అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్నిపురాణం-అలంకార శాస్త్రం

నేడు మనకు లభ్యం అవుతున్న అలంకారశాస్త్ర గ్రంథాలలో అగ్నిపురాణం అతి ప్రాచీనమైనదనీ, తరువాత వచ్చిన గ్రంథాలన్నీ దీనినుండే విషయాలు గ్రహించి రచింపబడ్డాయనీ కొందరి అభిప్రాయం. కావ్య ప్రకాశ ఆదర్శంలో మహేశ్వరుడు-‘సుకుమారాన్ రాజకుమారాన్ స్వాదుకావ్య ప్రవృత్తిద్వారా గహనే శాస్త్రాన్తరే ప్రవర్త యితుమ్ అగ్ని పురాణాదు ద్ధృత్యకావ్య రసాస్వాద కారణమ్ అలంకార శాస్త్రం కారికాభిః సంక్షిప్య భరతమునిః ప్రణీతవాన్’ అని అన్నాడు. (సుకుమారమతులైన రాజకుమారులకు ముందుగా కావ్యాల విషయంలో అభిరుచి కలిగించి క్రమంగా దురవగాహమైన శాస్త్ర మధ్యంలో ప్రవేశింపచేయడం కోసం భరతముని అగ్నిపురాణం నుంచి గ్రహించిన కావ్య రసాస్వాద సాధనమైన అలంకారశాస్త్రాన్ని కారికలతో సంక్షిప్తం చేసి రచించాడు) అదే విధంగా విద్యాభూషణుని సాహిత్యకౌముదికి వాఖ్యానమైన కృష్ణానందినిలో కూడ- కావ్యరసాస్వాద నాయవహ్నిపురాణాది దృష్టాం సాహిత్య ప్రక్రియాం భరతః సంక్షిప్తాభిః కారికాభిః నిబబన్ధ (‘భరతుడు కావ్యరసాన్ని ఆస్వాదించడం కోసమై వహ్నిపురాణాదులలో ఉన్న సాహిత్య ప్రక్రియను సంక్షిప్తములైన కారికలతో రచించాడు’’ అని చెప్పబడింది.

అగ్నిపురాణంలో ఉన్న 336-346 అధ్యాయాలలో అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాల చర్చ ఉన్నది. ఈ అధ్యాయాలలోని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. 336వ అధ్యాయం కావ్యలక్షణం. సంస్కృత కావ్యాలు ప్రాకృత కావ్యాలు అని కావ్యాలు రెండు విధాలు. వీటిలోగూడ గద్యం, పద్యం, మిశ్రం అని మూడేసి విధాలు. కథ, ఆఖ్యాయిక, మహాకావ్యం అనే కావ్యభేదాలు విశదీకరించబడ్డాయి. 337వ అధ్యాయంలో పన్నెండు విధాలైన రూపకాలు, ఉపరూపకాలు, ప్రస్తావన, ఐదు అర్థ ప్రకృతులు, ఐదు సంధులు మొదలైన రూపకాలకు సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. 338వ అధ్యాయంలో రసాలు, స్థాయిభావాలు, అనుభావాలు, వ్యభిచారిభావాలు, ఆలంబన ఉద్దీపన విభావాలు, వివిధ నాయకులు వాళ్ల సహాయులు, నాయికాభేదాలు, నాయకుల ఎనిమిది లక్షణాలు, నాయికల పన్నెండు విభావాలు ప్రతిపాదింపబడ్డాయి. 339వ అధ్యాయంలో పాఞ్చాలి, గౌడి, వైదర్భి, లాటి అనే నాలుగురీతులు, భారతీ, సాత్త్వతీ, కైశికీ, ఆరభటీ అనే నాలుగు వృత్తులు విశదీకరింపబడ్డాయి. 340వ అధ్యాయంలో నృత్యానికి సంబంధించి శిరస్సు, హస్తాలు, పాదాలు అనే ప్రధానాంగాల కదలికలు, కనుబొమ్మలు మొదలైన ఇతరాంగాల చలనమూ వర్ణించబడ్డాయి. సాత్వికం, వాచికం, ఆంగికం, ఆహార్యం అనే చతుర్విధాభినయాల స్వరూపం 341వ అధ్యాయంలో వర్ణించబడింది. 342వ అధ్యాయంలో-యమక-అనుప్రాసాదులైన పది శబ్దాలంకారాలు, పదహారు ప్రహేళికా భేదాలు, గోమూత్రిక, సర్వతోభద్రం మొదలైన బంధాలు ప్రతిపాదింపబడ్డాయి. ఉపమా, రూపక, సహోక్త్యాదులైన అర్థాలంకారాలు, వాటి అవాంతర భేదాలు లక్షణ ప్రతిపాదన పూర్వకంగా 343వ అధ్యాయంలో విశదీకరింప బడ్డాయి. 344వ అధ్యాయంలో శబ్దార్థాలంకారాలు ప్రతిపాదించ బడినట్లు చెప్పినా దానిలో ఆక్షేప-సమాసోక్తి-పర్యాయోక్యాద్య లంకారాలు కూడ చర్చించబడ్డాయి. 345వ అధ్యాయంలో కావ్య గుణాలు 346వ అధ్యాయంలో కావ్యదోషాలు చెప్పబడ్డాయి. ఈ పదకొండు అధ్యాయాలలోని మొత్తం శ్లోకాల సంఖ్య 362.

