అగ్ని మహా పురాణము

Table of Contents

ధర్మశాస్త్ర నిరూపణము

పుష్కరుడు చెప్పెను:

మనువు, విష్ణువు, యాజ్ఞవల్క్యుడు, హారీతుడు, అత్రి, యముడు, అంగిరసుడు, వసిష్ఠుడు, దక్షుడు, సంవర్తుడు, శాతాతపుడు, పరాశరుడు, ఆపస్తంబుడు, ఉశనస్సు, వ్యాసుడు, కాత్యాయనుడు, బృహస్పతి, గోతముడు, శంఖ లిఖితులు-వీరు చెప్పిన విధముగ భుక్తి ముక్తి ప్రదమగు ధర్మము ప్రవృత్తము. జ్ఞానపూర్వకమగు కర్మ నివృత్తము. వేదా భ్యాసము, తపస్సు, జ్ఞానము, ఇంద్రియ సంయమము, అహింస, పూజ్యుల సేవ ఇవి నిశ్శ్రేయసకరములు. వీటి అన్నింటి కంటెను ఆత్మ జ్ఞానము శ్రేష్ఠము. అది అన్ని విద్యలలో ఉత్తమము. దానివలన మోక్షము లభించును. తనను సర్వభూతములందును, సర్వభూతములను తనయందును చూచు ఆత్మజ్ఞానము కలవాడు స్వారాజ్యమును పొందును. ఆత్మ జ్ఞానము సమముగ నుండునట్లు చేసికొని, వేదాభ్యాసమునందు ప్రయత్నము కలవాడు కావలెను. ఇది ద్విజులందరికిని సామర్థ్యమును పెంపొందించునది. బ్రాహ్మణులకు విశేషముగ సామర్ధ్యవర్ధకము. వేదశాస్త్రార్థతత్త్వము తెలిసినవాడు ఏ ఆశ్రమము నందున్నను, ఈ లోకమునందే బ్రహ్మత్వమును పొంద సమర్థుడగును. శ్రావణ పూర్ణిమనాడు గాని, శ్రవణ నక్షత్ర యుక్తదినమునగాని, హస్త నక్షత్ర యుక్త శ్రావణశుక్ల పంచమినాడు గాని, తమ శాఖకు సంబంధించిన గృహ్య సూత్రము ప్రకారము నియమపూర్వకముగా వేదాధ్యయన ప్రారంభము చేయవలెను. పౌష్యమాసమున రోహిణీ నక్షత్రమునందు గాని, అష్టక తిథియందు గాని నగరము లేదా గ్రామము వెలుపల జలసమీపమున వేదాధ్యయనోత్సర్గము చేయవలెను.

శిష్యుడు, ఋత్విక్కు గురువులు, బంధువులు మరణించినపుడు మూడు దినములు అధ్యయనము మానివేయవలెను. ఉపాకర్మ-ఉత్సర్జన దినములు మొదలు మూడు దినములు అధ్యయనము చేయరాదు. తన వేదశాఖకు చెందిన వేదాధ్యేత మరణించినపుడు కూడ అట్లే. సంధ్యాకాలమునందు, ఉరుముచున్నపుడు, ఉత్పాతసూచకములగు ధ్వనులు వినబడినప్పుడు, భూకంపమునందు, ఉల్కానిపాతనము నందు, వేదాధ్యయన సమాప్తి చేసిన పిమ్మటను, ఆరణ్యకమును చదివిన పిమ్మటను ఒక రాత్రి అనధ్యయనము. పూర్ణిమ, చతుర్దశి, అష్టమి, రాహు గ్రహణము, ఋతు సంధులు, శ్రాద్ధాన్న భోజనము చేసినపుడు శ్రాద్ధదానము పట్టినపుడును ఒక దినము అనధ్యాయము. స్వాధ్యాయము చేయువారి మధ్య నుండి చెవులపిల్లి, కప్ప, ముంగిస, కుక్క, సర్పము, పిల్లి, పంది వెళ్ళినచో ఒక దినము అనధ్యయనము. ఇంద్ర ధ్వజమును దింపిన దినమునను, ఎత్తిన దినమునందును, అనధ్యయనము, కుక్క, నక్క గాడిద, గుడ్లగూబ వీటి అరుపులు వినబడినపుడు, సామ గానము వినబడినప్పుడును, బాణధ్వని, ఆరధ్వని వినబడినపుడును, అపవిత్ర వస్తువు, శవము, శూద్రుడు, అంత్యజుడు, శ్మశానము, పతితుడు మొదలగువారి సాన్నిధ్యము నందును, అశుభ తారలందును, మాటి మాటికి మెరపులు మెరయుచున్నప్పుడును, తాత్కాలిక అనధ్యాయము. భోజనానంతరము తడిచేతులతో అధ్యయనము చేయకూడదు. జలములోపల, అర్థరాత్రము నందును, దుమ్ము పడుచున్నపుడును, పెనుగాలులు వీచుచున్న పుడును, దిగ్దాహ సమయమునందును, సంధ్యలందును, మంచు వర్షించు చున్నపుడును, భయ సమయములందును అధ్యయనము చేయరాదు. పరుగెత్తుచు అధ్యయనము చేయరాదు. ఏదైన ప్రాణి బాధపడుచున్నపుడును, శిష్యులు ఇంటికి వచ్చినపుడును అధ్యయనము చేయరాదు. గాడిద, ఒంటె, రథము మొదలగు వాహనములు ఎక్కినపుడును, ఏనుగు, గుఱ్ఱము, నావ, వృక్షము మొదలైన వాటిని ఎక్కినప్పుడు, మరు భూమియందును, అధ్యయనము చేయరాదు. ఈ ముప్పదియైదును తాత్కాలిక అనధ్యయన కాలములు. (162)