అగ్ని మహా పురాణము

Table of Contents

అనుజీవి వృత్త కథనము

పుష్కరుడు పలికెను:

శిష్యుడు గుర్వాజ్ఞను పాలించినట్లును, పతివ్రత భర్త ఆజ్ఞ పాలించినట్లును భృత్యుడు రాజాజ్ఞను పాలించవలెను. రాజు మాటలను ఎన్నడును వ్యతిరేకించక సర్వదా అతనికి అనుకూలమగు మాటలు చెప్పవలెను. ఏదైన రాజునకు హితకరము-కాని అతనికి అప్రియము అయిన విషయము చెప్పవలసి వచ్చినపుడు అతనికి రహస్యముగా చెప్పవలెను. ధనాదాయమునకు సంబంధించిన కార్యమునందు నియుక్తుడైనవాడు రాజధనమును అపహరింపకూడదు. రాజ సన్మానమును ఉపేక్షింపగూడదు. రాజును మాటలలోగాని, చేష్టలలోగాని, వేషభూషణాదులలో గాని అనుకరింపరాదు. అంతఃపుర సేనాధ్యక్షుడు రాజుతో వైరము కలవారితో కాని, అనుమాన పూర్వకముగా రాజాస్థానము నుండి వెడల గొట్టబడిన వారితోగాని కలిసిమెలసి ఉండరాదు. రాజరహస్యములను భృత్యుడు ఎన్నడును ఇతరులకు చెప్పరాదు. తనకున్న ఏదో ఒక నేర్పును చూపి రాజును సంతుష్టుని చేయవలెను. రాజు తనకేదైన రహస్య విషయము చెప్పినచో అది ఇతరులకు చెప్పరాదు. రాజు మరెవ్వరికైన పని చెప్పదలచుచున్నపుడు తానే లేచి-‘మహారాజా! ఏమి చేయవలెనో సెలవిమ్ము, నేను చేసెదను’ అని ముందుకు రావలెను. బహూకరించిన వస్త్రాలంకారాదులను సర్వదా ధరించుచుండవలెను. రాజాజ్ఞ లేనిదే ద్వారము నందుగాని, రాజు దృష్టి పడుటకు అవకాశముండు మరొక స్థానమునందు గాని కూర్చుండగూడదు. రాజు సమీపమున ఆవులింత, ఉమ్మివేయుట, దగ్గుట, కోపము ప్రకటించుట, మంచముపై కూర్చుండుట, కనుబొమ్మలు విరచుట, అపానవాయువు విడచుట, త్రేన్చుట మొదలగు పనులు చేయరాదు. రాజు సమక్షమున తన గుణములను ఇతరుల ద్వారా వర్ణింప చేయవలెను. శరత్వము (రహస్యముగా అపకారము చేయుట), దురాశ, చెవికొరుకుట, నాస్తికత్వము, నీచత్వము, చాపల్యము మొదలగు దోషములను రాజసేవకుడు సర్వదా పరిత్యజించవలెను. ప్రయత్న పూర్వకముగా వేదవిద్యా శిల్పకళాదులలో ముందుగా ప్రావీణ్యము సంపాదించుకొని, పిమ్మట ధనాభివృద్ధి కొరకై రాజసేవా నియుక్తి సంపాదించుకొనవలెను. రాజునకు ఇష్టుడైన వానికిని, అతని పుత్రులకును మంత్రులకును నమస్కరించు చుండవలెను. మంత్రులదగ్గర ఉన్నంత మాత్రముచే రాజునకు తనపై విశ్వాసము కలుగదు. అందుచే అతని మనస్సుకు అనుకూలములగు కార్యములు సర్వదా చేయుచుండవలెను. రాజు స్వభావమును బాగుగా గుర్తించి ఆతనికి తనపై సదభిప్రాయము లేనిచో అతనిని విడచి, తనను ఆదరించు మరొక రాజును ఆశ్రయించవలెను. అడగకుండ రాజుకు ఏమియు చెప్పరాదు. కాని ఆపత్సమయమునందు మాత్రము చెప్పవచ్చును. రాజు ప్రసన్నుడైనచో వినీతుడగు సేవకుని మాటవిని ఆతని ప్రార్థనను అంగీకరించును. ప్రేమ పాత్రుడైన సేవకు అంతఃపురాది రహస్య స్థానములందు కనబడినను రాజు ఆతని విషయమున శంకించడు. అతడు సభకు వచ్చినపుడు రాజు అతనిని కుశల ప్రశ్నలు వేసి ఆసనమిచ్చును. ఆతడు చేయు చర్చలువిని సంతోషించును. అతడేదైన అప్రియ వాక్యము పలికినను దానిని చెడ్డగా తీసుకొనక ప్రసన్నుడు కూడ అగును. అతడిచ్చిన చిన్న వస్తువును కూడ ఆదరముతో గ్రహించి, మాటలలో దానిని స్మరించుచుండును. ఈ లక్షణములను బట్టి రాజు తనపై విరక్తుడా అనురక్తుడా అను విషయమును గ్రహించి అనురక్తుడగు రాజును సేవించవలెను. విరక్తుడైన వానిని విడువవలెను. (221)