అగ్ని మహా పురాణము

Table of Contents

సూర్యాది ప్రతిమా లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: సూర్యుడు, ఏడు గుఱ్ఱములు కట్టిన, ఒకే చక్రముగల రథముపై రెండు పద్మములను హస్తములలో ధరించి ఉండును. ఆతని దక్షిణ పార్శ్వమున దండి సిరా బుడ్డి లేఖిని ధరించి యుండును. వామ పార్శ్వమున పింగళుడు దండమును ధరించి ద్వారము నందు ఉండును. వీరిరువురును సూర్యుని పార్షదులు. పార్శ్వములందు ఇద్దరు స్త్రీలు వాలవ్యజనమున ధరించి ఉందురు. రాణియైన (భార్యయైన) ఛాయాదేవి ప్రక్కనుండును. లేదా అశ్వముపైన కూర్చున్న ఒక్క సూర్యుని ప్రతిమ మాత్రమే కన్పించవలెను. సమస్త దిక్పాలకులును వరద ముద్రతో, రెండేసి పద్మములు ధరించి, సాయుధులై దిక్కుల వరుసలో నుందురు.

పండ్రెండు దళముల కమలమును నిర్మింపవలెను. సూర్యుడు, అర్యమ మొదలగు ద్వాదశ సూర్యులను ఆ ద్వాదశ దళములపై స్థాపింపవలెను. ఈ స్థాపనము పశ్చిమ వాయవ్య దిక్కులతో ప్రారంభించి నైరృతి దిక్కువరకును ఉన్న దళములపై చేయవలెను. ఈ ఆదిత్య గణమునకు నాలుగేసి చేతులు, చేతులలో ముద్గర, శూల, చక్ర, కమలములు ఉండును. ఆగ్నేయమునుండి నైరృతివరకు, నైరృతినుండి వాయవ్యమువరకు, వాయవ్యము నుండి ఈశాన్యమువరకు, ఈశాన్యమునుండి ఆగ్నేయమువరకు ఉన్న దళములపై స్థాపింపవలెను.

వరుణుడు, సూర్యుడు, సహస్రాంశువు, ధాత, తపనుడు, సవిత, గభస్తికుడు, రవి, పర్జన్యుడు, త్వష్ట, మిత్రుడు, విష్ణువు అనువారు ద్వాదశాదిత్యులు. వీరు మేషాది ద్వాదశరాసులలో ఉందురు. వరుణాది ఆదిత్యులు క్రమముగ మార్గశీర్షము మొదలు (వృశ్చికము మొదలు) కార్తికమువరకు ఉన్న మాసములలో (తుల వరకు ఉన్న రాశులలో) ఉందురు. వీరి శరీరకాంతి క్రమముగ నలుపు, ఎరుపు, కొంచెము ఎరుపు, పసుపు, పాండువు, తెలుపు, కపిలము, పీతము, ఆకుపచ్చ, ధవళము, ధూమ్రము, నీలము రంగులలో నుండును. వీరి శక్తులు ద్వాదశదళ కమల కేసరాగ్రములందు ఉండును. వారి పేర్లు- ఇడ, సుషుమ్న, విశ్వార్చి, ఇందు, ప్రమర్దిని, ప్రహర్షిణి, మహాకాలి, కపిల, ప్రబోధిని, నీలాంబర, వనాంతస్థ (ఘనాంతస్థ), అమృతాఖ్య. ఈ శక్తుల శరీర కాంతి గూడ వరుణాదుల శరీర కాంతి వలెనే ఉండును. ఈ శక్తులను కేసరాగ్ర భాగములపై స్థాపింపవలెను. సూర్యుని తేజస్సు ప్రచండముగా, విస్తృతముగా ఉండును. ఈతనికి రెండు భుజములుండును. కమలమును, ఖడ్గమును ధరించియుండును.

చంద్రుడు చేతులలో కుండిక- జపమాలలను ధరించును. కుజునకు చేతులలో శక్తి, అక్షమాలయు, బుధునకు ధనస్సు, అక్షమాలయు, బృహస్పతికి కుండిక, అక్షమాల, శుక్రునకు కుండిక, అక్షమాల ఉండును, శని మువ్వలు కట్టిన సూత్రమును ధరించును. రాహువు అర్ధ చంద్రుని ధరించును. కేతువు చేతులలో ఖడ్గము, దీపము ఉండును. అనంతుడు, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, కులికుడు మొదలగు ప్రముఖ నాగ గణములన్నియు సూత్రమును ధరించును. వీరందరును పడగల ఆకారముగల ముఖములతో, గొప్ప తేజఃపుంజముతో ప్రకాశించుచుందురు. ఇంద్రుడు వజ్రము ధరించి గజముపై ఎక్కియుండును. అగ్ని శక్తి హస్తుడై మేక మీద కూర్చుండును. యముడు దండము ధరించి మహిషాధిరూఢుడై ఉండును. ఖడ్గధారియైన నిరృతికి వాహనము మనిషి. వరుణుడు పాశహస్తుడై మకరముపై ఉండును. వజ్రధారియైన వాయు దేవునకు వాహనము లేడి. కుబేరుడు గద ధరించి గొఱ్ఱెపై ఉండును. జటాధారియైన ఈ శానునకు వాహనము వృషభము.

లోకపాలులందరును ద్విభుజులు. విశ్వకర్మ చేతిలో అక్షసూత్రముండును. హనుమంతుని హస్తమునందు వజ్రాయుధము ఉండును. రెండు పాదములతో ఒక అసురుని అణగ ద్రొక్కినిలబడును. కిన్నరులు వీణాధారులు, విద్యాధరులు మాలాధారులై ఆకాశమున విహరించుచుందురు. పిశాచముల శరీరములు అస్థిపంజరమాత్ర శేషములుగ ఉండును. భేతాళముల ముఖములు భయంకరముగ ఉండును. క్షేత్రపాలులు శూలములు ధరించి యుందురు. ప్రేతముల ఉదరములు పెద్దవిగ ఉండును. శరీరములు కృశించి యుండును. (51)