అగ్ని మహా పురాణము

Table of Contents

శబ్దాలంకారములు-నిరూపణము

అగ్నిదేవుడు చెప్పెను:

పద వాక్యములందు వర్ణముల ఆవృత్తికి అనుప్రాస అని పేరు. ఏక వర్ణము అనేక వర్ణము అని వృత్త్యనుప్రాస వర్ణ సముదాయము రెండు విధములు. ఏక వర్ణగతా వృత్తి వలన మధుర లలిత ప్రౌఢ భద్ర పరుషలను ఐదు వృత్తులు ఏర్పడును. మధుర వృత్తి యందు వర్గ పంచమ వర్ణము క్రింద ఆ వర్గకే చెందిన అక్షరములు, హ్రస్వ స్వర అంతరితములగు ర, ణ, మ, న, లు నకార ద్వయ సంయోగము కూడ వుండును. వర్గ్య వర్ణములను ఐదు పర్యాయములు మించి ఆవృత్తి చేయరాదు. మహా ప్రాణ ఊష్మ వర్ణముల సంయోగముతో కూడ ఉత్తరోత్తర లఘ్వుక్షరములు కల రచన మధుర అని చెప్పబడును. లలిత రచనలో ‘వ’ కార ‘ల’ కారములు అధికముగా ప్రయోగింపబడును. రేఫ సంయుక్త ‘ప’ కార, ‘న’ కారములు వర్గ్య వర్ణములు దేనియందు ప్రయోగింపబడునో ‘ట’వర్గ పంచమాక్షరములు ఉండవో అది ప్రౌఢా వృత్తి. మిగిలిన అసంయుక్తములగు రేఫ ‘న’ కారాది కోమల వర్ణములు ప్రయోగించిన వృత్తి భద్ర లేదా కోమల వృత్తియని చెప్పబడును. ఊష్మలు భిన్న అక్షరములతో సంయుక్తములై ప్రయోగింపబడినచో పరుషావృత్తి. దీని యందు ‘అ’ కార భిన్నములగు స్వరములు అత్యధికముగా ఆవృత్తి చెందుచుండును. అనుస్వార విసర్గలు నిరంతరము ప్రయోగింపబడును. రేఫ సంయుక్త శ, ష, స, ల ప్రయోగము ఎక్కువగా అకార ప్రయోగము. అధికముగా అంతస్థ వర్ణ ప్రయోగము రేఫానంతస్థలచే భేదితము సంయుక్తముయగు ‘హ’ కార ప్రయోగము పదుషత్వమును కలిగించును. గురువర్ణములు మాధుర్య విరుద్ధములగు వర్ణములతో సంయుక్తములైనచో పరుషత్వము కలుగును. పరుష రచనలో వర్గాద్యక్షరమే సంయుక్తము. గురువు అయినచో శ్రేష్ఠము. పంచమ వర్ణము సంయుక్తమైనచో ప్రశస్తము కాదు. ఎవరినైన ఆక్షేపించుట యందును కఠోర శబ్దానుకరణమునందును పరుష వృత్తిని ప్రయోగించవలెను. క, చ, ట, త, ప వర్గలను అంతస్థ ఊష్మలను క్రమముగ ఆవర్తనము చేయుటచే ఏర్పడు వృత్తికి కర్నాటి, కౌంతలీ, కౌంకీ, కౌంకణీ, వాణ, వాసికా, ద్రావిడీ, మాథులీ, మాత్సీ, మాగధీ, తామ్రలిప్తికా, ఔండ్రీ, పౌండ్రీ అను పండ్రెండు భేదములు ఉండును.