అగ్నిపురాణం కాలాన్ని గూర్చి, ప్రధానంగా అలంకార శాస్త్రానికి సంబంధించిన అధ్యాయాల కాలాన్ని గూర్చి తెలుసుకొనవలసి ఉన్నది.

(అ) అగ్నిపురాణంలో ఏడు కాండలున్న రామాయణం, హరివంశం, పింగళ, పాలకాప్య, శాలిహోత్ర, ధన్వంతరి, సుశ్రుతుల నామధేయాలు పేర్కొనబడ్డాయి. 380వ అధ్యాయంలోని 58 శ్లోకాలలో భగవద్గీతలోని విషయం సంగ్రహించబడింది. పాణినీ యాష్టాధ్యాయిలోని అనేక విషయాలు కూడ ఈ పురాణంలో ఉన్నాయి.

అగ్ని పురాణంలోని 359-366 అధ్యాయాలు నిఘంటు రూపంలో ఉన్నాయి. ఈ భాగంలో అమరసింహుని నామలింగాను శాసనం చాలవరకు యథాతథంగా గ్రహించబడింది. గీత, నామలింగాను శాసనం మొదలైన గ్రంథాలే అగ్నిపురాణంలోనుండి విషయం గ్రహించి ఉంటాయి అనడానికి వీలులేదు. వాఙ్మయంలోని వివిధ శాఖలకు సంబంధించిన విషయాలను ఒక్కచోట చేర్చి జిజ్ఞాసువులకందజేయాలనే అభిప్రాయంతో ఈ పురాణంలో అమర కోశాదుల నుండి విషయాలు సంగ్రహించబడ్డాయి అని అనడమే యుక్తంగా ఉంటుంది. అమరసింహుడు క్రీ.శ. నాల్గవ శతాబ్దంలో ఉండేవాడని చాలమంది పండితుల అభిప్రాయం. అగ్నిపురాణం అమరకోశం నుండి విషయం సంగ్రహించింది అని అంగీకరించే పక్షంలో ఈ పురాణం ఆరు-ఏడుశతాబ్దాలకు పూర్వం ఉండడాని కవకాశం లేదు.

(ఆ) ‘భరతుడు ప్రచారంలోనికి తీసికొని రావడంచేత భారతీరీతికి ఆ పేరు వచ్చినది అని అగ్నిపురాణం చెపుతున్నది. ‘భరతేన ప్రణీతత్వాద్భారతీ రీతిరుచ్యతే’ (అ.పు. 339.6), బ్రహ్మయొక్క ఆజ్ఞ ప్రకారం తాను నాలుగు వృత్తులను ప్రచారంలోనికి తీసికొని వచ్చినట్లూ, భరతులనే నామాంతరంగలనటులు ప్రయోగించడంచేత ‘భారతీ వృత్తి’కి ఆ పేరు వచ్చినదనీ భరతుడు అన్నాడు. దీనిని పట్టి అగ్ని పురాణకారుడు భరతనాట్య శాస్త్రం, కనీసం నాట్యశాస్త్రంలోని వృత్తులను ప్రతి పాదించే భాగం చూచి ఉంటాడని చెప్పడానికి అవకాశం ఉన్నది.

