అగ్ని మహా పురాణము

Table of Contents

మంత్ర ఔషధులు

పరమేశ్వరుడు పలికెను:

ఇపుడు సంపూర్ణ మనోరథములను ఇచ్చు మంత్రచక్ర-ఔషధములను గూర్చి చెప్పెదను. చౌర్యము చేసినట్లు సందేహముగల వ్యక్తిని గూర్చి ఏదైన ఒక వస్తువు పేరు చెప్పి, దానిలో ఉన్న అక్షరముల సంఖ్య రెట్టింపుచేసి ఒకచోట ఉంచుకొనవలెను. ఆ పేరులోని మాత్రల సంఖ్యను నాలుగుచే గుణించి ఆ గుణన ఫలమును మరొకచోట ఉంచుకొన వలెను. మొదటి సంఖ్యతో రెండవ సంఖ్యను భాగించవలెను. శేషమున్నచో ఆ వ్యక్తి చోరుడని, శేషములేనిచో చోరుడు కాడనియు గ్రహించవలెను. ఇపుడు పుట్టబోయే శిశువును గూర్చి చెప్పెదను. ప్రశ్నలోని వర్ణములు విషమ సంఖ్యలో ఉన్నచో గర్భ శిశువు పురుషుడు, ప్రశ్నించువాడు చెప్పిన వస్తువు పేరు స్త్రీ లింగమైనచో, దాని అక్షరములు సమసంఖ్యలో నున్న యెడల పుట్టబోయే బాలునికి ఎడమ కన్ను గ్రుడ్డిదగును. ఏతద్విపరీత మైనచో దోషము లేదు. స్త్రీ పురుష నామముల మాత్రల సంఖ్యను, అక్షరముల సంఖ్యను వేరు వేరుగా నాలుగుచే గుణించి వేరువేరుగా ఉంచుకొనవలెను. మొదటిది మాత్రా పిండము, రెండవది వర్ణపిండము, వర్ణ పిండమును. మూడుచే భాగించవలెను. శేషము సమమైనచో కన్య విషమమైనచో పుత్రుడు జన్మించును. శూన్యము శేషమైనచో భర్తకంటె ముందు భార్య చనిపోవును. మాత్రా పిండమును మూడుచే భాగింపగా శూన్యము శేషమైనచో స్త్రీ కంటె ముందు పురుషుడు మరణించును. సమస్త భాగమునందు సూక్ష్మాక్షరములు గల ద్రవ్యముల ద్వారా ప్రశ్నను గ్రహించినచో అభీష్ట ఫలజ్ఞానము కలుగును. శని చక్రమును గూర్చి చెప్పెదను. శనిదృష్టి యున్న లగ్నము సర్వదా త్యాజ్యము. ఏడవ స్థానముపై శనిదృష్టి పూర్ణముగాను, చతుర్థ దశమ రాశులపై సగము ప్రథమ, ద్వితీయ, అష్టమ, ద్వాదశములందు పాదము ఉండును. శుభకర్మలందు వీటినన్నింటిని విడువ వలెను. ఏ దినమునందు ఏ గ్రహము అధిపతియో ఆ దినము నందలి మొదటి జాము ఆ గ్రహమునకు సంబంధించును, మిగిలిన గ్రహములు ఆ దివసము నందలి అర్ధయామములకు అధిపతులు. శని భాగమైన సమయమున యుద్దము చేయరాదు. ఇప్పుడు దినమున రాహు స్థితిని గూర్చి చెప్పెదను. రాహువు రవివారమునందు తూర్పునందును శనివారమునందు వాయవ్యమునందును, గురువారమున దక్షిణమునను, శుక్రవారమునందు ఆగ్నేయమునను, మంగళవారమునందు కూడ ఆగ్నేయమునను, బుధవారమున ఉత్తరమునందును ఉండును. ఫణిరాహువు ఈశాన్య, ఆగ్నేయ, నైరృతి, వాయవ్యములందు ఒక్కొక్క జాముండును. యుద్ధమునందు తనఎదుట నున్న శత్రువును ఆవేష్టించి చంపివేయును. ఇపుడు తిథి రాహువును గూర్చి చెప్పెదను. రాహువు పూర్ణిమనాడు ఆగ్నేము నందును, అమావాస్యనాడు వాయువ్యమునందును