అగ్ని మహా పురాణము

Table of Contents

సంగ్రామ విజయ విద్య

పరమేశ్వరుడు పలికెను:

దేవీ! ఇపుడు సంగ్రామమునందు విజయము నిచ్చు విద్యను (మంత్రమును) చెప్పెదను. పదమాలా రూపమున నున్నది. ‘ఓం చాముణ్డే...........విచ్చే హుం ఫట్ స్వాహా’ అను (మూలోక) మంత్రము ‘జయా’ అను పేరుగల పదమాల. అన్ని కార్యములందు సిద్ధి నిచ్చును. దీనితో హోమము చేయుటచేతను, జపపాఠములు చేయుటచేతను సర్వదా యుద్ధమునందు విజయము ప్రాప్తించును. ఇరువది ఎనిమిది హస్తములుగల చాముండా దేవిని ధ్యానించవలెను. ఆమెకు రెండు చేతులలో కత్తి, ఖేటకము ఉన్నవి. రెండు చేతులలో గదాదండములు, రెండు చేతులలో ధనుర్బాణములు, రెండు చేతులలో ముష్టిముద్గరములు, రెండు చేతులలో శంఖ ఖడ్గములు, రెండు చేతులలో ధ్వజ వజ్రములు, రెండు చేతులలో చక్రపరశువులు, రెండు చేతులలో దర్పణ-డమరువులు, రెండు చేతులలో శక్తి-కుంతములు, రెండు చేతులలో హల-ముసలములు, రెండు చేతులలో పాశతోమరములు, రెండు చేతులలో ఢక్కా-పణవములు, రెండు చేతులలో అభయముద్ర, రెండు చేతులలో ముష్టికములు ఉండును. ఆమె మహిషాసురుని భయపెట్టుచు వానిని చంపును. ఈ విధముగ ధ్యానించుచు హోమము చేయుటచే సాధకునకు శత్రువులపై విజయము లభించును. నెయ్యి, తేనె, పంచదార కలిపిన తిలలు హోమము చేయవలెను. ఈ సంగ్రామ విజయవిద్యను ప్రతి ఒక్కనికిని (అధికారములేని వానికి) ఈయరాదు. (135)