అగ్ని మహా పురాణము

Table of Contents

అర్ఘ్యదాన శల్య కథనము

భగవంతుడైన హయగ్రీవుడు చెప్పెను: “ఓ బ్రహ్మదేవా! పూర్వము సమస్త ప్రాణులకును భయంకరమైన ఒక మహాభూతము ఉండెను. దానిని దేవతలు భూమిలో పాతిపెట్టిరి. దానికే వాస్తు పురుషుడని పేరు. అరువది నాలుగు పదముల క్షేత్రమునందు అర్ధకోణము నందున్న ఈశుని ఘృతాక్షతలచే తృప్తి పరుపవలెను. ఒక పదమునందు ఉన్న పర్జన్యుని కమల జలములచేతను, రెండు పదములలో ఉన్న జయంతుని పతాక చేతను, రెండు కోష్ఠములందు ఉన్న ఇంద్రుని కూడ అదే విధమునను, రెండు పదములలో ఉన్న సూర్యుని, ఎఱ్ఱని అన్ని పదార్థముల చేతను, రెండు పదములపై ఉన్న సత్యుని వితానము (చాందనీ) చేతను, ఒక పదమునందున్న భృశుని ఘృతము చేతను, అగ్ని కోణమునందలి అర్ధకోణమునందున్న ఆకాశమును శాకునమను ఓషధి జిగురుచేతను, ఆ కోణము నందే రెండవ అర్ధపదము నందున్న అగ్ని దేవుని స్రుక్కుచేతను, ఒక పదమునందున్న పూషుని లాజలచేతను, రెండు పదములపై ఉన్న వితథుని స్వర్ణము చేతను, ఒక పదముపై ఉన్న గృహక్షతుని వెన్నచేతను, ఒక పదముపై ఉన్న యమధర్మరాజును మాంసాన్నము చేతను, రెండు పదములపై ఉన్న గంధర్వుని గంధముచేతను, ఒక పదముపై ఉన్న భృంగుని శాకున జిహ్వఅను ఓషధిచేతను, అర్ధపదముపై ఉన్న మృగమును నీలిబట్ట చేతను, అర్థకోష్ఠము నిమ్న భాగమునందున్న పితృగణమును పులగముచేతను, ఒక పదముపై నున్న ద్వారపాలకుని దంతకాష్ఠముచేతను, రెండు పదములపై ఉన్న సుగ్రీవుని యవలతో చేసిన పదార్థముచేతను తృప్తిపరుపవలెను.

రెండు పదములపై ఉన్న పుష్పదంతుని కుశతృణముల చేతను, రెండు పదములపై ఉన్న వరుణుని పద్మములచేతను, రెండు పదములపై ఉన్న అసురుని సురచేతను, ఒక పదముపై ఉన్న ఆదిశేషుని నేయి కలిపిన జలముచేతను, అర్ధ పదముపై ఉన్న పాపమును యవాన్నముచేతను, అర్ధపదముపై ఉన్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగ పుష్పముచేతను, రెండు పదములపై ఉన్న ముఖ్యుని భక్ష్య పదార్థముల చేతను, ఒక పదముపై ఉన్న భల్లాటుని పెసల అన్నముచేతను, ఒక పదముపై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసము చేతను, రెండు పదములపై ఉన్న ఋషిని శాలూకము చేతను, ఒక పదముపై ఉన్న అదితిని లోపికచేతను, అర్ధపదముపై నున్న దితిని పూరీల చేతను తృప్తి పరుపవలెను. ఈశాన్య దిశయందున్న ఈశునికి క్రింద అర్ధపదముపై నున్న ఆవుని పాలచేతను, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను. తూర్పున నాలుగు కోష్ఠములపై ఉన్న మరీచిని లడ్డూలచే తృప్తి పరుపవలెను. బ్రహ్మకు పైనున్న కోణమందు అర్ధ పదముపై ఉన్న సావిత్రునకు రక్త పుష్పములు నివేదించవలెను. దాని క్రిందనున్న అర్ధకోణమునందున్న సవితకు కుశోదకములు ఈయవలెను. నాలుగు పదములపై ఉన్న వివస్వంతునకు రక్త చందనమును, నైరృతి దిక్కున ఉన్న కోణమునందలి అర్ధకోష్ఠము నందు ఉన్న సురాధిపతియైన ఇంద్రునకు పసుపు నీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్ఠమునందున్న ఇంద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదము నందలి మిత్రునకు గుణయుక్తమగు పాయసము సమర్పింపవలెను. వాయవ్య కోణమున అర్ధకోష్ఠముపై ఉన్న రుద్రునకు పక్వ మాంసమును ఇవ్వవలెను. దాని క్రింద అర్ధకోష్ఠమునందున్న యక్షునకు (రుద్రదాసునకు (ద్రాక్ష మొదలగు) అర్ద్ర ఫలములు ఇవ్వవలెను. చతుష్పదమునందున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో ఉన్న నాలుగు కోష్ఠములందును బ్రహ్మకొరకై తిలతండులములు ఉంచవలెను. చరకిని మాంసఘృతముల చేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారిని రక్తకమలములచేతను, కందర్పుని ఒక పలము అన్నము చేతను, పూతనను ఫల పిత్తములచేతను, జంభకుని మాంసరక్తములచేతను, పాపరక్షసుని పిత్త, రక్త, అస్థులచేతను, పిలిపిత్సుని మాలికల చేతను, రక్తము చేతను తృప్తిపరుపవలెను. పిదప ఈశానాది దిక్పాలకులకు రక్త మాంసమును సమర్పింపవలెను. ఆయా వస్తువులు లభింపనపుడు అక్షతలు సమర్పింపవలెను. రాక్షస, మాతృకా, గణ, పిశాచ, పితృ, క్షేత్రపాలాదులకు కూడ ఇచ్ఛాను సారముగా బలిప్రదానము చేయవలెను.

