అగ్ని మహా పురాణము

Table of Contents

కుశాపామార్జన విధానము

అగ్నిదేవుడు చెప్పెను: ఓ మునీ! ఇపుడు నేను ఆత్మ రక్షణను, ఇతరుల రక్షణను చేయు విధానమును చెప్పుచున్నాను. దీనికి ‘మార్జనము’ లేదా ‘అపామార్జనము’ అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును. సచ్చిదానంద స్వరూపుడును, పరమార్థ భూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. కల్మష రహితుడును, పరమ శుద్ధుడును, నిత్యధ్యాన యోగ నిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి రక్షా విషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్యమగుగాక. భగవంతుడైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రక్షా విషయమును చెప్పెదను. నా వాక్యము సిద్ధించుగాక. భగవంతుడైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రక్షా విషయమును చెప్పుచున్నాను. అది సత్యమగుగాక.

ఓవరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీకేశా! నా సమస్త అశుభములను హరింపుము. ఎవ్వని చేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! అకుంఠిత శక్తిగల నీ చక్రావ్యాయుధములు నాలిగింటిచే సమస్త దుష్టుల సంహారము చేయుము. ఓప్రభూ! ఫలానావాని సంపూర్ణ పాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశల క్షేమమును ప్రసాదించుము. పాపముల వలన కలుగు మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.

ఇతరుల వినాశమును కోరువారు చేసిన అభిచారిక ప్రయోగములను, వారిచ్చిన విషమిశ్రాన్న పానములను, వారు కల్పించిన మహారోగములను జరాజీర్ణములుగ చేసి వాటిని అన్నింటిని నశింప చేయుము. ఓం భగవంతుడైన వాసుదేవునకు నమస్కారము. ఖడ్గధారియైన కృష్ణునకు నమస్కారము. కమల నేత్రుడును, ఆదిచక్రధారియు అగు కేశవునకు నమస్కారము. పద్మముల కింజల్కములవలె పసుపు రంగుగల నిర్మల వస్త్రములు ధరించిన భగవంతుడైన పీతాంబరునకు నమస్కారము. ఘోర సంగ్రామములలో శత్రువుల కంఠములతో రాచుకొను చక్రమును ధరించిన చక్రపాణికి నమస్కారము. కోరపై లేవదీయ బడిన భూమిని ధరించినవాడును, వేదవిగ్రహుడును, శేషశయ్యపై శయనించువాడును అగు మహాయజ్ఞ వరాహమూర్తికి నమస్కారము. ఓ! దివ్య సింహమూర్తీ! నీ కేశాంతములు కరిగించిన బంగారమువలె ప్రకాశించుచున్నవి. నేత్రములు అగ్నివలె ప్రజ్వలించుచున్నవి. నీ నఖముల స్పర్శ వజ్రస్పర్శ కంటె గూడ ఎక్కువ తీక్ష్ణమైనది. నీకు నమస్కారము. చాల చిన్నశరీరము కలిగి, ఋగ్యజుఃసామ వేదములచే అలంకృతుడవైన కాశ్యపకుమారా! వామనా! నమస్కారము. పిమ్మట విరాడ్రూపము ధరించి భూమిని ఆక్రమించిన త్రివిక్రమునకు నమస్కారము.

ఓ వరాహమూర్తీ! సమస్త పాప ఫల రూపమున వచ్చిన సకల దుష్ట రోగములను అణచి వేయుము; అణచివేయుము. గొప్ప కోరలుగల మహావరాహా! పాపమువలన కలిగిన ఫలమును అణచివేయుము, అణచివేయుము. వికటమైన ముఖముగల నీ దంతాగ్రములు అగ్నివలె ప్రకాశించుచున్నవి. ఓ ఆర్తివినాశనా! ఆక్రమణముచేయు దుష్టుల వైపు చూడుము, నీ గర్జనముచే వారి నందరిని నశింపచేయుము, నశింపచేయుము. ఓ! వామనమూర్తీ! ఋగ్యజుఃసామ వేదముల గూఢతత్త్వములతో నిండిన వాక్కుతో ఈ ఆర్తుని సకల దుఃఖమును శమింపచేయుము గోవిందా! త్రిదోషముల వలన కలిగినదియు, సన్నిచిపాతము వలన కలిగినదియు, ఆగంతుకమును అగు ఐకాహిక జ్వరమును (రోజువిడిచి రోజు వచ్చు జ్వరము), ద్వ్యాహిక జ్వరమును (రెండు రోజులకు వచ్చునది), త్ర్యాహిక జ్వరమును, అత్యంతము భయంకరమగు చాతుర్థిక జ్వరమును (నాలుగు రోజులకొకసారి వచ్చునది) మానకుండా వచ్చు జ్వరమును శీఘ్రముగ శమింపచేయుము. దానివలన కలుగు బాధలను తొలగింపుము.

