అగ్ని మహా పురాణము

Table of Contents

సూర్య ప్రతిష్ఠా విధానము

పరమేశ్వరుడు పలికెను: ఇపుడు సూర్యప్రతిష్ఠా విధానము చెప్పెదను. వెనుకటివలె మండపాది నిర్మాణము, స్నానాదికముచేసి, పూర్వము చెప్పిన విధి ననుసరించి విద్యను, సాంగసూర్యదేవతను ఆసనశయ్యపై న్యాసముచేసి, తత్త్వములను, ఈశ్వరుని, ఆకాశాది పంచభూతములను న్యాసము చేయవలెను. పూర్వమువలె శుద్ధ్యాదికము చేసి, పిండి శోధనము చేయవలెను. సదేశ పదమువరకును తత్త్వ పంచకన్యాసము చేయవలెను. సర్వతో ముఖీశక్తితోకూడ యథావిధిగా స్థాపనముచేసి, గురువు, సూర్యమంత్రము జపించుచు శక్త్యన్త సూర్యుని స్థాపించవలెను. సూర్యదేవతకు పేరుచివర ‘స్వామి’ అని కాని ‘పాద’ అని కాని ఉంచవలెను. స్థాపనకు పూర్వోక్త సూర్య మంత్రములనే ఉపయోగించ వలెను. (99)