ఉండును. సంముఖ రాహువు శత్రునాశకరుడు. పశ్చిమమునుండి తూర్పునకు మూడు నిలువు గీతలు గీసి ఈ మూల రేఖలను భేదించుచు దక్షిణము నుండి ఉత్తరమునకు మూడు రేఖలు గీయవలెను. ఈ విధముగ ఒక్కొక్క దిశయందు మూడేసి రేఖలగును. సూర్యుడు ఏ రాశిపై ఉండునో దాని ఎదుట నున్న దిక్కున వ్రాసి క్రమముగా పండ్రెండు రాశులను ప్రదక్షిణ క్రమమున ఆ రేఖాగ్రములపై వ్రాయవలెను. పిదప ‘క’ నుండి ‘జ’ వరకు అక్షరములను ఎదుట నున్న దిక్కునందు వ్రాయవలెను. ‘ఝ’ నుండి ‘ద’ వరకు అక్షరములు దక్షిణమునను, ‘ధ’ నుండి ‘మ’ వరకు తూర్పునను, ‘య’ నుండి ‘హ’ వరకు ఉత్తరమునందును వ్రాయవలెను. వీటికి రాహుగణములని పేరు. శుక్ల పక్షమునందు వీటిని త్యజించవలెను. తిథి రాహుసమ్ముఖ దృష్టికూడ త్యజించవలెను. రాహుదృష్టి ఎదుట నున్నచో హాని కలుగును. అట్లు కానిచో విజయము కలుగును. ఇపుడు విష్టి రాహువును గూర్చి చెప్పెదను. ఈశాన్యము నుండి దక్షిణమునకు, దక్షిణమునుండి వాయువ్యమునకు, వాయువ్యమునుండి తూర్పునకును, అచటినుండి నైరృతివరకును, అచటినుండి ఉత్తరమునకు, అచటినుండి ఆగ్నేయమునకు, అచటినుండి పశ్చిమము వరకును, పశ్చిమమునుండి ఈశాన్యము వరకును ఎనిమిది రేఖలు గీయవలెను, ఈ రేఖలపై విష్టి (భద్ర)తో కూడ మహాబల వంతుడగు రాహువును గూర్చి విచారింతురు. కృష్ణపక్ష తృతీయాది తిథులలో విష్టిరాహువు ఈశాన్యము నందును, సప్తమ్యాదులందు దక్షిణమునందును ఉండును. ఈ విధముగ కృష్ణ-శుక్ల పక్షములందు వాయువ్యము నందు ఉన్న సంముఖరాహువు శత్రు వినాశనమును చేయును. విష్టిరాహు చక్రమున పూర్వాది దిక్కులందు ఇంద్రాద్యష్ట దిక్పాలకులను, మహా భైరవాద్యష్ట భైరవులనూ, బ్రహ్మణ్యాధ్యష్ట శక్తులను, సూర్యాదృష్ట గ్రహములను స్థాపించవలెను. పూర్వాది దిక్కులందు ఒక్కొక్క దానియందు బ్రహ్మణ్యాది అష్టశక్తుల ఎనిమిది అష్టకములను గూడ స్థాపించవలెను. దక్షిణాది దిక్కులందు వాత యోగినిని వ్రాయవలెను. రాహువు వాయువు వీచుచున్న వైపున వీరందరితో కలిసి ఉండి శత్రువినాశనము చేయును. ఇపుడు అవయవములను సుదృఢము చేయు ఉపాయమును చెప్పెదను. శరపుంఖిక అను ఓషధిని పుష్య నక్షత్రమునందు పెకలించి, చెప్పబోవు అపరాజితా మంత్రము జపించి, కంఠమునందుగాని, భుజము నందుగాని ధరించినచో శత్రుబాణములకు లక్ష్యము కాకుండ రక్షించును. ‘అపరాజితా’ ‘పాఠా’ అను ఓషధులనుకూడ ఈ విధముగనే ధరించినచో ఖడ్గ ప్రహారము నుండి తప్పించుకొనవచ్చును. ‘ఓం నమో భగవతి............ రక్ష రక్ష’ అను (మూలోకమైనది) అపరాజితా మంత్రము గ్రహ, జ్వర, భూతాదిబాధలు తొలగించు కొనుటకు ఈ మంత్రమును ప్రయోగించవలెను. (142)