భిన్నార్థ ప్రతిపాదకము అగు అనేక వర్ణావృత్తికి యమకమని పేరు. అవ్యపేతము, వ్యపేతము అని అది రెండు విధములు. నిరంతరావృత్తి ఉన్నది, అవ్యపేతము, వ్యవధానముతో ఆ వృత్తి ఉన్నది వ్యపేతము. స్థానపాద భేదములచే ఈ రెండింటికిని రెండేసి భేదములు ఏర్పడును. మొదటి పాదము యొక్క ఆది మధ్య అంతములందు ఒకటి రెండు మూడు వర్ణములు పర్యాయములు ఆవృత్తములు అయినచో మొత్తము ఏడు భేదములు ఏర్పడును. ఏడు పాదములలో ఉత్తరోత్తర పాదమును ఒకటి, రెండు, మూడు పాదములతో ప్రారంభించినచో అంతిమ పాదము ఆరు విధములగును, తృతీయ పాదమున ఆదిమధ్యాంతములందు ఆవృత్తి చేసినచో మూడు విధములగును, శ్రేష్ఠ యమకము, పాదాంత యమకము, కాంచీ యమకము, సముద్గయమకము, విక్రాంత యమకము, వక్రవాల యమకము, సందష్టము, పాదాది యమకము, ఆమ్రేడితము చతుర్వ్యవ సితము, మాలాయమకము అని పదిపది విధములు. వీటిలో కూడ అనేక భేదములు ఉండును. భిన్నార్థ వాచక పదమును ఆవృత్తి చేసినచో అది స్వతంత్రము అస్వతంత్రము అని రెండు విధములు. రెండు ఆవృత్త పదములకు సమాసమున్నచో సమస్తము సమాసము లేనిచే వ్యస్తము. ఒక పాదమున విగ్రహము ఉండుటచే అది వ్యస్తమగును. యథా సంభవముగ, వాక్యావృత్తి ఈ విధముగా జరుగును. అనుప్రాస యమకాదులు పండితులచే సమ్మానితములు. పదావృత్తియైనను వాక్యావృత్తియైనను ఏ వర్ణ సమూహము సమానముగ కన్పట్టునో దానిని మొదట వుంచి సాను ప్రాసపదరచన చేసినచో అది రసావహమై ఉండును. కవి గోష్టిలో కౌతూహల పూర్వకముగ చదువబడు వాగ్బంధము చిత్రము.

ప్రశ్నము ప్రహేళికా గుప్తము, చ్యుతాక్షరము, దత్తాక్షరము, చ్యుత దత్తాక్షరము, సమస్యయని ఏడు ప్రహేళికా భేదములు. సమానాంతర విన్యాసపూర్వకముగా ఉత్తరము ఇచ్చినచో అది ప్రశ్న ప్రహేళికా, ఏకపృష్ఠోత్తరము ద్విపృష్ఠోత్తరమని అది రెండు విధములు. సమస్తము వ్యస్తము అని మొదటిది రెండు విధములు. రెండు అర్థములను చెప్పు శబ్దములు గూఢముగ నున్న దానిని ప్రహేళిక యందురు. అర్థీశాబ్ది అని ఇది రెండు విధములు. అర్థబోధతో సంబంధించని ఆర్థి. శబ్ద బోధతో సంబంధించినది శాబ్ది. ఈ విధముగా ప్రహేళిక ఆరువిధములు. వాక్యాంగము గుప్తమైనను సంభావ్యమగు ఒక అపార మార్థిక అర్థము దేని అంగమునందు ఆకాంక్షాయుక్తమై ఉండునో అది గుప్తము. దీనికే గూఢమని కూడ పేరు. వాక్యాంగ వైకల్యముచే అర్థాంతర ప్రతీతి వికలితాంగమునందు సాకాంక్షముగ ఉన్నచో అది చ్యుతాక్షర. స్వర వ్యంజన, బిందు విసర్గలచ్యుతిని బట్టి ఇది నాలుగు విధములు. వాక్యాంగము యొక్క వికలాంశము పూర్తిచేసిన పిమ్మట కూడ ద్వితీయార్థ ప్రతీతి కల్గించునది దత్తాక్షర. స్వరాదులను బట్టి దీనికి కూడ నాలుగు భేదములుండును. లుప్తమగు వర్ణము స్థానమున మరియొక అక్షరము ఉంచినను అర్థాంతరాభాసము కల్గించునది చ్యుత దత్తాక్షర. ఒక పద్యాంశముతో నిర్మితమై మరియొక పద్యముతో సంబంధించినది సమస్య. సమస్య ఇతరుల దగును. దాని పూర్తి తనదగును. ఈ విధముగా స్వపర, కృతి సాంకర్యముచే సమస్య పూర్తియగును. చిత్రకావ్యము అతిక్లేశ సాధ్యము అగుటచే కవియొక్క కవితా శక్తిని సూచించును. అది రస విహీనమైనను విదగ్ధులకు మహోత్సవము. నియమ విదర్భబంధములను బట్టి ఇది మూడు విధములు. రమణీయ కవిత్వమును చెప్పు కవి యొక్క ప్రతిజ్ఞ నియమము. ఇది స్థానస్వర వ్యంజనములను బట్టి మూడు విధములు. ప్రాతిలోమ్యానులోమ్యములచే వికల్పన చేయబడును. ప్రాతిలోమ్యానులోమ్యములు శబ్దమును బట్టియు, అర్థమును బట్టియు ఏర్పడును. వివిధ వృత్తముల వర్ణములను ఆయావస్తువుల ఆకారమును కూర్చుటకు బంధమని పేరు. గోమూత్రికా, అర్థ భ్రమకము, సర్వతో భద్రము, కమలము, చక్రము, చక్రాబ్జకము, దండము, మురజము అని బంధములు ఎనిమిది విధములు. రెండు శ్లోకార్థములందును ప్రతిపాదమునందు ఏకైకాక్షర వ్యవధానముచే అక్షర సామ్యము వున్నచో అదిగోమూత్రికా బంధము. పూర్వ గోమూత్రికా ఆంత్య గోమూత్రికాయని ఇది రెండు విధములు. వీటికి అశ్వపద ధేనుజాల బంధయని కూడ పేరు. అర్ధ భాగములు రెండింటి యందును ఏకైకాక్షర వ్యవధానమున అక్షర సామ్యమున్నది మొదటిది. ఒక్కొక్క పదమునందు ఉన్నది రెండవది. వాటిని అర్ధభాగములందును, అర్ధ పాదమునందును విన్యాసము చేయవలెను.

