అగ్ని మహా పురాణము

Table of Contents

షడంగాస్త్ర వర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను:

‘ఓం హ్రూం హంసః’ అను మంత్రముచే మృత్యురోగాదులు శమించును. ఈ మంత్రముతో ఒక లక్ష దూర్వాహోమములుచేసిన శాంతి పుష్టి లభించును. లేదా కేవల ప్రణవమునుగాని, మాయ బీజమును (హ్రీం) గాని జపించుటచే దివ్యాంతరిక్ష భౌమ ఉత్పాతములు శమించును. ఉత్పాత వృక్షముకూడ శమించును. ‘ఓం నమో భగవతి’ మొదలు స్వాహా’ వరకును వున్న మూలోక్త మంత్రమును లక్ష జపముచేసి దశాంశ హోమములు చేసినవాడు సర్వకర్మలను సాధించును. ఇంద్రాదులను కూడ వశము చేసుకొనును. మనుష్యుల విషయము చెప్పవలెనా. ఈ విద్య అంతర్ధాన కారిణీ మోహినీ జృంభణీ, శత్రుబుద్ధిని మోహింపచేయునది. ఈ కామధేను విద్య ఏడు విధములు. శత్రు చోరాదులను మోహింపచేయునది, ఈశ్వర పూజితము, సర్వ మహాభయములయందు స్మరింప తగునదియగు మంత్రరాజమును చెప్పెదను. లక్ష జపించి తిలహోమము చేసినచో మంత్రము సిద్ధించును. దీని ఉద్ధారములు వినుము. ‘ఓం హలే’ మొదలు ‘స్వాహా’ వరకును ఉన్న మూలోక్తమైనది మంత్రము. దుర్గ దుర్గము నుండి తరింపచేయును గాన ఆమెకాపేరు వచ్చినది. ఈమె మంగళ ప్రదురాలు. ‘ఓం, హ్రీం చండకపాలిని మొదలు ‘ఫట్ హ్రీం’ వరకును ఉన్న మూలోక్త మంత్రమును జపించి బియ్యము కడిగి వాటిని ఈ మంత్రముతో ముప్పది పర్యాయములు అభిమంత్రించి వాటిని దొంగలకు పంచిపెట్టినచో ఆ బియ్యము నమలగనే వారి తెల్లటి దంతము పడిపోవును. వారు చౌర్యపాప విముక్తులు అగుదురు. ‘ఓం జ్వలల్లోచన’ మొదలు ‘తే స్వాహా’ అను మూలోక్త మంత్రముతో క్షేత్ర పాలునకు బలియిచ్చి న్యాసము చేసినచో గ్రహము వశమగును. శత్రువులు నశింతురు. రణభూమి యందు శత్రువులు హతులగుదురు. విషబీజ న్యాసముచే మూడు విధములగు విషములను లేదా విఘ్నములను హరించవచ్చును. అగురు చందన, కుష్ఠ, కుంకుమ, నాగ, కేసర, నఖ దేవదారువులను సమప్రమాణమున గ్రహించి నూరి ధూపము వేయవలెను. దీనిలో తేనె కలిపి దాని సుగంధముతో శరీరమును వస్త్రాదులను భూషితము చేసినచో వివాదము, స్త్రీ మోహనము, శృంగారము, కలహము మొదలగు సమయములందు శుభఫలము లభించును. కన్యావరణ, భాగ్యోదయ సంబంధి కార్యములందుకూడ సాఫల్యము లభించును. మాయా మంత్రము (హ్రీం)చే అభిమంత్రించిన రోచన నాగకేసర కుంకుమ మన శ్శిలలతో తిలకము ధరించి ఎవనిని చూచినవాడు వశమగును. శతావరి చూర్ణమును పాలతో కలిపి త్రాగినచో పుత్రులు ఉత్పాదింప కలుగును. నాగకేసర చూర్ణమును నేతిలో కలిపి తిన్నను, పలాశ బీజములను నూరి త్రాగినను పుత్రోత్పాదకుడు అగును.

‘ఓం ఉత్తిష్ట’ మొదలు ‘స్వాహా’ వరకును ఉన్న మూలోక్తమగునది ఇరువది ఆరు అక్షరముల సిద్ధ విద్య. నదీ తీరమునందలి మట్టితో లక్ష్మీమూర్తిచేసి, తత్తువుల రసముతో మందారపత్రముపై ఇష్ట స్త్రీ నామమును వ్రాయవలెను. పిమ్మట మూత్రోత్సర్గము చేసి ఈ మంత్రమును జపించినచో అభీష్ట స్త్రీ వశమగును. ఓం జూం (‘క్షుం సః వషట్) ఇది మహామృత్యుంజయ మంత్రము. దీని జప హోమములు పుష్టి కార్యములు “ఓం హం సః హ్రూం హూం సః హ్రః సౌస్కైః’ ఈ అష్ట వర్ణమృత సంజీవని విద్య రణమునందు జయమును ఇచ్చును. ఈశానాది మంత్రములు కూడ ధర్మ కామాదిదాయకములు ‘ఈశానః మొదలు భవోద్భవాయ నమః’ అను వరకును మూలోక్తములు ఐదు ఈశానాది మంత్రములు. ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు పంచబ్రహ్మ యొక్క ఆరు అంగములను చెప్పెదను. ‘ఓం నమః’ పరమాత్మనే మొదలు ‘తేస్వాహా’ వరకును ఉన్న డెబ్బది ఏడు అక్షరముల హృదయ మంత్రము మనోరథములను ఇచ్చును. ‘ఓం శివ శివాయ నమః’ ఇది శిరో “ఓం శివ హృదయే జ్వాలినీ స్వాహా శిఖాయై వషట్” ఇది శిఖామంత్రము. “ఓం శివాత్మక” మొదలు ‘స్తంభయ హూం’ వరకును ఉన్నవి ఒక నూరు ఐదు అక్షరముల కవచ మంత్రము ‘ఓం ఓజసే’ అనునది నేత మంత్రము. ‘ఓం ప్రస్ఫుర’ మొదలు ‘హుం ఫట్’ వరకును ఉన్నది. అఘోరాస్త్ర మంత్రము. (323)