అగ్ని మహా పురాణము

Table of Contents

ఒక వారవ్రతములు

అగ్ని చెప్పెను:

ఇప్పుడు భుక్తి ముక్తి ప్రదములగు వారవ్రతములను చెప్పెదను. రవి వారము నాడు హస్తకాని పునర్వసు కాని వచ్చినప్పుడు పవిత్రమగు సర్వౌషది జలముతో స్నానముచేసి, శ్రాద్ధము చేయువాడు ఏడు జన్మల వరకును రోగములచే పీడింపబడడు. సంక్రాంతి దినమున భానువాసరము అయినచో అది పవిత్రమగు ఆదిత్యహృదయము అని చెప్పబడును. ఆ దినమునగాని, హస్త నక్షత్రయుక్త భానువారము (ఆదివారము) నందుగాని ఒక సంవత్సరము నక్త వ్రతము చేయువానికి సర్వము లభించును. ఏడు చిత్రా నక్షత్రయుక్త సోమవార వ్రతములు చేయువాడు సుఖవంతుడగును. స్వాతీ నక్షత్రయుక్త మంగళవార వ్రతము ప్రారంభించి, ఏడు మంగళవార నక్తవ్రతములు చేయువాడు అన్ని కష్టముల నుండియు విముక్తుడగును. విశాఖా నక్షత్రయుక్త బుధవారమునాడు ప్రారంభించి ఏడు బుధవార నక్త వ్రతము లాచరించువాడు బుధగ్రహపీడ నుండి విముక్తుడగును. అనురాధా నక్షత్ర యుక్త గురువారమునాడు ప్రారంభించి ఏడు గురువార నక్త వ్రతములు చేయువాడు బృహస్పతి గ్రహపీడనుండి విముక్తుడగును. జ్యేష్ఠా నక్షత్రయుక్త శుక్రవారమునాడు ప్రారంభించి ఏడు శుక్రవార నక్త వ్రతములు చేయువాడు శుక్ర గ్రహపీడనుండి విముక్తుడగును. మూల నక్షత్రయుక్త శనివారమునాడు ప్రారంభించి ఏడు శనివాసర నక్త వ్రతములు చేయువాడు శనిగ్రహపీడ నుండి విముక్తుడగును. (195)