క్రమముగా క్రింద క్రిందుగా వ్రాసిన వర్ణములతో క్రింద క్రింద వ్రాసిన వర్ణములతో కలుపగా చతుర్ధ పాదము పూర్తియగు వరకు నడిపించవలెను. చతుర్థ పాదము పూర్ణమై పిమ్మట అక్షరములను ప్రతితోమ క్రమమున పాదార్ధ పర్యంతము పైకి తీసుకుని పోవలెను. ఈ విధముగా మూడు విధములగు సర్వతోభద్రము ఏర్పడును. కమలబంధము చతుర్దళము, అష్టదళము షోడశదళము అని మూడు విధములు. ప్రథమ పాదము యొక్క పై మూడు పదముల అక్షరములను అన్ని పాదముల చివరను ఉంచవలెను. పూర్వపాద అంతిమ వర్ణమును ప్రత్యక్పాదాదియందు ప్రాతిలోమ్య క్రమమున ఉంచవలెను. అంతిమపాద అంతిమాక్షర ద్వయమును ప్రథమ పాదాదియందు ఉంచవలెను. ఈ విధముగా చతుర్దళ కమలము ఏర్పడును. అష్టదళ కమలము నందు అంత్యపాద అంత్యాక్షర త్రయమును ప్రథమ పాద ఆదియందు ఉంచవలెను. షోడశదళ కమలమున రెండు అక్షరముల మధ్యకర్ణిక దాని మధ్యయందు ఒక అక్షరము కర్ణిక అంతము పై భాగమున పత్రాకారాక్షర పంక్తి వ్రాసి దానిని కర్ణికలో చేర్చవలెను. ఈ విషయము చతుర్దళ కమలము విషయమున చెప్పబడినది. కర్ణిక అందు ఒక అక్షరము వ్రాసి దిగ్విదుక్కులందు రెండేసి అక్షరములు వ్రాసి ప్రత్యేక దిక్కుయందు ప్రవేశ నిర్గమ మార్గము వ్రాయవలెను. ఇది అష్టదళ కమలము విషయమున చెప్పబడినది. నాలుగు వైపుల ఎన్ని విషమ వర్ణములున్నవో యన్ని పత్రములు ఏర్పరచి న్యాసముచేసి మధ్య కర్ణికయందు సమాక్షరములను ఏకాక్షర రూపమున న్యాసము చేయవలెను. ఇది షోడశదళ కమలమునకు సంబంధించిన విషయము. చతరరము, షడరము అని చక్ర బంధము రెండు విధములు. చతురరము నందు పూర్వార్ధమున సమవర్ణమును ప్రతిపాదము యొక్క ప్రథమ పంచమాది విషమ వర్ణములను చతుర్థ అష్టమ వర్ణములను క్రమముగా ఉత్తర పూర్వ దక్షిణ, పశ్చిమార్థములందు ఉంచవలెను.

