అగ్ని మహా పురాణము

Table of Contents

నిత్యనైమిత్తిక ప్రాకృత ప్రళయములు

అగ్ని పలికెను:

ప్రళయము నాలుగు విధములు. నిత్యము జరుగుచున్న ప్రాణుల మృత్యువు నిత్య ప్రళయము. ప్రాణులందరును పూర్తిగా నశించుట బ్రహ్మలయము లేదా నైమిత్తిక లయము. వెయ్యి చతుర్యుగములు గడచిన పిమ్మట పంచ భూతములు ప్రకృతిలో లీనమైనపుడు అది ప్రాకృతలయము, జ్ఞానము వలన జీవాత్మ పరమాత్మలో లీనుడగుట ఆత్యంతిక లయము. కల్పాంతమున జరుగు నైమిత్తిక లయమును గూర్చి చెప్పెదను. చతుర్యుగ సహస్రాంతమున భూమి చాలా వరకు క్షీణమైపోవును. నూరు సంవత్సరములు భయంకరములైన అనావృష్టి ఏర్పడును. ప్రాణులందరును నశింతురు. అపుడు జగత్పతియైన విష్ణువు సూర్యుని ఏడు కిరణముల ద్వారా భూపాతాళ-సముద్రాదులలో ఉన్న జలమును నశింపచేయును. పిదప ఆయన ప్రభావముచే ఆ జలమును పీల్చుటచే పుష్టి చెందిన ఆ ఏడు రశ్ములు ఏడుగురు భాస్కరులుగా ఏర్పడి పాతాళతల శీతమగు త్రైలోక్యమును అంతను భస్మము చేయును. అపుడు భూమి తాబేలు పైభాగమువలె కనబడును. ఆదిశేషుని శ్వాస నుండి కాలాగ్ని రుద్రుడు ఆవిర్భవించి క్రిందనున్న పాతాళములను భస్మము చేయును. పిదప విష్ణువు భూమిని స్వర్గమును కాల్చివేయును. ఆ సమయమున త్రైలోక్యము ప్రజ్వలించుచున్న మంగలము(బొచ్చె)వలె కనబడును. అపుడు తాపముతో బాధపడుచున్న భువర్లోక స్వర్గలోక వాసులు మహర్లోకమునకు వెళ్లి అచట నుండి జనలోకమునకు వెళ్లుదురు. ఇట్లు రుద్రరూపి జగత్తును కాల్చివేయగ హరియొక్క శ్వాసమునుండి మెరుపులతో గూడిన వివిధ రూపములుగల మేఘములు ఆవిర్భవించును. నూరు సంవత్సరములు వర్షించి ఆ అగ్నిని శమింపచేయును. ఆ జలము సప్తర్షి స్థానము వరకు చేరిన పిమ్మట, విష్ణు ముఖము నుండి బయలుదేరిన నిశ్వాసము వాయురూపమున వంద సంవత్సరములు వీచి ఆ మేఘములను చెదరగొట్టును. పిదప ఆహరి వాయువును త్రాగివేసి ఏకార్ణవము నందు ఆదిశేషునిపై శయనించును. ఆ సమయమున సిద్ధులు, మహర్షులు, బ్రహ్మరూప ధారియగు ఆతనిని స్తుతింతురు. మధుసూదనుడు ఆత్మ మాయారూపమగు దివ్య యోగ నిద్రను అవలంబించి తన వాసుదేవ స్వరూపమును చింతించుచు ఒక కల్ప కాలము శయనించును. పిదప లేచి బ్రహ్మ రూపియై మరల సృజించును. ఈ విధముగ బ్రహ్మ యొక్క రెండు పదార్ధముల ఆయుర్దాయము గడచిన పిమ్మట ఈ స్థూల ప్రపంచము ప్రకృతియందు లీనమగును.

ఒకటి నించి పదిచొప్పున గుణించుచు పోగ పదునెనిమిదవ స్థానము చేరునప్పటికి ఎంత సంఖ్యవచ్చునో అది పరార్ధము. దానికి రెట్టింపు కాలము గడచిన పిమ్మట ప్రాకృత ప్రళయము ఏర్పడును. వర్షములు లేకపోవుటచే అగ్ని ప్రజ్వలించి అంతయు భస్మమైపోవును. మహతత్త్వము మొదలు విశేషము వరకు ఉన్న కార్యములన్నియు నశించును. భగవంతుని ఇచ్ఛను అనుసరించి ఆ ప్రళయము రాగా జలము భూమిలో వున్న గంధాదిగుణములను తనలో లీనము చేసుకొనును. అప్పుడు గంధహీనమగు ప్పథివి నీటిలో లీనమైపోవును. పిదప రసమయమగు జలము మిగులును. రసము జలమున గుణము. అగ్ని ఆ రసమును త్రాగివేయగా జలములీనమైపోవును. అగ్ని తత్త్వము ప్రజ్జ్వలించును. పిమ్మట తేజస్సు యొక్క ప్రకాశ గుణమును వాయువు మింగివేయును. ఈ విధముగా అగ్నితత్త్వము లీనమైపోగా గొప్ప వాయువు వీచును. వాయువు యొక్క గుణమగు స్పర్శను ఆకాశము మ్రింగివేయగా, వాయువు నశించి ఆకాశము మాత్రము నిశ్శబ్దముగా మిగులును. భూతములకు కారణమగు అహంకారము ఆకాశ గుణమగు శబ్దమును మ్రింగివేయగ తేజసాహంకారము ఇంద్రియములను తనలో లయము చేసుకొనును. దానిని మహత్తత్త్వము తనలోన లీనము చేసుకొనును. ఈ విధముగా భూమి జలము నందు, జలము అగ్నియందు, అగ్ని వాయువు నందు, వాయువు ఆకాశము నందు, ఆకాశము అహంకారమునందు, అహంకారము మహత్తత్వము నందు లీనమగును. దానిని ప్రకృతి తనలో లీనము చేసుకొనును. ‘వ్యక్త’, ‘అవ్యక్త’ అని ప్రకృతి రెండు విధములు. ‘వ్యక్త’ అవ్యక్తములో లీనమగును. అవినాశియు, శుద్ధ స్వరూపుడు అగు ఏకైక పురుషుడు ఎవడున్నాడో అతడు కూడ పరమాత్మ అంశమే. చివరకు ప్రకృతియు పురుషుడును పరమాత్మయందే లీనమగును. ఆ పరమాత్మ సత్స్వరూపము జ్ఞేయము, జ్ఞానమయము. బుద్ధ్యాదుల కంటే పరము. ఆ పరమాత్మ యందు నామ, జాత్యాది కల్పనలు ఉండవు. (368)