నేత్ర రోగమును, శిరోరోగమును, ఉదరరోగమును, శ్వాసావరోధమును, అతిశ్వాసమును, పరితాపమును, కంపనమును, గుద రోగమును, నాసికా రోగమును, పాద రోగమును, కుష్ఠరోగములను, క్షయరోగమును, కామలాది రోగములను, అత్యంత దారుణమైన ప్రమేహమును, భగందర-అతిసారములను, ముఖ రోగమును, వల్గులీ రోగమును, అశ్మరీరోగమును, ఇతర మూత్రకృచ్ఛ్ర రోగములను, ఇతరములైన భయంకర రోగములను తొలగింపుము. వాత, పిత్త, కఫముల వలన కలిగిన రోగములును, సన్నిపాతము వలన కలిగిన రోగములును, ఆగంతుక రోగములును, లూతా-విస్ఫోటాది రోగములును భగవంతుడగు వాసుదేవుని నామ సంకీర్తన మాత్రముననే తొలగిపోవుగాక. ఆ రోగములన్నియు శ్రీమహావిష్ణునామ ఉచ్చారణ మాత్రముననే నశించిపోవుగాక. అవి అన్నియు శ్రీమహావిష్ణువు చక్రముచే కొట్టబడి తొలగిపోవుగాక. ‘అచ్యుత’, ‘అనంత’, ‘గోవింద’ అను నామములను ఉచ్చరించుట అనెడు ఔషధముచే సకల రోగములును నశించును. నేను చెప్పునది సత్యము: సత్యము.

స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, ఆకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగు వాటి నుండి పుట్టినది, ఇంకను ఇతర విధములైన దుఃఖకరమగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రము యొక్క కీర్తనము గ్రహ, ప్రేతగ్రహ, డాకినీ పూతనాది గ్రహ, వినాయకగ్రహ, ముఖ మండికా, క్రూరరేవతీ, వృద్ధరేవతీ, వృద్ధికా నామ కోగ్రగ్రహ, మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింపచేయు గాక! భగవంతుడ వైన నరసింహా! నీ దృష్టి ప్రసారముచే బాలగ్రహములు, యువ గ్రహములు వృద్ధ గ్రహములు దగ్ధములు అయి పోవుగాక! జూలుతో భయంకరమైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహా బలవంతుడును అగు భగవంతుడైన నృసింహుడు సమస్త బాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలా మాలలచే నీ ముఖ మండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్నిలోచనా! సర్వేశ్వరా! సమస్త గ్రహములను భక్షింపుము! భక్షించుము.

పరమాత్ముడైన జనార్దనుడు సర్వాత్మ స్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములున్నవో, ఏ మహోత్పాతములు ఉన్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రములు ఉన్నవో, క్రూర భూతములు ఉన్నవో, దారుణమైన గ్రహపీడలు ఉన్నవో వాటిని అన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవశ్రేష్ఠుడవైన అచ్యుతా! జ్వాలామాల లచే మిక్కిలి భయంకరమైన సుదర్శన చక్రమును ప్రయోగించి దుష్టరోగములను అన్నింటిని నశింపచేయుము. తీవ్ర జ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శన చక్రమా! సమస్త దుష్ట రాక్షసులను సంహరింపుము; సంహరింపుము. నీ ప్రభావముచే ఆ రాక్షసులందరును నశింతురుగాక. సర్వాత్మకుడగు నృసింహుడు, తన గర్జనముచే పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలందు రక్షించుగాక. అనేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక, భూలోక, అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. దేవాసుర మనుష్య సహితమగు ఈ జగత్తు అంతయు భగవంతుడగు విష్ణువు యొక్క స్వరూపమే. ఈ సత్యము యొక్క ప్రభావముచే ఈతని దుష్ట రోగములు అన్నియు నశించుగాక.

“విష్ణువును స్మరించగానే సర్వ పాపములును వెంటనే తొలగిపోవును” అను సత్యము యొక్క ప్రభావముచే వీని దుష్టరోగములు అన్నియు శాంతించుగాక. “యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు” అనెడు సత్యము యొక్క ప్రభావముచే నా మాటసత్యమగుగాక. శాంతి కలుగుగాక. మంగళమగుగాక. ఈతని దుష్ట రోగములు నశించుగాక. భగవంతుడైన వాసుదేవుని శరీరము నుండి పుట్టిన కుశలచే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి అపామార్జనము చేయుగాక. శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్ణ దుఃఖములు శమించుగాక. సమస్త రోగాదులను నివారించుటకు అపామార్జన స్తోత్రము ప్రశస్తమైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని. (31)