అగ్ని మహా పురాణము
స్రావాది అశౌచమ్
పుష్కరుడు చెప్పెను:
మన్వాది ఋషులు చెప్పిన విధముగ గర్భస్రావ అశౌచమును గూర్చి చెప్పెదను. నాల్గవ మాసమువరకును జరిగిన గర్భస్రావమునందును, పంచమషష్ఠ మాసములందు జరిగిన గర్భపాతము నందును మాసములు ఎన్నియో అన్ని రాత్రులు స్త్రీకి అశౌచము. లేదా మూడు రోజులు మాత్రమే అశౌచము. ఏడవ మాసము నుండి దశరాత్రా శౌచము. క్షత్రియునకు నాలుగు రాత్రులు, వైశ్యునకు ఐదు రాత్రులు, శూద్రునకు ఎనిమిది దినములు అశౌచము. ఏడుమాసముల కంటె అధికమైనచో అందరికిని పదునొకండు దినములు అశుద్ధి. ఈ అశౌచము స్త్రీలకు మాత్రమే. తండ్రికి స్నానమాత్రము చేతనే శుద్ది. సపిండులకు ఆరు మాసముల వరకును అశౌచములేదు. సప్తమాష్టమ మాసములందు మూడు రాత్రులు అశౌచము. దంత జననము లోపల మృత్యువైనచో సపిండులకు సద్యఃశౌచము. చూడాకరణము లోపల ఒకరాత్రి, ఉపనయనము లోపల రాత్రిత్రయము, అది దాటిన దశరాత్రము. దంతములు రాకుండ మృతుడైనచో తల్లిదండ్రులకు మూడు రాత్రులు; చూడాకరణమునకు పూర్వము మృత్యువు కలిగినను మూడు రాత్రులే. మూడు సంవత్సరముల లోపు బ్రాహ్మణ బాలుడు మృతుడైనచో సపిండులకు ఒక రాత్రి అశౌచము. క్షత్రియ బాలకుడు మరణించినచో సపిండులకు రెండు రోజులు, వైశ్యులకు మూడు రోజులు, శూద్రులకు ఐదు రోజులు అశౌచము. బ్రాహ్మణులకు మూడు రోజుల అశౌచము చెప్పినచోట శూద్రులకు పదకొండు రోజులు, క్షత్రియులకు ఆరు రోజులు, వైశ్యులకు తొమ్మిది రోజులు అశౌచముండును. రెండు సంవత్సరముల బాలునకు అగ్ని సంస్కారము లేదు. వానిని భూమిలో పాతిపెట్ట వలెను. అతనికి ఉదక క్రియ కూడ ఉండదు. లేదా నామకరణము చేసినవాడు జాతదంతుడైనచో అగ్ని సంస్కార ఉదక దానములు చేయవలెను. ఉపనయనానంతరము మరణించినచో పది రోజుల అశౌచము. అగ్నిహోత్రము చేయుచు వేదాధ్యయనము చేయు బ్రాహ్మణునకు ఒక్క దినము నందే శుద్ధి. అతని కంటే హీనునకు మూడు దినములు, హీనతరునకు ఐదు రాత్రుల అశౌచానంతరము శుద్ధుడగును. పేరుకు బ్రాహ్మణుడు అనబడువాడు పది రోజులకును శుద్ధుడగును.
సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఏడు దినములలోనే శుద్ధుడగును; గుణవంతుడైన క్షత్రియుడు తొమ్మిది దినములలోను, వైశ్యుడు పదిదినములలోను, శూద్రుడు ఇరువది దినములలోను శుద్ధుడగును. సాధారణుడగు బ్రాహ్మణుడు పదిదినములలోను, క్షత్రియుడు పండ్రెండు దినముల లోను, వైశ్యుడు పదునైదు దినములలోను, శూద్రుడు మాసమునకును శుద్ధుడగును. గుణాధిక్య మున్నచో పది రోజుల అశౌచము మూడు రోజులును, మూడు రోజుల అశౌచము ఒక్కరోజు, ఒక రోజు అశౌచము తాత్కాలికముగాను తొలగిపోవును. ఈ విధముగనే అంతటను ఊహించవలెను. దాసులు, శిష్యులు, భృత్యులు మొదలగువారు తమ స్వామి లేదా గురువుతో కలిసి నివసించునపుడు ఆ స్వామి లేదా గురువు మరణించినచో వారందరికి కుటుంబములోని వారితో సమముగా అశౌచముండును. అగ్నిహోత్రము చేసికొననివానికి సపిండ మృత్యువు జరిగిన వెంటనే అశౌచము తగులును. అగ్నిహోత్రానుష్ఠానము చేయువానికి మాత్రము మృతునకు దహన సంస్కారము జరిగిన తరువాతనే అశౌచము ప్రాప్తించును. అన్ని వర్ణముల వారికి మూడవవంతు అశౌచ సమయము గడచిన పిమ్మట శారీరక స్పర్శాధికారముండును. ఈ నియమమునుబట్టి బ్రాహ్మణాదులు వరుసగ మూడు, నాలుగు, ఐదు, పది రోజుల తరువాత స్పర్శార్హులు అగుదురు. బ్రాహ్మణాదుల అస్థిసం చయము వరుసగ నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది-ఈ దినములందు చేయవలెను. వివాహముకాని కన్య మరణించినప్పుడు బాంధవులకు, ఒకరోజు, వివాహితయైనచో మూడు రోజులు అశౌచము. వివాహితయైన పుత్రిక గాని, సోదరి గాని మరణించినచో రెండు దినముల ఒక రాత్రి అశౌచము. అవివాహితలకు తండ్రి గోత్రమే గోత్రము. వివాహితలకు భర్తృత్రము. వివాహమైన పుత్రికి జలదానము చేయవలసిన విధి భర్తకు తండ్రికి గూడ ఉండును. పది దినముల పిమ్మట చూడాకరణమునకు ముందు కన్య మరణించినచో మాతా పితరులకు మూడు దినముల అశౌచము. ఇతర బంధువులకు తాత్కాలిక అశౌచము. చూడాకరణ అనంతరము వివాహాత్పూర్వము బంధువులకు ఒక రోజు అశౌచము. వాగ్దానానంతరము వివాహాత్పూర్వమైనచో మూడు రోజుల అశౌచము పిదప ఆ కన్య భ్రాతృ పుత్రులకు రెండు రోజుల ఒక రాత్రి అశౌచము. అన్యసపిండులకు మాత్రము తాత్కాలిక శుద్ధి. సజాతీయులతో జన్మ-మరణములందు, కలిసి ఉన్నచో బ్రాహ్మణునకు పది రోజులలో శుద్ధి. క్షత్రియ, వైశ్య, శూద్రులతో కలసి ఉన్నచో వరుసగ ఆరు,మూడు, ఒక రోజులలో శుద్ధి.
