అగ్ని మహా పురాణము

Table of Contents

పవిత్రాదివాసన విధి

అగ్నిదేవుడు చెప్పెను: సాంపాతాహుతిచేత పవిత్రలను తడిపి వాటి అధివాసము చేయవలెను. నృసింహ మంత్రమును జపించి, వాటిని అభిమంత్రించి, అస్త్రమంత్రముచే (అస్త్రాయ ఫట్) వాటిని సురక్షితములు చేయవలెను. పవిత్రలకు వస్త్రములు చుట్టి ఉండగనే పాత్రములో ఉంచి వాటిని అభిమంత్రించవలెను. బిల్వాది సంసృష్టమైన జలముతో, మంత్రోచ్చారణ పూర్వకముగ వాటిని ఒకటి రెండుసార్లు ప్రోక్షించవలెను. కుంభపాత్రము నందు పవిత్రలను ఉంచి, గురువు, వాటి రక్షణ నిమిత్తము, ఆ పాత్రను తూర్పున సంకర్షణ మంత్రముతో దంతచాష్ఠమును, ఉసిరికాయను, దక్షిణమున ప్రద్యుమ్న మంత్రముతో భస్మమును, తిలలను, పశ్చిమమున నారాయణ మంత్రముతో కుశోదకమును ఉంచవలెను. పిమ్మట ఆగ్నేయమునందు హృదయ మంత్రముతో కుంకుమమును, గోరోచనమును, ఈశాన్యదిక్కునందు శిరో మంత్రముతో ధూపమును, నైరృతి దిక్కునందు శిఖా మంత్రముతో దివ్యమూల పుష్పములను, వాయవ్యదిక్కునందు కవచమంత్రముతో చందన, జల, అక్షత, దధి, దూర్వలను దొన్నెలో ఉంచవలెను. మండపమును త్రిసూత్రముతో చుట్టి మరల అన్ని ప్రక్కల ఆవాలు చల్లవలెను.

ఏ క్రమమున దేవతల పూజ జరిగినదో ఆ క్రమముననే ఆ దేవతలకు, వారివారి మంత్రములను ఉచ్చరించుచు గంధపవిత్రములు అర్పింపవలెను. ఈ క్రమమునే పాటించుచు కుంభమున మహా విష్ణువును ఉద్దేశించి “ఓ దేవా! ఇది నీ తేజస్సు నుండియే పుట్టినది. సుందరమైనది. సర్వపాప వినాశకము. ఇది అన్ని మనోరథములను ఇచ్చునది. దీనిని నీకు సమర్పించుచున్నాను” అని పలుకుచు పవిత్రకమును సమర్పింపవలెను. ధూప దీపాదుల ద్వారా బాగుగా పూజచేసి మండప ద్వార సమీపమునకు వెళ్ళి, గంధ పుష్పాక్షతలతో గూడిన ఆ పవిత్రకమును తానుకూడ “ఇది విష్ణు తేజోరూపమైనది. మహా పాతకములను నశింపచేయునది. ధర్మార్థ కామముల సిద్ధికై దీనిని ధరించుచున్నాను” అని చెప్పుచు ధరింపవలెను. ఆసనముపై శ్రీహరి పరివారమునకును గురువునకును పవిత్రమును ఈయవలెను. గంధపుష్పాక్షతాదులచే శ్రీహరిని పూజించి, గంధపుష్పాదులతో పూజించిన పవిత్రమును శ్రీహరికి సమర్పింపవలెను. ఆ సమయమున “విష్ణుతేజో భవమ్” ఇత్యాది మూలమంత్రమును పఠించవలెను. పిమ్మట అగ్న్యధిష్ఠాతగానున్న మహా విష్ణువునకు పవిత్రకము సమర్పించి ఇట్లు ప్రార్థింపవలెను.

కేశవా! నీవు, క్షీరసాగరమున శేషశయ్యపై శయనించి ఉన్నావు, నేను ప్రాతః కాలమున నీ పూజచేసెదను. నీవు ఇచట ఉపస్థితుడవు కమ్ము! పిమ్మట ఇంద్రాది దిక్పాలకులను, శ్రీ విష్ణు పార్షదులకును బలి సమర్పింపవలెను. పిమ్మట రోచనా, కర్పూర, కేసర, గంధాదులచే అలంకృతమై రెండు వస్త్రములు ఉంచిన జలపూర్ణ కలశమునకు మూల మంత్రముతో పూజ చేయవలెను. మండపమునుండి బైటకు వచ్చి, తూర్పున అలికిన మండలత్రయమునందు వరుసగ పంచగవ్యములను, చరువును, దంతకాష్ఠమును ఉంచవలెను. రాత్రి పురాణ శ్రవణ-స్తోత్ర పాఠాదులతో జాగరణము చేయవలెను. పరులకు భృత్యులుగా ఉండువారు, బాలులు, స్త్రీలు, భోగిజనులు మొదలగు వారి గంధ పవిత్రములు తప్ప మిగిలిన వాటికి అప్పుడే అధివాసము చేయవలెను. (35)