈ వర్గములు అక్షరముల నుండి మంత్రోద్ధారము చేయవలెను. ఆరవస్వరమైన ‘ఊ’ కారముపై ఊష్మవర్గ ద్వితీయాక్షరమైన ‘హ’ కారము బిందు సంయుక్తము చేయవలెను. (హూం) తాలువర్గ తృతీయాక్షరమగు ‘ఖ’కారమును పదకొండవ స్వరమగు ‘ఏ’కారముతో కూర్చవలెను. (ఖే) జిహ్వాతాలు సమాయోగము యొక్క మొదటి అక్షరమగు ‘చ’ కారము దాని క్రింద అదే వర్గము యొక్క ద్వితీయా క్షరమగు ‘ఛ’ కారము పదకొండవ స్వరమగు ‘ఏ’కారముతో కలుపవలెను. (చ్ఛ్యే)తాలువర్గ ప్రథమాక్షరమగు ‘క’ కారమును దాని క్రింద ఊష్మవర్గ ద్వితీయాక్షర మగు ‘ష’కారము చేర్చి పదునారవ స్వరమగు అఃతో కలుపవలయును. (క్షః) ఊష్మవర్గ తృతీయాక్షరమగు ‘స’ కారమునకు క్రింద జిహ్వాదంత సమాయోగ ప్రథమాక్షరమగు ‘త’ కారము చేర్చి దాని క్రింద మిశ్రవర్గ ద్వితీయా క్షరమగు ‘ర’ కారము కలుపవలెను. పిదప నాల్గవ స్వరమగు ‘ఈ’ కారము చేర్చవలెను. (స్త్రీ) తాలువర్గ ప్రథమాక్షరమగు ‘క’ కారమునకు క్రింద ఊష్మవర్గ ద్వితీయా క్షరమగు షకారమునుచేర్చి పండ్రెండవ స్వరమగు ‘ఏ’ కారమును కలుపవలెను. (క్షే) పిదప ఊష్మవర్గ అంత్యాక్షరమగు ‘హ’ కారమునకు అనుస్వారము చేర్చి ఐదవ స్వరమును కలుపవలెను. (హూం) ఓష్ఠ సంపుట యోగము నుండి రెండవ అక్షరమగు ‘ప’కారమునకు జిహ్వాగ్రతాలు యోగము నుండి ‘ఠ’కారమును పంచమమగు ‘న’కారముగా మార్చి కలుపవలెను. స్వర అర్ధ వ్యంజనములతో ఉద్ధృతములగు ఈ అక్షరములతో తలాత్వరితా మంత్రము ఇది. దీని ఆదియందు ఓం కారమును అంతమునందు నమఃను చేర్చిన మంత్రమును జపము చేయవలయును. హోమము నందు మాత్రము నమః తొలగించి స్వాహా చేర్చవలెను. అనగా ఓం హూం-ఖే-చ్ఛ్యే-క్షః-స్త్రీ క్షే, హూం-ఫట్ నమః అనునది జప మంత్రము. నమః బదులు స్వాహా చేర్చిన హోమ మంత్రము.

దీని అంగన్యాసము ఈ విధముగ నుండును. ఓం హ్రీం హ్రూం హ్రః హృదయాయ నమః, హాం హః శిరసే స్వాహా, హ్రీం జ్వల జ్వల శిఖాయైవ షట్ హులు హులు కవచాయ హుం హ్రీం శ్రీం క్షూం నేత్రత్రయాయ వౌషట్ ఫట్ అనునది దేవీ నేత్రముగా చెప్పబడినది. క్షౌంహః ఖౌః, హూం-ఫట్, అస్త్రాయ ఫట్ ఇవి గుహ్యాంగ మంత్రములు. వీటి న్యాసము ముందుగా చేయవలయును. త్వరితాంగములను తరువాత చెప్పెదను. విద్యాంగములను వినుము. మొదటి రెండు బీజాక్షరములు హృదయము. తృతీయ చతుర్థాక్షరములు స్థిరములు. పంచషష్ఠ అక్షరములు శిఖా మంత్రము, సప్త అష్టమ వర్ణములు కవచ మంత్రములు నవమాక్షరము అర్ధాక్షరము తారకము ‘తో తలే వజ్రతుండే ఖఖ హూం’ అను పది యక్షరములు కలది వజ్రతుండికా నామకమగు ఇంద్రదూతికా విద్య. ఖేచరి-జ్వాలిని-జ్వాలే ఖఖ అను పది అక్షరములు కలది జ్వాలినీ విద్య వర్చేశర విభీషణి ఖఖే అనునది దశాక్షర శబరీ విద్య ఛఛేదని, కరాలిని ఖఖ ఇది దశాక్షర కరాలినీ విద్య, క్షః శ్రవ ద్రవ ప్లవని, ఖఖే ఇది దశాక్షర ప్లవంగ దూతీవిద్య. ‘స్త్రీ బలం కలిదొనని శాసి’ ఇది దశాక్షర శ్వసన వేగికా విద్య. క్షే పక్షే కపిలే హంస ఇది దశాక్షరకపిలా దూతికా విద్యా. “హ్రూం తేజోవతి రౌద్రి మాతంగి’ ఇది దశాక్షర రౌది దూతికా విద్య. పుటేపుటే ఖఖ ఖడ్గే ఫట్. ఇది దశాక్షర బ్రహ్మ దూతికా విద్య, వైతాలిలో చెప్పబడిన అన్ని మంత్రములును దశాక్షరములు. ఇతరమైన వాటినన్నింటిని పొల్లువలె సారహేయములుగా భావించి విడిచి వేయవలెను. న్యాసాదుల యందు హృదయాద్యంగములను ఉపయోగించవలెను. నేత్రమును మధ్యము నందు న్యాసము చేయవలెను.