వాస్తు, హోమ, బలిప్రదానాదులచే ఈ దేవతలకు తృప్తి కలిగించకుండ ప్రాసాదాది నిర్మాణము చేయరాదు. బ్రహ్మస్థానమున శ్రీహరి, లక్ష్మీ, గణదేవతలను పూజింపవలెను. పిమ్మట భూమిని, వాస్తుపురుషుని, వర్ధనీ (మూకుడు) యుక్త కలశములను పూజింపవలెను. కలశ మధ్యమున బ్రహ్మను దిక్పాలకులను పూజింపవలెను. స్వస్తి వాచనముచేసి, ప్రణమించి, పూర్ణాహుతి చేయవలెను. ఓ బ్రహ్మదేవా! పిమ్మట గృహస్వామి రంధ్రములుగల ఒక జలపాత్ర హస్తమున ధరించి విధి పూర్వకముగా దక్షిణావర్త మండలములు చేయుచు సూత్రమార్గమున జలధారను త్రిప్పవలెను. పిమ్మట వెనుకటివలె అదే మార్గమున ఏడు బీజములు నాటవలెను. అదే మార్గమున గొయ్యి త్రవ్వుట ప్రారంభింపవలెను. పిమ్మట మధ్యయందు ఒక హస్తము వెడల్పు, నాలుగు అంగుళములు లోతుగల గొయ్యి త్రవ్వవలెను. దానిని అలికి పూజాప్రారంభము చేయవలెను. అన్నింటి కంటెను ముందుగ నాలుగు భుజములు ధరించిన శ్రీ మహావిష్ణువును ధ్యానించి కలశతో అర్ఘ్య ప్రదానము చేయవలెను, పిదప జారీతో నీళ్లు పోసి ఆ గొయ్యి నింపి దానిలో తెల్లని పుష్పములు వేయవలెను. శ్రేష్ఠమైన ఆ దక్షిణావర్త గర్తమును విత్తనములతోడను, మట్టితోడను నింపవలెను. ఈ విధముగ అర్ఘ్య ప్రదాన కార్యము ముగించి, ఆచార్యునకు గోవస్త్రాది దానములు ఈయవలెను. జ్యోతిష్కుని, స్థపతినిగూడ యథోచితముగ సత్కరించి విష్ణుభక్తులను, సూర్యుని పూజింపవలెను. పిమ్మట భూమిని ప్రయత్న పూర్వకముగ, నీరు వచ్చునంతవరకును తవ్వవలెను. మనిషిలోతు క్రింద శల్యములున్నను గృహమునకు దోషములేదు. శల్యములున్నచో ఇంటి గోడ విరిగిపోవును. గృహపతికి సుఖము ఉండదు. తవ్వుచున్నపుడు ఏ జంతువుపేరు వినబడునో ఆ జంతువు శల్యమే అక్కడ నుండునని తెలియవలెను. (40)