ఈ అశౌచ నియమములన్నియు సపిండులకు మాత్రమే. ఔరసులుకాని పుత్రులు మొదలగువారి విషయమున చెప్పెదను. క్షేత్రజుడు, దత్తుడు మొదలగు పుత్రులును, తనను విడచి మరొకనితో సంబంధము పెట్టుకొనిన స్త్రీ గాని, తన భార్యగా అయిన పర పురుషుని స్త్రీ గాని మరణించినపుడు అశౌచము మూడు రాత్రులు మాత్రమే ఉండును. స్వధర్మమును త్యజించి తనజన్మను వ్యర్థము చేసికొన్నవాడును, వర్ణసంకరజాతుడును, పరివ్రాజకుడు, అశాస్త్రీయ విధానముచే విషాదుల ద్వారా ఆత్మహత్య చేసికొన్నవారును, వీరికి జలాంజలి ఇవ్వవలసిన పనిలేదు. వారికి ఉదక క్రియా నివృత్తి అయిపోయినది. ఒక తల్లికి ఇద్దరు తండ్రుల ద్వారా పుట్టినవారి వలన బంధులకు జాతా శౌచము ఒక రోజు, మృతాశౌచము రెండు రోజులు. ఇంతవరకును సపిండుల అశౌచము చెప్ప బడినది. ఇప్పుడు సమానోదకుల అశౌచము చెప్పబడుచున్నది. బాలుడు దంతోత్పత్తికి పూర్వమే మరణించినను, దేశాంతరము నందున్న సపిండుడు మరణించినను, అసపిండుని మృత్యువు నందును, సచేల స్నానముచే శుద్ధి. జన్మ మృత్యువులందు సపిండులకు పదిదినములలో శుద్ధి. ఒక కులమునకు చెందిన అసపిండులకు మూడు రాత్రులతో శుద్ధి. సమాన గోత్రులకు స్నానమాత్రముననే శుద్ధి. ఏడవ తరమునందు పిండత్వము తొలగును. పదునాల్గవ తరమునందు సమానోదక సంబంధము గూడ తొలగిపోవును. కొందరిమతము ప్రకారము, జన్మ నామముల స్మృతి లేనపుడు సమానోదక సంబంధము తొలగిపోవును. అటుపిమ్మట సగోత్రత్వము మాత్రము మిగులును. పది రోజులు ముగియక ముందే విదేశములో ఉన్న బంధువు మరణవార్త విన్నవాడు మిగిలిన రోజులు మాత్రము అశౌచము పట్టవలెను. దశాహము దాటిన తరువాత తెలిసినచో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటినతరువాత తెలిసినచో జలస్పర్శ మాత్రముచే శుద్ధి. మేనమామ, శిష్యుడు ఋత్విక్కు బంధువులు మరణించినపుడు ఒక పగలు, ఒక రాత్రి, ఒక పగలు అశౌచము ఉండును. మిత్రుడు, జామాత, దౌహిత్రుడు, మేనల్లుడు, బావమరిది కుమారులు మరణించినప్పుడు స్నాన మాత్రముచే శుద్ధి. మాతామహి, ఆచార్యుడు, మాతామహుడు మరణించినపుడు మూడుదినములు అశౌచము. దుర్భిక్షము, రాష్ర్టోపద్రవము మొదలగు ఆపదలందు సద్యః కాలశుద్ధి చెప్పబడినది. యజ్ఞము చేయుచున్నవాడు, వ్రతపరాయణుడు, బ్రహ్మచారి, దాత, బ్రహ్మవేత్త-వీరికి తత్కాలమందే శుద్ధి. దానము, యజ్ఞము, దేశోపద్రవము, వివాహము యుద్ధము వీటియందు సద్యఃశుద్ది చెప్పబడినది. మహామారి మొదలైన ఉపద్రవములచే మరణించినవారి విషయము నందు గూడ సద్యః కాలాశౌచము. రాజును, గోవును, బ్రాహ్మణుని చంపినవారును అశాస్త్రీయముగా ఆత్మహత్య చేసుకొన్నవారును మరణించినప్పుడు తత్కాల శుద్ధి చెప్పబడినది.
అసాధ్యములగు వ్యాధులతో బాధపడువాడును, స్వాధ్యాయాసమర్థుడును, అగ్నియందుగాని, జలమునుగాని ప్రవేశించి మరణించుట ప్రాయశ్చిత్తము. అవమానము, క్రోధము, స్నేహము, పరాభవము, భయము-వీటివలన ఉరిపోసికొనిగాని, మరొక విధముగాగాని ఆత్మహత్య చేసికొన్న పురుషుడైనను, స్త్రీయైనను, లక్ష సంవత్సరములు అశౌచియైన నరకమునందు నివసించును. శౌచాశౌచాది జ్ఞానముకూడలేని అతి వృద్ధుడు