పాదము నుండి శిరస్సు వరకు, శిరస్సు నుండి పాదముల వరకు చరణ జాను ఊరు గుహ్య నాభి హృదయములను కంఠ దేశము నుండి ముఖమండల పర్యంతము పైకిని క్రిందకును, ఆది బీజము నుండి నిర్గతమైనదియు, అమృతధారను వర్షించునదియు హోమ రూపమగు ఆకారము బ్రహ్మరంధ్రమునుండి నాలో ప్రవేశించుచున్నది అని సాధకుడు భావనచేయవలెను. మంత్రోపాసకుడు శిరోముఖ కంఠ హృదయ నాభి గుహ్య ఊరుజాను పాదములందును తర్జనియందును మాటి మాటికి ఆదిబీజమును న్యాసము చేయవలెను. అమృతమయ హోమముపైనను బీజాక్షర రూపమగు శరీర కమలము క్రిందను ఉన్నదియను రహస్యము తెలిసిన వానికి మృత్యు భయముగాని వ్యాధి జరాదులు గాని వుండవు. న్యాస ధ్యాన పూర్వకముగ ధ్యానముచేసి త్వరితా మంత్రము నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. ఇప్పుడు ప్రణీతాది ముద్రలను చెప్పెదను, ప్రణీతా ముద్రలు ప్రణీత, సబీజా ప్రణీత, భేదని కరాలి వజ్రతుండ అని ఐదు విధములు. రెండు చేతులు కలిపి అంగుష్టములను మధ్యయందుంచి తర్జని పైకి చాపినచో ప్రణీత, దీనిని హృదయ దేశమునందు చూపవలెను. ఈ ముద్రయందు కనిష్టికను పైకి వుండునట్లు చేసి మధ్యయందుంచినచో అది సబీజ తర్జని. మధ్యయందు అనామికను పరస్పర సంలగ్నముచేసి అంగుష్ఠాగ్ర భాగమును మధ్య యందుంచినచో అది భేదనీ ముద్ర. ఆ ముద్రను నాభి దేశము నందుంచి అంగుష్టము నందలి జలమును జల్లవలెను. దీనినే హృదయమునందుంచినచో కరాలి అని మహాముద్ర అగును. మరల బ్రహ్మ లగ్నా జ్యేష్ఠను వెనుకటి వలె పైకి నిలబడునట్లు చేసినచో అది వజ్రతుండ ముద్ర దానిని వజ్రదేశమున ఉంచవలెను. రెండు హస్తములతో మణిబంధమును బంధించి మూడే వ్రేళ్లు చాపి నచో వజ్రముద్ర అగును. వాటి వాటి ఆకారములను అనుసరించి దండ-ఖడ్గ-చక్ర-గదాది ముద్రలు చెప్పబడినవి. అంగుష్ఠముచే ఊర్ధ్వ ముఖములగు మూడువ్రేళ్లను ఆక్రమించినచో అది త్రిశూలముద్ర. మధ్య మాంగుళిని మాత్రము పైకి నిలిపినచో శక్తి ముద్రయగును. బాణ-వరద-ధనుష్-పాశ-భార-ఘంటా-శంఖ-అంకుశ-అభయ పద్మములు పైన చెప్పిన ప్రణీత మొదలగు ముద్రలు కలిపి ఇరువది యెనిమిది ముద్రలగును. గ్రహణి-మోక్షణి-జ్వాలిని-అమృత-అభయ-ఈ ఐదును ప్రణీతా ముద్రలు. వీటిని పూజా హోమములందు ఉపయోగించవలెను. (310)