అగ్ని మహా పురాణము

Table of Contents

భీష్మపంచక వ్రతము

అగ్ని దేవుడు చెప్పెను:

ఇపుడు సకల మనోరథములను తీర్చు వ్రతరాజమైన భీష్మపంచక వ్రతమును గూర్చి చెప్పెదను. కార్తిక శుక్లైకాదశినాడు ఈ వ్రతమును ప్రారంభించి, ఐదు దినముల పాటు మూడువేళల స్నానము చేయుచు తిలలతోను, యవలతోను దేవతలకును, పితరులకును ఐదు తర్పణములు ఈయవలెను. మౌనముతో శ్రీమహావిష్ణువును పూజించవలెను. పంచామృత-పంచగవ్యములతో స్నానము చేయించి, చందనాది సుగంధ ద్రవ్యములు అలది, ఘృతయుక్తమగు గుగ్గులు వెలిగించవలెను. ప్రాతఃకాలము నందును, రాత్రి యందును శ్రీమహావిష్ణువునకు దీపము చూపి, భోజ్య పదార్థములు నివేదనము చేయవలెను. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అను ద్వాదశాక్షరీ మంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. ద్వాదశాక్షర మంత్రమునకు చివర ‘స్వాహా’ చేర్చి ఘృతసిక్తములు అగు తిలలను, యవలను హోమము చేయవలెను. మొదటి దినమున భగవంతుని పాదములను కమలములతోను, రెండవ దినమున మోకాళ్లను, తొడలను బిల్వ పత్రములతోను, మూడవ దినమున నాభిని భృంగరాజముతోను, నాల్గవ దివసమున బాణపుష్ప, బిల్వపత్ర, జపాపుష్పముల తోను, ఐదవ దివసమున మాలతీ పుష్పములతోను సర్వాంగములను పూజించవలెను. వ్రతము నాచరించువాడు భూమిపై శయనించవలెను. ఏకాదశినాడు గోమయమును, ద్వాదశియందు గోమూత్రమును, త్రయోదశి యందు పెరుగును. చతుర్దశి యందు క్షీరమును, చివరి దినమునందు పంచగవ్యములను ఆహారముగ గ్రహించవలెను. పౌర్ణమాసియందు నక్తవ్రతము చేయవలెను. ఈ విధముగ వ్రతము చేసినవాడు భుక్తి ముక్తులను పొందును. భీష్ముడు ఈ వ్రతము ఆచరించుటచే శ్రీహరిని చేరెను. కావుననే దీనికి ‘భీష్మ పంచకము’ అను పేరు వచ్చినది. బ్రహ్మకూడ ఈ వ్రతము ఆచరించి శ్రీహరిని పూజించెను. అందుచే ఈ వ్రతము పంచోపవాసాదులతో కూడియున్నది. (205)