మరణించినచో అశౌచము మూడు రాత్రులే. రెండవ రోజున అస్థి సంచయనము, మూడవ రోజున జలదానము, నాల్గవ రోజున శ్రాద్ధము చేయవలెను. పిడుగు పడి చనిపోయినవారి అశౌచము సపిండులకు మూడు దినములు. పాషండులను ఆశ్రయించి, పరిఘాతియైన స్త్రీ మరణించినపుడు అశౌచము ఉండదు. ఆమెకు జలాంజలి కూడ ఇవ్వరాదు. పితృ మాత్రాదుల మరణవార్త ఒక సంవత్సరము తరువాత అందినను సచేల స్నానము చేసి, ఉపవసించి, విధిపూర్వకముగ ప్రేతకార్యములు చేయవలెను. అసపిండుని శవము మోసిన వాడు సచేల స్నానము చేసి, అగ్నిని స్పృశించి, నెయ్యి తిన్నచో శుద్ధుడగును. అతడు ఆ కుటుంబము వారి అన్నము తిన్నచో ఆతనికి పది రోజుల తరువాతనే శుద్ధి. ఆ ఇంటివారి అన్నము తినక, ఆ ఇంటిలో నివాసము చేయక ఉన్నచో ఒక్క రోజునకే శుద్ధి. అనాధ బ్రాహ్మణ శవమును మోసిన బ్రాహ్మణులకు అడుగడుగున యజ్ఞఫలము కలుగును. స్నానమాత్రము చేతనే శుద్ధి. శూద్రశవము ననుసరించి వెళ్లిన బ్రాహ్మణునకు మూడు రోజులకు శుద్ధియగును. మరణించినవాని బంధువులతో కలసి విలాసాదులు చేసిన బ్రాహ్మణుడు ఒక పగలు, ఒక రాత్రి, దాన శ్రాద్ధాదులను పరిత్యజించవలెను. తన ఇంటిలో శూద్రస్త్రీ ప్రసవించినను, శూద్రుడు మరణించినను మూడు రోజులలో ఇంటిలోని భాండాదులను పారవేయవలెను. భూమిని అలకవలెను. అపుడు శుద్ధి అగును. సజాతీయులు ఉండగా బ్రాహ్మణ శవమును శూద్రులచే మోయించరాదు. శవమునకు స్నానము చేయించి, నూతన వస్త్రమునుకప్పి, పూవులతో పూజించి శ్మశానమునకు తీసికొని వెళ్లవలెను. నగ్న దేహమునే దహించవలెను. దేహభాగమును కొంచెము గూడ మిగల్చగూడదు.
ఆ సమయమున సగోత్రుడు శవమును ఎత్తి చితిపై ఉంచవలెను. అగ్న్యాధానము చేసిన వానిని యథావిధిగా మూడు అగ్నులతో దహనము చేయవలెను. అగ్న్యాధానము లేక ఉపనయన సంస్కారయుక్తుడైన వానికి ఒక (ఆహవనీయ) అగ్నితోను, సాధారణులను లౌకికాగ్నితోను దహనము చేయవలెను. ‘అస్మాత్.....లోకాయ స్వాహా’ అను మంత్రము పఠించుచు పుత్రుడు తండ్రి శవము ముఖమున అగ్ని ఉంచవలెను. పిదప ప్రేతయొక్క నామ గోత్రములను ఉచ్చరించుచు బంధువులు ఒక్కొక్కరు జల ప్రదానము చేయవలెను. మాతామహాచార్యాదులు మరణించినప్పుడు గూడ ఈ విధముగనే జలాంజలి దానము చేయవలెను. మిత్రులకు, విహితులగు పుత్రీ-సోదర్యాదులకును, మేనల్లునకును, ఋత్విక్కులకును, మామగారికిని గూడ ఈ విధముగా జలము నిచ్చుట ఇష్టముపై ఆధారపడి ఉండును. పుత్రుడు తండ్రికి పది రోజులపాటు ‘అప నః శోశుచత్ అఘమ్’ ఇత్యాది మంత్రము పఠించుచు, జలాంజలి ఇవ్వవలెను. బ్రాహ్మణునకు పది, క్షత్రియునకు పదు నొకండు, వైశ్యునకు పదునైదు, శూద్రునకు ముప్పది పిండములు ఇవ్వవలెను. పుత్రుడైనను, పుత్రికయైనను, మరెవ్వరైనను పుత్రుడువలెనే మృతునకు పిండప్రదానము చేయవలెను. దహన