అగ్ని మహా పురాణము

Table of Contents

అగ్నికార్య విధానము

అగ్ని దేవుడు పలికెను: సాధకుడు ఈ “ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః” అను మంత్రము చదువుచు యాగమండపమును ప్రవేశింపవలెను. యజ్ఞశాలను అలంకరింపవలెను. (ఈ క్రింది శ్లోకమును చదువుచు భగవంతునకు నమస్కారము చేయవలెను), “వేదములకును బ్రాహ్మణులకును హితమును చేయు, అవ్యయ స్వరూపుడగు శ్రీధరునకు నమస్కారము. ఋగ్యజుః సామాథర్వ వేదములు విష్ణు స్వరూపమైనవి. శబ్దములన్నియు విష్ణు స్వరూపమే. అట్టి భగవంతుడైన విష్ణువునకు నమస్కారము.” సాయంకాలమున సర్వతోభద్రము మొదలగు మండలముల రచన చేసి పూజాధ్యుప యుక్తములగు ద్రవ్యములను సమకూర్చుకొనవలెను. కాళ్లు చేతులు కడుగుకొనవలెను. ఆయా ద్రవ్యములను తగుస్థానములందు ఉంచి, చేతితో  అర్ఘ్యము గ్రహించి, ఆ జలముతో తన శిరముపై ప్రోక్షించుకొనవలెను. ద్వారాది ప్రదేశములందు నీళ్లు చల్లవలెను. ద్వారయాగ (ద్వారస్థ దేవతా పూజా ప్రారంభము చేయవలెను. మొదట తోరణాధి పతులను బాగుగా పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులలో అశ్వత్థ, ఉదుమ్బర, వట, ప్లక్ష వృక్షములను పూజింపవలెను. ఇవి కాక, తూర్పున ఋగ్వేదమును, ఇంద్రుని, శోభనుని, దక్షిణమున యజుర్వేదమును, యముని, సుభద్రుని, పశ్చిమమున సామవేదమును, వరుణుని, సుధన్వుని, ఉత్తరమున అథర్వ వేదమును, సోముని, సుహోత్రుని పూజింపవలెను.

తోరణము (ద్వారము) లోపల పతాకలు కట్టి రెండేసి కలశములను స్థాపింపవలెను. కుముదము మొదలగు దిగ్గజములను పూజింపవలెను. ఒక్కొక్క గుమ్మము వద్దను ఇద్దరిద్దరు ద్వారపాలకులను, వారి నామ మంత్రములు చదువుచు పూజింపవలెను. తూర్పున పూర్ణ-పుష్కరులు, దక్షిణమున అనంద-నందనులు, పశ్చిమమున వీరసేన-సుషేణులు, ఉత్తరమున సంభవ-ప్రభవులు అను ద్వారపాలురను పూజింపవలెను. ‘ఫట్’ అను అస్త్ర మంత్రమును ఉచ్చరించుచు (పుష్పములుచల్లి విఘ్నములను తొలగించి పిదప మండలములోనికి ప్రవేశించవలెను. భూతశుద్ధి, న్యాసము, ముద్రలుచేసి’ శిఖకు (వషట్’కు) చివర ‘ఫట్’ చేర్చి జపించుచు నాలుగు దిక్కులందును ఆవాలు చల్లవలెను. పిమ్మట వాసుదేవ మంత్రముతో గోమూత్రమును, సంకర్షణ మంత్రముతో గోమయమును, ప్రద్యుమ్న మంత్రముతో గోదుగ్ధమును, అనిరుద్ధ మంత్రముతో పెరుగును, నారాయణ మంత్రముతో ఘృతమును గ్రహించి, వాటినన్నింటిని కలుపగా పంచగవ్య మేర్పడును. పంచగవ్యమును ఒక పర్యాయము, రెండు పర్యాయములు లేదా మూడు పర్యాయములు వేరువేరుగ చేయవలెను. వీటిలో ఒకటి మండప ప్రోక్షణమునకు ఉపయోగింపవలెను. రెండవది తినుటకును, మూడవది స్నానమునందును ఉపయోగింపవలెను. పది కలశలను స్థాపించి వాటిపై ఇంద్రాది లోక పాలురను పూజింపవలెను. పూజచేసి వారికి శ్రీహరి ఆజ్ఞను వినిపింపవలెను. “ఓలోకపాలులారా! శ్రీహరి ఆజ్ఞ ప్రకారము మీరు ఈ యజ్ఞమును రక్షించుటకై ఎల్లపుడును ఇచట నుండవలెను.”

