అగ్ని మహా పురాణము

Table of Contents

త్వరితావిద్యా సిద్ధి

అగ్నిదేవుడు పలికెను:

ఇపుడు ధర్మకామాది సిద్ధి ప్రదమగు విద్యా ప్రస్తారమును చెప్పెదను. నవకోష్ట విభాగముచే విద్యా భేదము లభించును. అనులోమ విలోమ యోగము సమస్తవ్యస్త యోగము కర్ణా వికర్ణ యోగము అధ ఊర్ధ్వ విభాగయోగము త్రిత్రిక యోగము వీటిచే ఎవని శరీరమునకు దేవీరక్ష ఏర్పరుపబడునో ఆతడు సిద్ధిదాయకములగు మంత్రములను అనేకములగు ప్రస్తారమును తెలుసుకొనగలుగును. ప్రతి శాస్త్రమునందును మంత్రములు చెప్పబడినవి. కాని వాటి వాటి ప్రయోగము దుర్లభము మొదటి వర్ణము గురువు అగును. పూర్వము దాని వర్ణనము చెప్పబడలేదు. దాని ప్రస్తారముచే ఏకాక్షర ద్వక్షర త్ర్యక్షర మంత్రములు ఏర్పడును. నిలువుగను అడ్డముగను నాలుగేసి రేఖలుగీయ తొమ్మిది కోష్టము లగును. మద్యకోష్ఠముతో ప్రారంభించి ప్రదక్షిణ క్రమమున మంత్రాక్షరములు వాటిపై వ్రాసి ప్రస్తార భేదనము చేయవలెను. ప్రస్తార క్రమయోగముచే ప్రస్తారమును పొందగలిగిన సాధకుని చేతిలో అన్ని సిద్ధులుండును. మూడు లోకములును ఆతని పాదముపై వ్రాలును. ఆతడు నవఖండ విభక్తయగు భూమిని పొందును. కపాలముపై గాని, శ్మశాన వస్త్రముపై గాని అన్ని వైపులను శివతత్త్వములను వ్రాసి మంత్రవేత్త దాని మధ్య భాగము నందలి కర్ణికపై తాను తలచిన వ్యక్తి పేరు భూర్జ పత్రముపై వ్రాసి వుంచవలెను. ఖదిర వృక్షము యొక్క బొగ్గులతో భూర్ణ పత్రమును వెచ్చచేసి రెండు పాదముల కింద తొక్కి వుంచవలెను. ఈ ప్రయోగముచే ఒకే సప్తాహము నందు సచరాచరములగు మూడు లోకములను తన పాదములపై పడవేయగలుగును. వజ్రసంపుట గర్భయుక్తమగు ద్వాదశార చక్రము మధ్య యందు శత్రువుపేరు వ్రాసి, దానిని సదాశివ మంత్రము చెప్పుచు దర్భలతో మార్జనము చేయవలెను. పైన చెప్పిన ద్వాదశార చక్రమును నామాధికరణములను పశువుతో గోడపై గాని పీటపైగాని శిలా పట్టంపైగాని వ్రాయవలెను. ఇట్లు చేయుటచే శత్రువున ముఖ స్తంభము, గతిస్థంభము, సైన్య స్థంభము కలుగును.

శ్మశాన వస్త్రముపై విష మిశ్రితమగు రక్తముతో షట్కోణ చక్రము వ్రాసి దాని మధ్య శత్రువు పేరు వ్రాయవలెను. చక్రము నలు వైపుల శక్తి బీజములు వ్రాసి దానిపై దండము ఉంచవలెను. శ్మశాన భూమిపై ఉంచబడిన ఆ శత్రువుపై శీఘ్రముగా దండ ప్రహారము చేసినచో శత్రు రాజు యొక్క రాష్ట్రము ఖండితమైపోవును. చక్రాకార మండలము ఏర్పరచి దాని మధ్య భాగమున శత్రు నామము వ్రాసి చక్రధార యందు శక్తి బీజ న్యాసము చేసి శత్రువు పేరు ఉచ్చరించుచు చక్రధారతో వాటిని కొట్టుచున్నట్లు భావన చేసినచో శత్రువు నశించును. ఖడ్గ మధ్య భాగమున గరుడ బీజముతో శత్రువు నామధేయము వ్రాసి దర్భతో మార్జనము చేయవలెను. పేరు వ్రాయుటకు శ్మశానము నందలి బొగ్గును ఉపయోగించవలెను. దానిపై చితాభస్మముతో ప్రహారము చేయవలెను. ఇట్లు చేసిన సాధకుడు ఒక్క వారంలో శత్రు దేశమును జయించును. ఛేదన భేదన మారణములందు ఆతడు శివునివలె శక్తిశాలి అగును. తారకమునకు (ఫట్) నేత్రమనిపేరు. దీనిని శాంతి పుష్టి కరములయందు వినియోగించవలెను. ఈ దహనాది ప్రయోగము శాకినిని కూడ ఆకర్షించును. పై చెప్పిన నూరు చక్రములలో ఉన్న మంత్రాక్షరము మొదలు పశ్చిమ దిక్కునందున్న కోష్టము వరకు ఉన్న రెండు అక్షరములను ‘వక్రతుండ’ మంత్రములు జపించుటచే కుష్టాది చర్మరోగములు అన్నియు నశించును. సందేహములేదు. మధ్య కోష్టము నుండి ఉత్తర కోష్టమువరకు వున్న రెండు అక్షరముల మంత్రములను కరాళి బంధముతో జపించినచో ఆద్యక్షరీవిద్య సాక్షాత్తు శివుడే ప్రతివాదియైనను రక్షణము నిచ్చును. పశ్చిమమునందు ఉన్న మంత్రాక్షరమును మొదట ఉంచి ఉత్తరకోష్టము వరకు ఉన్న మంత్రాక్షరములను వక్రతుండ మంత్రములతో జపించినచో చివర కాసాదులు శమించును. ఉత్తర కోష్టము మొదలు మధ్యకోష్టము వరకును ఉన్న మంత్రాక్షరములను జపించినచో వట బీజమునందు కూడ గురుత్వమును కల్గించ కలుగును. హర్వాది మధ్యమాంత పక్షముల జపము వెంటనే లఘుత్వమును కల్గించును. భూర్జపత్రముపై గోరోచనముతో వజ్ర వ్యాప్తమగు భూపుర చక్రమును నిర్మించి మంత్ర బీజములను క్రమముగ వ్రాసి దానిని ధరించినచో శరీర రక్ష కలుగును. దానిని సువర్ణము చుట్టి ధరించినచో ఆ రక్షా యంత్రము మృత్యువును రానీయదు. విఘ్నపాప శత్రువులను అణచి సౌభాగ్య దీర్ఘాయువులను ఇచ్చును. జూదమునందును, యుద్ధమునందును విజయమును ఇచ్చును. ఇంద్రుని సేనతో యుద్ధము చేయవలసి వచ్చినను విజయమును ఇచ్చును. సందేహము లేదు, వంధ్య స్త్రీలకు పుత్రుల నిచ్చును. ఇది రెండవ చింతామణి వంటిది. పర రాష్ట్రములపై అధికారమును పొందును. రాజ్యమును భూమిని జయించును. ఫట్ స్త్రీం, క్షీం, హ్రూం అను మంత్రమును లక్ష పర్యాయములు జపించినచో యక్షాదులు కూడా వశమగుదురు. (312)