సంస్కారము చేసి ఇంటికి తిరిగి వచ్చి, మనస్సు అదుపులో ఉంచుకొని, ద్వారము వద్ద నిలచి, రెండు వేపాకులు నమలి, ఆచమనముచేసి, అగ్నిని, జలమును, గోమయమును, పచ్చని ఆవాలను స్పృశించవలెను. పిదప ముందుగా ఱాతిమీద పాదముంచి మెల్లగా ఇంటిలో ప్రవేశించవలెను. ఆ నాటినుండి బంధువులు ఉప్పు, మాంసము తినగూడదు. అందరును భూమిపై శయనించవలెను. స్నానముచేసి మూల్యమిచ్చి కొన్న అన్నము తినవలెను. మొదట దహన సంస్కారము చేసినవాడు పది దినముల వరకును కర్మ చేయవలెను. అధికారము గలవారు లేని పక్షమున బ్రహ్మచారియే పిండదానము, జలాంజలి దానము చేయవలెను. సపిండులకు ఈ విధముగ మరణాశౌచము వచ్చినట్లే జాతా శౌచము కూడ వచ్చును. మరణాశౌచము సపిండులందరికిని వచ్చును. జాతాశౌచముచే కలుగు అస్పృశ్యత్యము విశేషముగా తల్లి దండ్రులకు మాత్రమే వచ్చును. వారిలో కూడ తల్లికే విశేషముగ అశౌచ ముండును. తండ్రి స్నానము చేయుటచే స్పర్శయోగ్యుడు అగును, పుత్రజన్మ దివసమున తప్పక శ్రాద్ధము చేయవలెను. ఆ దినము శ్రాద్ధ దానములు, గో, సువర్ణ, వస్త్రాది దానములు చేయుట మంచిది.
మరణాశౌచము మరణాశౌచముతోను, సూతకాశౌచము సూతకముతోను తొలగును. మొదటి అశౌచముతో రెండవ అశౌచమునకు శుద్ధియగును. జన్మాశౌచము నందు మరణ అశౌచమైనను, మరణ అశౌచమున జన్మాశౌచమైనను, మరణాశౌచములో జన్మాశౌచము నివర్తించినట్లు గ్రహించి శుద్ధి చేసికొనవలెను. జన్మాశౌచముతో మరణా శౌచము తొలగదు. రెండు సమానమైన అశౌచములే అయినపుడు మొదటిదానితో రెండవ దానిని సమాప్తము చేసికొనవలెను. ఇది ధర్మరాజు చెప్పిన ధర్మము. ఒక మరణాశౌచములోపల రెండవ మరణాశౌచము వచ్చినప్పుడు రెండవది మొదటి దానితో అంతమగును. గురువైన అశౌచముతో లఘువైన అశౌచము బాధితమగునుగాని, లఘ్వాశౌచముచే గుర్వాశౌచము బాధితముకాదు. మృతకాశౌచము లేదా సూతకాశౌచము చివరి రాత్రి మధ్య రెండవ అశౌచము వచ్చినచో మిగిలిన భాగముతోనే రెండవది పూర్తిగా నివృత్తమైపోవును గాన సపిండులు అందరికిని శుద్ధి అగును. రాత్రి చివరి భాగమున అశౌచము వచ్చినచో మిగిలిన భాగముతోనే రెండవది పూర్తిగా నివృత్తమైపోవునుగాన సపిండులందరికిని శుద్ధి యగును. రాత్రి చివరి భాగమున రెండవ అశౌచము వచ్చినచో మరి రెండు రోజుల తరువాత అశౌచము నివర్తించును. చివరిరాత్రి గడచిపోయి చివరి దినమున ప్రాతఃకాలము మరియొక్క అశౌచము వచ్చినచో మరి మూడు రోజుల తరువాత సపిండులకు శుద్ధియగును. రెండు విధములైన అశౌచములందును ఆ కుటుంబమువారి అన్నము తినగూడదు. అశౌచమున దానాద్యధికారము కూడ ఉండదు. అశౌచ సమయమున ఇతరుల ఇంట భోజనము చేసినచో ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తెలియక భోజనము చేసినచో పాపము రాదు. తెలిసి తిన్నవానికి ఒక దినము అశౌచము ప్రాప్తించును.(158)