యాగద్రవ్యాదులను సంరక్షించుకొని వికిర ద్రవ్యములను (విఘ్న నివారణము కొరకై నాలుగు వైపులను చల్లు ఆవాలు మొదలగు వాటికి వికిరములని పేరు) చల్లవలెను. అస్త్రమూల మంత్రమును (అస్త్రాయఫట్) ఏడుసార్లు జపించుచు ఈ వికిరములను చల్లవలెను. మరల అదేవిధముగ అస్త్రమంత్రమును జపించుచు కుశనిర్మిత కూర్పమును తీసికొనవలెను. వాటిని ఊశానకోణమునందు ఉంచి వాటిపైన కలశములను వరనిని ఉంచవలెను. కలశముపై సాంగముగ శ్రీహరి పూజచేసి, వర్ధనిలో అస్త్రపూజ చేయవలెను. అచ్ఛిన్నమగు వర్ధనీ ధారచే యాగమండపమును ప్రదక్షిణ క్రమమున తడుపుచు కలశమును దానికి ఉపయుక్తమగు స్థానమున చేర్చి, ఆసనముపై ఉంచి, దాని పూజ చేయవలెను. కలశముశలో పంచరత్నములు ఉంచవలెను, దానిపై వస్త్రము చుట్టవలెను. దానిపై గంధార్యుపచారములతో శ్రీహరిని పూజింపవలెను. వర్ధనిలో కూడ బంగారు ముక్క ఉంచవలెను. దానిపై అస్త్ర పూజచేసి, దాని ఎడమ భాగమున, సమీపము నందే వాస్తు లక్ష్మీ-భూ వినాయకులను పూజింపవలెను. సంక్రాంత్యాది కాలములందు ఈ విధముగనే శ్రీమహా విష్ణువు స్నానాభిషేకముల ఏర్పాటు చేయవలెను. మండపము యొక్క కోణములందును, దిక్కులందును ఎనిమిది కలశములను, మధ్యయందు ఒక కలశమును, మొత్తము భద్రములు లేని తొమ్మిది కలశములు ఉంచి, వాటిలో పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, పంచ గవ్యములు వేయవలెను. పూర్వాది కలశములలోపైన చెప్పిన వస్తువులను, అగ్ని కోణాదులందలి కలశములలో ఆ ద్రవ్యములతో పాటు పంచామృత యుక్త జలమును వేయవలెను, పెరుగు, పాలు, తేనె, వేడినీళ్ళు-ఇవి పాద్యాంగములు.

కమలములు, శ్యామాకము, దూర్వాదలములు, విష్ణుక్రాన్తోషధి అను నాలుగు వస్తువులతో కూడిన జలము పాద్యమని చెప్పబడును. అర్ఘ్యమునకు కూడ ఎనిమిది అంగములు చెప్పబడినవి. అర్ఘ్యము కొరకు యవలు, గంధము, ఫలములు, అక్షతలు, కుశలు, ఆవాలు, పుష్పములు, తిలలు సమకూర్చు కొనవలెను. జాతీ, లవంగ, కంకోలములతో కూడిన జలమును ఆచమనీయముగా ఇవ్వవలెను. ఇష్టదేవతలకు, మూలమంత్రము చదువుచు, పంచామృత స్నానము చేయించవలెను, మధ్యనున్న కలశము నుండి శుద్ధోదకమును గ్రహించి దేవుని శిరముపై చల్లవలెను. కలశము నుండి వచ్చు జలమును, కూర్చాగ్రమును స్పృశింపవలెను. పిమ్మట శుద్ధోదకముతో పాద్య, అర్ఘ్య, ఆచమనీయములు సమర్పింపవలెను. వస్త్రముచే దేవతామూర్తిని తుడిచి, వస్త్రధారణము చేయించి, సవస్త్రకముగ మండలము మీదికి తీసికొని వెళ్లవలెను. అచట బాగుగా పూజచేసి, ప్రాణాయామ పూర్వకముగ కుండాదులలో హోమము చేయవలెను. (హవన విధానము): రెండు చేతులుకడిగి గాని, అగ్నికుండమునందు గాని, వేదిపైగాని, మూడు పూర్వాగ్ర రేఖలు గీయవలెను. వాటిని దక్షిణమునుండి ప్రారంభించి, ఉత్తరము వైపు గీయవలెను. మరల వాటి పై మూడు ఉత్తరాగ్రరేఖలు గీయవలెను. (వీటిని కూడ కుడి నుండి ప్రారంభించి ఎడమకు గీయవలెను).