(ఇ) అగ్నిపురాణంలో నాట్యశాస్త్రం నుండి యథాతథంగా గ్రహించిన అనేక శ్లోకాలున్నాయి. చూ.నా. శా. 6.36 అ.పు. -338,12; నా.శా.6.39, అ.పు. 348, 7-9; నా, శా, 22, 28-29; అ.పు. 337, 11-12 నా.శా. 17, 63-65 అ.పు. 342. 15-17. ‘ఈ పురాణంలో సమస్త విద్యలూ చెప్పబడ్డాయి; అవతారాలు, గీత, రామాయణం, భారతం, హరివంశం, ఆగమాలు, ఆశౌచం, ప్రాయశ్చిత్తం, రాజధర్మాలు, వ్యవహారం, వ్రతాలు మొదలైన ఎన్నో విషయాలూ ఉన్నాయి’ అని అగ్ని పురాణంలోని చివరి అధ్యాయంలో చెప్పబడింది. దీనినిబట్టి ఇతర గ్రంథాలనుండి వలెనే నాట్యశాస్త్రం నుంచి కూడ అగ్నిపురాణంలోనికి విషయాలు గ్రహింపబడ్డాయని చెప్పాలి.

(ఈ) రూపకం, ఉత్ప్రేక్ష, విశేషోక్తి, విభావన, అపహ్నుతి, సమాధి అనే అలంకారాలకు కావ్యాదర్శంలో ఇచ్చిన లక్షణాలే అగ్నిపురాణంలో కూడా ఇవ్వబడ్డాయి. దానిలో ఉన్న అనేకవాక్యాలు, వాక్యాంశాలూకూడా ఈ పురాణంలో కనబడుతున్నాయి. ఉదాహరణకి-కావ్యాదర్శంలోని ‘పద్యం చతుష్పదీ తచ్చ వృత్తం జాతిరితి త్రిధా’ (1.11) అనేది అగ్నిపురాణంలో (336.21) ఉంది. కావ్యాదర్శంలోని ‘సా విద్యా నౌస్తితీర్ణూణాం గమ్భీరం కావ్య సాగరమ్’ అనేది అగ్నిపురాణంలో (336-23) ఉంది. ఇట్లే కావ్యాదర్శంలోని 1.15, 1.16 శ్లోకాలు అగ్ని పురాణంలో ఉన్నాయి, అందుచేత ఏడవ శతాబ్దానికి చెందిన దండి నుండియే అగ్ని పురాణం విషయాలు గ్రహించినది అని అంగీకరిస్తే ఇది ఏడవ శతాబ్దం తరువాతి రచనయే అని చెప్పాలి.

(ఉ) రూపక, ఆక్షేప, అప్రస్తుత ప్రశంసా, సమాసోక్తి, పర్యాయోక్తి అలంకారాలకు ప్రసిద్ధ అలంకారికుడు భామహుడు ఇచ్చిన లక్షణాలే అగ్ని పురాణంలో కనబడుతున్నాయి. (కా.అ.2.21,68; 3. 29.8; 2.79-అగ్నిపురాణం 343.22; 344.15; 344.16; 344.18; 344. 17) భామహుని కాలం 7వ శతాబ్దనాకి తరువాతనే ధ్వని కారికలలో ప్రతిపాదింపబడి ధ్వన్యాలోకంలో సవిస్తరంగా సమర్థించబడిన ధ్వని సిద్ధాంతం అగ్ని పురాణానికి పరిచితం అన్నట్లు కనబడుతుంది. ధ్వనిని పర్యాయోక్త, అపహ్నుతి, సమాసోక్తి, అప్రస్తుత ప్రశంసా, ఆక్షేపాలంకారాలలో ఏదో ఒకదానిలో అంతర్గతం చేయవచ్చునని అగ్నిపురాణంలో చెప్పబడింది.-‘స ఆక్షేపో ధ్వనిః స్యాచ్చ ధ్వనినా వ్యజ్యతే యతః’ (అ.పు. 344. 14). ‘ఏషామేకత మస్యైవ సమాఖ్యా ధ్వని రిత్యతః’ (అ.పు. 344. 18). దీనిని బట్టి అగ్నిపురాణానికి ధ్వని సిద్ధాంతం తెలిసినా అది దానిని అంగీకరించలేదని తెలుస్తూన్నది. దీనిని అంతనీ పట్టి అగ్నిపురాణంలో ఉన్న అలంకారాలకు సంబంధించిన భాగం ధ్వన్యాలోకం కంటె అర్వాచీనమే కాని, చాల అర్వాచీనం కాదని తెలుస్తున్నది. ధ్వన్యా లోకం తొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో రచింపబడింది.

