అగ్ని మహా పురాణము

Table of Contents

నానాధర్మ వర్ణనము

అగ్నిదేవుడు చెప్పెను:

సర్వ శక్తుడైన ఏ పరమాత్మ హృదయము నందు దీపమువలె ప్రకాశించుచున్నాడో ఆ పరమాత్మను అన్యవిషయముల సంబంధములేని మనో, బుద్ధి, స్మృతులతో ధ్యానించవలెను. అట్లు ధ్యానముచేయు బ్రాహ్మణునకే ఆవు నెయ్యి, పెరుగు, పాలు మొదలగు పదార్థములను శ్రాద్ధము నిమిత్తము దానము చేయవలెను. ప్రియంగు, మసూరము, వంకాయ, కొఱ్ఱలు మాత్రము వడ్డించగూడదు. పర్వసంధులందు రాహువు సూర్యుని గ్రహించునపుడు అది ‘హస్తిచ్ఛాయా యోగము’ . అపుడు చేసిన శ్రాద్ధకర్మయు, శుభకర్మలును అక్షయములు. చంద్రుడు మఘా-హస్త నక్షత్రములందు ఉన్నపుడు అది ‘వైవస్వతీ తిథి’. అది కూడ ‘హస్తిచ్ఛాయా యోగమే’. బలి వైశ్వదేవము చేయగా మిగిలిన అన్నము బలివైశ్వదేవ మండలమునందు ఉంచరాదు. అగ్ని లేనిచో దానిని బ్రాహ్మణుని కుడి చేతిలో హోమము చేయవలెను. వేదోక్తకర్మ చేయకపోవుటచే బ్రాహ్మణుడును, వ్యభిచారి పురుషునిచే స్త్రీయు దూషితులుకారు. బలాత్కారముచే భోగింపబడిన స్త్రీని, శత్రువులకు వశమైన స్త్రీని ఋతుకాల పర్యంతము పరిత్యజించవలెను. ఋతుదర్శనానంతరము ఆమె శుద్ధురాలగును. స్త్రీలు ముందుగ సోముడు, గంధర్వుడు, వహ్ని అను దేవతలచేత అనుభవింపబడుదురు. మనుష్యులు వీరిని తరువాత అనుభవింతురు. అందుచే వీరు ఎవని చేతను దూషింపబడరు. అసవర్ణుడైన వానిచే స్త్రీ యోనియందు గర్భము ఉంచబడినచో ఆ స్త్రీ గర్భములోపల ఉన్నంత వరకును అశుద్ధురాలు. ఆ గర్భము బైటకు వెడలిన తరువాత రజస్సుచే శుద్ధురాలగును.

ఆత్మకంటే భిన్నమైన రెండవ వస్తువును చూడనివాడే బ్రహ్మభూతుడైన, ఆత్మరతుడైన నిర్మలుడైన యోగి. ఆత్మ మనః సంయోగము యోగమని కొందరు అందురు. మనస్సును వృత్తి హీనముగ చేసి, క్షేత్రజ్ఞుడైన పరమాత్మునియందు ఏకముచేసి, బంధ విముక్తుడగును. ఇది ఉత్తమమైన యోగము. ఐదు ఇంద్రియములు అనెడు కుటుంబములతో గ్రామము ఏర్పడినది. అందు ఆరవదగు మనస్సు చాల శ్రేష్ఠమైనది. ఆ మనస్సు దేవాసుర మనుష్యులచేత గూడ జయింప శక్యము కానిది. బహిర్ముఖములగు అన్ని ఇంద్రియములను అంతర్ముఖములుగ చేసి, మనస్సునందు నిలుపవలెను. మనస్సును ఆత్మయందు నిలుపవలెను. సర్వభావశూన్యుడగు జీవుని బ్రహ్మయందు నిలుపవలెను. ఇదియే జ్ఞానము; ఇదియే ధ్యానము. ఇంక ఏమి చెప్పినను గ్రంథవిస్తరమే. సకలలోకుల దృష్టిలో ఏది లేదో అది (బ్రహ్మ) ఉన్నదని చెప్పి తద్భిన్నము నిషేధింపబడుచున్నది. ఈ విధముగా చెప్పిన విషయము ఇతరుని హృదయమునందు నిలువదు. బాలికకు, స్త్రీ సుఖము ఎట్లు అనుభవగోచరము కాదో అట్లే ఆ బ్రహ్మ తెలియశక్యముకాదు. పుట్టుకతో గ్రుడ్డివాడు ఘటమనగా ఏదో ఎట్లు తెలుసుకొనజాలడో అట్లే యోగి కానివాడు బ్రహ్మను తెలుసుకొనజాలడు. బ్రాహ్మణుడు సన్యసించుట చూచి-‘ఈతడు నా మండలమును భేదించుకొని పరబ్రహ్మను పొందును’ అని భాస్కరుడు చలించును. సన్యాసికి ఉపవాస వ్రతము, స్నానము, తీర్థము, ఫలము, తపస్సు, ద్విజ సంపాదనము ఇవన్నియు జ్ఞానికి జ్ఞానఫల రూపమున సంపన్నములు అగును. ఏకాక్షర (ఓంకార) రూపమైనది. ప్రాణాయామమే గొప్ప తపస్సు. సావిత్రి కంటె పరమపావనము మరొకటి లేదు. పాపకర్మలను నశింపచేయుటకు, ధ్యాన సదృశమైనది మరొకటి లేదు. శ్వపాచకుల ఇంటి భోజనము చేసినవాడు కూడ ధ్యానముచే శుద్ధుడగును. ఆత్మ ధ్యానము చేయువాడు, మనస్సు ధ్యానసాధనము కలవాడు ధ్యానింపదగినవాడు విష్ణువు. ఫలముకూడ విష్ణువే. శ్రాద్ధమునందు పంక్తిపావనుడైన యతి అక్షయ ఫలము నిచ్చును.

నైష్ఠిక ధర్మమును (సన్యాసాశ్రమమును) అధిరోహించి అచటి నుండి పతితుడైన ఆత్మ ఘాతుకుడైన బ్రాహ్మణునకు శుద్ధిని కలిగించు ప్రాయశ్చిత్తము లేదు. ఈ విధముగ ఆరూఢ పతితులైన సన్యసించినవారును, వారి భార్య యందు జనించిన సంతతియు, బిందులుడు అను చండాలురుగా జనింతురు. సంశయము లేదు. అట్టి సన్యాసి నూరువత్సరముల ఆయుర్దాయముగల గృధ్రముగా పుట్టి మరణించును. పిదప పండ్రెండు సంవత్సరముల ఆయువు గల శునకముగాను, పిదప పండ్రెండు సంవత్సరముల ఆయువుగల భాసపక్షిగాను, పది సంవత్సరములు సూకరముగాను, పిదప పుష్ప ఫలరహితమగు ముండ్ల చెట్టుగాను ఉండును. పిదప దావాగ్ని దగ్ధుడై తన సహచరులతో గూడ మోడగును. పిదప వేయి సంవత్సరములు చైతన్యరహితుడుగ పడియుండును. వర్ష సహస్రము నిండిన పిదప బ్రహ్మ రాక్షసుడగును. తారకమగు యోగము చేతగాని, కులమును నశింపచేయుట చేతగాని మోక్షమును పొందును. అందుచే యోగమునే సేవించవలెను. పాపవినాశకమగు ఏ ఇతర మంత్రమును సేవించినను ప్రయోజనము లేదు. (165)