అగ్ని మహా పురాణము

Table of Contents

మాసోపవాస వ్రతము

అగ్ని దేవుడు ఇట్లు చెప్పెను: వశిష్ఠమహామునీ! ఇప్పుడు అన్నింటికంటెను ఉత్తమమైన మాసోపవాస వ్రతమును గూర్చి చెప్పెదను. వైష్ణవ యజ్ఞము చేసి, ఆచార్యుని ఆజ్ఞ గైకొని, కృచ్ఛ్రాది వ్రతములను ఆచరించుట ద్వారా తన శక్తిని పరీక్షించుకొని, మాసోపవాస వ్రతము చేయవలెను. వానప్రస్థుడు, సంన్యాసి, విధవయగు స్త్రీ ఈ వ్రతము చేయవలెను.

ఆశ్వయుజ శుక్ల ఏకాదశినాడు ఉపవాసముండి ముప్పది దివసములకై ఈ క్రింది విధముగ సంకల్పించి మాసోపవాస వ్రతమును గ్రహించవలెను: ‘ఓ! మహావిష్ణూ! నేను ఈ దినము మొదలు ముప్పది దినములు నీ ఉత్థానము పర్యంతము నిరాహారుడుగా ఉండి నిన్ను పూజించెదను. సర్వ వ్యాపివైన ఓ హరీ! ఆశ్వయుజ శుక్ల ఏకాదశి మొదలు నీ ఉత్థాన కాలమైన కార్తిక శుద్ధ ఏకాదశిలోగా నేను మరణించినను, నీ కృపచే వ్రత భంగము కాకుండుగాక’, వ్రతము నాచరించు వాడు దినమున మూడు పర్యాయములు స్నానము చేయుచు, సుగంధ ద్రవ్యములతోను, పుష్పములతోను, ప్రాతఃకాలమునను, మధ్యాహ్నమందును, సాయంకాలమునందును శ్రీమహావిష్ణువును పూజించవలెను. తత్సంబంధి, గాన, ధ్యాన, జపాదులు చేయవలెను. వ్యర్థాలాపములను విడువవలెను. ధనాశ పరిత్యజించవలెను. వ్రతహీనుని ఎవ్వనిని స్పృశించరాదు. శాస్త్ర నిషిద్ధ కర్మల నాచరించు వారిని ప్రేరేపించరాదు. ముప్పది దివసముల పాటు దేవాలయమునందే నివసించవలెను. వ్రతము చేయువాడు కార్తిక శుక్ల ద్వాదశినాడు శ్రీమహావిష్ణువును పూజించి పూజ్యులకు భోజనము పెట్టి, వారికి దక్షిణలు ఇచ్చి, తాను కూడా పారణము చేసి, వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ పదమూడు మాసఉపవాసములు చేసినవాడు భుక్తిముక్తులను రెండిటి పొందును.

పిదప వైష్ణవ యజ్ఞము చేసి (పదముగ్గురు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారి ఆజ్ఞచే) ఒక బ్రాహ్మణునకు పదమూడు ఉత్తరీయములను, పదమూడు అధోవస్త్రములను, పాత్ర, ఆసన, ఛత్ర, పవిత్ర, పాదుకా, యోగపట్ట, యజ్ఞోపవీతములను దానము చేయవలెను. 

పిదప శయ్యపై తన ప్రతిమను, సువర్ణమయమగు మహావిష్ణు ప్రతిమను పూజించి వాటిని మరొక బ్రాహ్మణునకు దానముచేసి, ఆతనిని వస్త్రాదులచే సత్కరించవలెను. ‘నేను సర్వ పాప విముక్తుడనై, బ్రాహ్మణ శ్రీమహావిష్ణు ప్రసాదముచే విష్ణు లోకమునకు వెళ్ళగలను’ అని ఆతడు పలుకగా బ్రాహ్మణులు ‘ఓ దేవాత్మకా! నీవు రోగశోకరహితమగు విష్ణులోకమునకు వెళ్ళి, అచట విష్ణురూప ధారివై విమానమున విరాజిల్లుము’ అని పలుక వలెను. పిదప వ్రతము నాచరించినవాడు ద్విజులకు నమస్కరించి, ఆ శయ్యను ఆచార్యునకు ఇచ్చి వేయవలెను. ఈ విధముగ వ్రత మాచరించినవాడు తన నూరు కులములను ఉద్ధరించి వారిని కూడ విష్ణు లోకమునకు తీసికొని వెళ్ళును. మాసోప వాసము చేయువాడు నివసించు దేశము పాపరహితమైయుండును. మాసోపవాస వ్రతానుష్ఠానము చేసినవాడు పుట్టిన కులముమాట చెప్పవలెనా? వ్రతము నాచరించువాడు మూర్ఛచెందినచో అతనికి నెయ్యి కలిపిన పాలు త్రాగించవలెను. ఈ క్రింద చెప్పిన పదార్థములు వ్రతభంగ కరములు కావు-బ్రాహ్మణుని అనుమతిచే గ్రహించిన హవిస్సు, ఆచార్యుని అనుజ్ఞచే గ్రహించిన ఓషధి, ఫలము, మూలము, ఫలము. ఈ వ్రతమునందు శ్రీమహావిష్ణువే మహౌషధి స్వరూపుడు’ అను విశ్వాసముతో వ్రత మాచరించువాడు వ్రతమును సమాప్తి చేయగలడు. (204)