ధ్వన్యాలోకంలో ఉన్న ‘అపారే కావ్య సంసారే’ ఇత్యాది శ్లోకమూ, ‘శృఙ్గారీ చేత్కవిః’ ఇత్యాది శ్లోకమూ అగ్ని పురాణంలో (338. 10, 11) కూడ ఉన్నాయి. శృంగారం ఒక్కటే రసం, అది ఆనందాహంకారాభిమానరసం అనే భోజుని రససిద్ధాంతం సంక్షిప్తంగా, సరస్వతీ కంఠాభరణంలోని ఐదవ అధ్యాయంలో మొదటి నాలుగు శ్లోకాలలో ప్రతిపాదించబడింది. ఈ సిద్ధాంతం అగ్నిపురాణంలో సంక్షిప్తంగా ప్రతిపాదింపబడింది.

‘అక్షరం పరమం బ్రహ్మ సనాతనమజం విభుమ్,

వేదాన్తేషు వదన్త్యేకం చైతన్యం జ్యోతిరీశ్వరమ్.

ఆనన్దః సహజస్తస్య వ్యజ్యతే స కదాచన,

వ్యక్తిస్సా తస్య చైతన్య చమత్కార రసాహ్వయా

ఆద్యస్తస్య వికారో యః సోఽ హంకార ఇతి స్మృతః,

తతోఽ భిమానస్తత్రేదం సమాప్తం భువనత్రయమ్.

అభిమానాద్రతిః సాచ పరిపోష ముపేయుషీ,

వ్యభిచార్యాది సామాన్యాచ్ఛృఙ్గార ఇతి గీయతే.

తద్భేదాః కామమితరే హాస్యాద్యా అప్యనే కశః (అ.పు. 338. 1-5)

ఈ శ్లోకాల తరువాత ఏడు, ఎనిమిది, తొమ్మిది శ్లోకాలలో రసానికి సంబంధించిన ఇతర మతాలను స్పృశిస్తూ భరతుడు చెప్పిన ఎనిమిది లేదా తొమ్మిది రసాలను అగ్నిపురాణంలో పేర్కొనడం జరిగింది. భోజుని శృంగారప్రకాశంనుంచి అగ్నిపురాణం విషయం గ్రహించినదని చెప్పడమే అగ్ని పురాణంలో పాంచాలీ, వైదర్భి, గౌడి, లాటి, అనే నాలుగు రీతులు ప్రతిపాదింప బడ్డాయి (338. 54; 339. 1-4). వీటి స్వరూపం శృంగార ప్రకాశలో భోజుడు చెప్పిన రీతులను అనుసరించి ఉంది. అందుచేత అనేక శాస్త్రాలలో చెప్పిన విషయాలను ఒకచోట క్రోడీకరించి ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైన అగ్నిపురాణమే శృంగార ప్రకాశ నుండి విషయాలు సేకరించినదని చెప్పడమేయుక్తం. అలంకారశాస్త్రానికి సంబంధించిన విషయాలే కాకుండా ఇంకా ఎన్నో ఇతర శాస్త్రీయ విషయాలు అగ్నిపురాణం ఇతర గ్రంథాల నుండి గ్రహించింది. అగ్నిపురాణంలోని 252-257 అధ్యాయాలలో నారదస్మృతినుండి గ్రహించిన 30 శ్లోకాలు, ఇతర అధ్యాయాలలో యాజ్ఞవల్క్య స్మృతి నుండి గ్రహించిన 280 శ్లోకాలు ఉన్నాయి.