పిమ్మట అర్ఘ్య జలముతో ఈ రేఖలను కడిగి యోని ముద్ర చూపవలెను. అగ్నిని ఆత్మరూపముగా భావించుచు యోనియుక్తమగు కుండమునందు స్థాపింపవలెను. పిమ్మట దర్భ, సృక్, స్రువాదులతో కూడ పాత్రాసాదనము చేయవలెను. బాహు ప్రమాణముగల పరిధులు, ఇద్మవ్రశ్చనము, ప్రణీతా పాత్రము, ప్రోక్షణీ పాత్రము, ఆటస్థాలి, ఆజ్యము, రెండు రెండు ప్రస్థముల బియ్యము; అధోముఖ ములుగా ఉన్న సృక్ స్రువములు. ప్రణీత యందును. ప్రోక్షణి యందును పూర్వాగ్రముగ కుశలు ఉంచవలెను. ప్రణీతను నీటితో నింపి, భగవద్ధ్యానముచేసి, దానిని అగ్నికి పశ్చిమమున, తన ఎదుట సమకూర్చిన ద్రవ్యముల మధ్య ఉంచవలెను. ప్రోక్షణిని నీటితో నింపి పూజానంతరము కుడివైపున ఉంచవలెను. చరువును అగ్నిపై ఉంచి ఉడికించవలెను. అగ్నికి దక్షిణమున బ్రహ్మను స్థాపింపవలెను. అగ్ని కుండమునకు లేదా వేదికి, నాలుగు ప్రక్కల, పూర్వాది దిక్కులందు బర్హిస్సు పరిచి పరిధులనుంచవలెను. పిమ్మట గర్భాధానాది సంస్కారముల ద్వారా అగ్నికి వైష్ణవీ కరణము చేయవలెను, గర్భాధానము, పుంసవనము, సీమంతోన్నయనము, జాతకర్మ, నామకరణము మొదలు సమావర్తనము వరకు ఉన్న సంస్కారములుచేసి ఒక్కొక్క కర్మకు ఎనిమిదేసి ఆహుతులను ఇవ్వవలెను. స్రువముతో కూడిన సృక్కుతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

కుండము మధ్య, ఋతుస్నాతయగు లక్ష్మిని ధ్యానించి హోమము చేయవలెను. కుండములోపల ఉన్న లక్ష్మికి కుండలక్ష్మి అని పేరు. త్రిగుణాత్మికయగు ప్రకృతి ఈ లక్ష్మియే. ఈమెయే సకల భూజములకును, సకల మంత్రములకును, విద్యలకును ఉత్పత్తి స్థానము. పరమాత్మ స్వరూపుడగు అగ్నిదేవుడు మోక్షమునకు కారణమైనవాడు; ముక్తిదాత. కుండలక్ష్మి శిరస్సు తూర్పుదిక్కువైపునను, భుజములు ఈశాన-ఆగ్నేయ దిక్కుల వైపునను, కాళ్ళు వాయవ్య నైరృతి దిక్కుల వైపునకును ఉండును. కుండమే ఉదరము. కుండము నందలి యోని స్థానముయోని. మూడు మేఖలలు సత్త్వరజస్తమో గుణములు. ఈ విధముగ ధ్యానించి ముష్టి ముద్రతో పదునైదు సమిధలను హోమము చేయవలెను. పిదప వాయవ్య దిక్కునుండి ఆగ్నేయదిక్కు వరకును ‘ఆధారములు’ అనెడు రెండు ఆహుతులను ఇవ్వవలెను. ఇదేవిధమున ఆగ్నేయము నుండి ఈశాన్యము వరకు ఆజ్య భాగములను ఆహుతులు చేయవలెను. ఆజ్యస్థాలి నుండి ఉత్తర, దక్షిణ, మధ్య భాగముల నుండి ఆజ్యము గ్రహించి ద్వాదశాంతముతో, అనగా మూలమును పన్నెండు పర్యాయములు జపించి, అగ్నియందు, ఆ దిక్కులందే హోమము చేసి, అచటనే త్యాగము చేయవలెను. పిమ్మట “భూః స్వాహా” ఇత్యాది క్రమమున వ్యాహృతి హోమము చేయవలెను. కమల మధ్య భాగమున సంస్కార సంపన్నుడగు అగ్ని దేవుని ధ్యానింపవలెను. “ఈ ఏడు జిహ్వలతో కోట్లకొలది సూర్యుల ప్రకాశముతో ప్రకాశించును. ఆతని ముఖము చంద్రసదృశము. నేత్రములు సూర్యుని వలె దేదీప్యమానములుగ ఉన్నవి”. ఈ విధముగ ధ్యానించి అగ్నిదేవునకు నూట ఎనిమిది ఆహుతులు సమర్పింపవలెను. లేదా మూల మంత్రముచే అందులో సగము సంఖ్యగల ఆహుతులను, మరి ఎనిమిది ఆహుతులను ఇవ్వవలెను. అంగములకు కూడ పదేసి ఆహుతులు ఇవ్వవలెను. (34)