అగ్ని మహా పురాణము

Table of Contents

దుర్గసంపత్తి

పుష్కరుడు చెప్పెను:

ఇపుడు దుర్గమును గూర్చి చెప్పెదను. రాజు దుర్గమునందు నివసించవలెను. తనతో కూడ ఉండు వారిలో వైశ్య, శూద్రుల సంఖ్య అధికముగా ఉండవలెను. శత్రువులకు వశముకాని స్థలము నందు దుర్గము ఏర్పరచుకొనవలెను. దుర్గమునందు కొందరు బ్రాహ్మణులు కూడ ఉండవలెను. చాలమంది కార్మికులు ఎచట లభింతురో, ఎచట నీటి కొరకై వర్షాల మీద ఆధారపడవలసి ఉండదో, నదీ తటాకాదుల నుండి జలము సమృద్ధముగా లభించునో, ఎచట శత్రుపీడ ఉండదో, పుష్పఫలములు, ధనధాన్యములు ఎచట సమృద్ధముగా ఉండునో, శత్రుసేనలు ఎచటికి రాజాలవో, సర్పభయము, చోరభయము ఎచట ఉండదో అట్టి ప్రదేశములలో దుర్గమును నిర్మించుకొనవలెను. బలవంతుడైన వాడు, ధన్వ దుర్గము, మహీదుర్గము, నరదుర్గము, వృక్షదుర్గము, జలదుర్గము, పర్వత దుర్గము అని ఆరు విధములగు దుర్గములలో ఏదైన ఒక దానిని ఆశ్రయించి ఉండవలెను. ఈ దుర్గములలో పర్వత దుర్గము శ్రేష్ఠమైనది. ఇది శత్రువులకు అభేద్యమై శత్రువులను నశింపచేయ వీలగునదిగా ఉండును. దుర్గమే రాజధాని. దాని యందు రాజవీథులు, ఆపణములు, దేవాలయములు ఉండవలెను. నలుమూలల అస్త్రశస్త్ర భరితములగు యంత్రములు కలదై, జల ప్రవాహయుక్తమై, చుట్టును జలముతో నిండిన కందకములు గలదై ఉండు దుర్గము ఉత్తమము.

ఇపుడు రాజరక్షణను గూర్చి చెప్పెదను. రాజు రాజ్యమునంతను తను పాలించు వాడు గాన విషాదులచే ఆతనికి హాని కలుగకుండునట్లు రక్షించవలెను. శిరీష వృక్షము వ్రేళ్ళు, బెరడు, ఆకులు, పువ్వులు, పండ్లు ఈ ఐదింటిని గోమూత్రముతో నూరి సేవించినచో విషనివృత్తి కలుగును. శతావరి, గుడూచి, తండులీయకము కూడ విష నివారకములు. కోశాతకి, కహ్లారి, బ్రాహ్మి, చిత్ర పటోలిక, మండూక పర్ణి, వారాహీ కందము, అమలకము, ఆనందకము, భంగు, సోమరాజి-ఇవి కూడ విషనివారకములు. కొన్ని మాణిక్యములు, ముత్యములు మొదలగునవి కూడ విషనాశకములు.

రాజు వాస్తు లక్షణ లక్షితమైన దుర్గములో నివసించుచు దేవతా పూజనము, ప్రజాపాలనము, దుష్టశిక్షణము దానము చేయుచుండవలెను. దేవాది ధనమును అపహరించిన రాజు ఒక కల్పము వరకును నరకములోపడి ఉండును. రాజు దేవపూజా తత్పరుడై దేవాలయములను కట్టించవలెను. దేవతా స్థాపనచేసి దేవాలయ రక్ష చేయవలెను. దేవతా విగ్రహములను మట్టితో కూడ చేయవచ్చును. మట్టితో చేసిన విగ్రహము కంటె దారునిర్మితము, దాని కంటె ఇటుకలతో చేసినది, దాని కంటె శిలా నిర్మితము, దాని కంటె సువర్ణ నిర్మితము, దాని కంటె రత్నమయము పవిత్రమైనది. భక్తి పూర్వకముగ దేవాలయ నిర్మాణము చేయువాడు భుక్తిముక్తులను పొందును. దేవాలయములో చిత్రములు గీయించవలెను. గీత వాద్యాదులు ఏర్పరుపవలెను. అందమైన వస్తువులను దానము చేయవలెను. తైల, ఆజ్య, మధు, క్షీరాదులతో దేవతాభిషేకము చేయవలెను. ఇట్లు చేసిన వాడు స్వర్గమును పొందును. బ్రాహ్మణులను పాలించి వారికి సన్మానము చేయవలెను. వారి ధనమును లాగికొనరాదు.

బ్రాహ్మణుని ఒక బంగారు నాణెమునుగాని, గోవునుగాని, ఒక అంగుళము భూమి గాని అపహరించిన రాజు మహాప్రళయము వరకును నరకములో పడిఉండును. అనేక పాప కృత్యములు చేయుచు దురాచారవంతుడుగా ఉన్న బ్రాహ్మణుని కూడ ద్వేషింపరాదు. బ్రహ్మ హత్యను మించిన పాపములేదు. ప్రభావశాలియగు బ్రాహ్మణుడు తలచుకొన్నచో దేవతకాని వానిని దేవతగా చేయగలడు. దేవతను కూడ పదచ్యుతుని చేయగలడు. అందుచే సర్వదా ఆతనికి నమస్కారము చేయవలెను.

రాజు చేసిన అధర్మానికి బ్రాహ్మణ స్త్రీ ఏడ్వవలసి వచ్చినట్లయితే ఆతని రాజ్యము, వంశము, సర్వమును నశించును. అందుచే ధర్మ పరాయణుడగు రాజు పతివ్రతలకు మంచి రక్షణము కల్పించవలెను. స్త్రీ గృహకర్మలయందు నిపుణురాలై, సంతుష్టురాలై ఉండవలెను. ఆమె ఇంటిలోని అన్ని వస్తువులను పరిశుభ్రముగా ఉంచవలెను. ఖర్చు చేయుటలో సంయమవంతురాలై ఉండవలెను. తండ్రి కన్యకను ఎవనికిఇచ్చునో అతడే ఆమెకు పతి. ఆమె సర్వదా తన పతికి సేవచేయవలెను. భర్తృమరణానంతరము బ్రహ్మచర్యమును పాలించుకొను స్త్రీ స్వర్గమునకు వెళ్ళును. ఆమె ఇతరుల గృహములలో నివసించ గూడదు. కలహముల నుండి దూరముగా ఉండవలెను.

భర్త పరదేశమునందున్న స్త్రీ అలంకరించుకొనగూడదు. సర్వదా ఆతని హితమునే కోరుచు దేవతారాధనము చేయుచుండవలెను. కేవలము మంగళార్థమై సౌభాగ్య చిహ్నముగా రెండు మూడు అలంకారములను మాత్రమే ధరించవలెను. మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశముచేసిన స్త్రీకూడ స్వర్గము చేరును. లక్ష్మిని పూజించుట, ఇంటిని పరిశుభ్రముగా ఉంచుట స్త్రీకి కర్తవ్యము. కార్తిక ద్వాదశినాడు విష్ణువును పూజించి వత్స సహిత గోదానము చేయవలెను. సావిత్రి తన సదాచార వ్రతముల ప్రభావముచే తన భర్తను మృత్యువు నుండి రక్షించుకొనగల్గినది. మార్గశిర శుక్ల సప్తమినాడు సూర్యుని ఆరాధించుటచే స్త్రీ పుత్రులను పొందును. ఇందులో ఏ మాత్రము సందేహము లేదు. (222)