ఉత్తర పాదార్థ అక్షర చతుష్టయమును నాభియందును, దాని ఆద్యక్షరమును వెనుకటి రెండు అరములందును, మిగిలిన రెండు పదములను నేమియందును స్థాపించవలెను. తృతీయాక్షరమును చతుర్థ పాదాంతమునందును, ప్రథమ సమవర్ణ ద్వయమును, మూడు పాదముల అంతమునందును ఉంచవలెను. దశమాక్షరము సమమైనచో దానిని ప్రథమారమందును, ఆరు అక్షరములను పశ్చిమారమునందును ఉంచవలెను. వాటిని రెండేసి అక్షరముల వ్యవధానముతో ఉంచవలెను. ఇట్లు బృహచ్చక్రము ఏర్పడును. ఎదుటనున్న రెండు అరములపై క్రమముగా ఒక్కొక్క పాదమును వ్రాయవలెను. నాభి యందు దశమాక్షరమును వ్రాసి చతుర్ధ పాదమును నేమివద్దకు తీసుకుని వెళ్ళవలెను. శ్లోకము యొక్క ఆది అంత దశమాక్షరములను, ద్వితీయ చతుర్థ చరణముల ఆద్యంత్యాక్షరములను, ప్రథమ చతుర్థ చరణముల ప్రథమ, చతుర్థ, పంచమ వర్ణములును, సమములుగా ఉండవలెను. ద్వితీయ పాదమును విలోమ క్రమమున చదువగ, తృతీయ పాదము ఏర్పడినచో, దానిని పత్ర సాధనమున ఉంచగా దండచక్రాబ్జబంధము ఏర్పడును. పూర్వార్ధమున రెండు పాదముల ద్వితీయాక్షరములును ఉత్తరార్ధము రెండు పాదముల సప్తమాక్షరములును సమానములై ఉండవలెను. ద్వితీయాక్షరములను బట్టి పూర్వార్ధ ఉత్తరార్ధములు తుల్యములై ఉండవలెను. ద్వితీయ షష్ట చతుర్థ పంచమ అక్షరములు తుల్యములై ఉండవలెను. ఉత్తరార్ధమున సప్తమ ప్రథమ చతుర్థ పాదములు ఆ అక్షరములతో సమానములైన చతుర్థ పంచమ అక్షరములను క్రమముగా కూర్చవలెను. క్రమపాదములందున్న చతుర్థాక్షరములను, దళాంత వర్ణములను వెనుకటివలె స్థాపించవలెను. మురజ బంధమున రెండు శ్లోకార్థముల అంతిమ ఆద్యక్షరము సమానములై ఉండవలెను. పాదార్ధమునందు ఉన్న వర్ణములను ప్రాతిలోమ్యాను లోమ్య క్రమముతో వుంచి అంతిమాక్షరము చతుర్థపాద ఆద్యక్షరమగునట్లు కూర్చవలెను. చతుర్థ పాద ఆద్యక్షరమును దాని నుండి నవమ, షోడశాక్షరములను పుటకకము మధ్య మధ్య నుండి నాలుగేసి అక్షరములను కూర్చవలెను. ఈ విధముగా మురజ బంధము ఏర్పడును. ద్వితీయ చక్రము శార్దూల విక్రీడితముతో చేయవచ్చును. గోమూత్రికా బంధమును అన్ని ఛందస్సులలోను నిర్మించవచ్చును. మిగిలిన బంధములన్నియు అనుష్టుప్ ఛందస్సుచే నిర్మింపబడును. ఈ బంధములలో కవికావ్యముల నామధేయములు లేకున్నచో మిత్రులు సంతుష్టులగుదురు. శత్రువులు కూడ ఖిన్నులుకారు. బాణ, ధునుస్, వ్యోమ, ఖడ్గ, ముద్గర, శక్తి, ద్విశృంగాట, తిశృంగాట, చతుశృంగాట, వజ, ముసల, అంకుశ, రథపద, నాగపద, పుష్కరిణీ, అసి పుత్రికాది ఆకారములలో కూడ చిత్ర బంధములు వ్రాయబడును. వీటిని ఇంకను అధికమగు చిత్రబంధమును విద్వాంసుడు స్వబుద్ధిచే తెలుసు కొనవలెను. (343)