అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాయశ్చిత్తములు-4

పుష్కరుడు చెప్పెను:

మిక్కిలి శుద్ధికరమైన రహస్యాది ప్రాయశ్చిత్తమును చెప్పెదను. ఒక మాసము పురుషసూక్తము జపించినచో సర్వ పాపములను నశింపచేసికొనును. అఘమర్షణ సూక్తము మూడు పర్యాయములు జపించినచో సర్వపాపముల నుండియు విముక్తుడగును. వేదమును జపించుట వలనను, ప్రాణాయామము వలనను, గాయత్రీ జపముచేతను, వ్రతము వలనను పాపములను తొలగించుకొను. సర్వ కృచ్ఛ్రములందును ముండనము, స్నానము, హోమము, విష్ణుపూజ చేయవలెను. కృచ్ఛ్రవ్రతము చేయువాడు పగలు నిలచియు, రాత్రి కూర్చుండియు ఉండవలెను. దీనికి వీరాసనమని పేరు. ఈ విధముగ చేసినచో పాపములన్నియు తొలగించుకొనును. ప్రతిదినము ఎనిమిది గ్రాసముల చొప్పున తిన్నచో అది యతి చాంద్రాయణము. ప్రాతఃకాలము నాలుగు, సాయంకాలము నాలుగు గ్రాసములు తిన్నచో శిశు చాంద్రాయణము. ఎట్లుతిన్నను మొత్తము మాసములో రెండు వందల నలుబది గ్రాసములు తిన్నచో సుర చాంద్రాయణము. మూడు దినములు వేడి ఉదకములు, మూడు దినములు వేడి పాలు, మూడు దినములు వేడినెయ్యి త్రాగి, మూడు దినములు వాయువును మాత్రము భక్షించవలెను. దీని పేరు ‘తప్త కృచ్ఛ్రము’. ఈ పదార్థములనే చల్లనివి తీసికున్నచో అది శీత కృచ్ఛ్రము’. ఇరువది యొక్క దినములు పాలుమాత్రమే త్రాగి ఉన్నచో కృచ్ఛ్రాతి కృచ్ఛ్రము. గోమూత్రము, గో మయము, గో క్షీరము, పెరుగు, నెయ్యి, కుశోదకము, ఒక రాత్రి ఉపవాసము ఇది కృచ్ఛ్రసాంతపనము. ఈ విధముగ ప్రతి దినమునను చేసినచో ‘మహా సాంతపనము’. ఒక్కొక్కటి మూడేసి రోజులు చేసినచో అతి సాంతవనము. పండ్రెండు దివసములు భోజనము లేకుండ ఉండుట పరాకకృచ్ఛ్రము. మూడు దినములు ప్రాతఃకాలము, మూడు దినములు సాయంకాలము, మూడు దినములు అయాచితాన్నము భుజించి ఉపవాసము చేసినచో అతి ప్రాజాపత్యము, దీనిలో నాల్గవ వంతుచేసిన పాదకృచ్ఛ్రము.

ఒక మాసము ఫలములు మాత్రము తిన్నచో అది ఫల కృచ్ఛ్రము; బిల్వ ఫలములచే శ్రీకృచ్ఛ్రము. తామరగింజలతోను, ఆమలకముల చేతను ఆకృచ్ఛ్రములు. పుష్పములచే పుష్ప కృచ్ఛ్రము, పత్రములు తిన్నచో పత్ర కృచ్ఛ్రము, ఉదకము మాత్రము త్రాగిన ఉదక కృచ్ఛ్రము, దుంపలు తిన్నచో మూల కృచ్ఛ్రము, దధి-క్షీర-తక్రములచే దధి కృచ్ఛ్ర, క్షీర కృచ్ఛ్ర-తక్ర కృచ్ఛ్రములు. చేయినిండునంత మాత్రము అన్నమే ఒకమాసము తిన్నచో అది వాయవ్య కృచ్ఛ్రము. పండ్రెండు దినములు తిలలు మాత్రమే తిన్నచో అది పీడా వినాశకమగు ఆగ్నేయము. చారెడు లాజలు మాత్రమే తిన్నచో అది బ్రహ్మకృచ్ఛ్రము. చతుర్దశియందును, పూర్ణిమయందును ఉపవాసముచేసి పిదప పంచగవ్యములను భుజించవలెను. పిదప హవిస్సును భుజించవలెను. ఈ విధముగ మాసమునందు రెండు పర్యాయములు చేయువాడు సర్వ పాప విముక్తుడు అగును. శ్రీకాముడును, పుష్టి కాముడును, స్వర్గ కాముడును, పాపవినాశార్థమై దేవతారాధనపరుడై కృచ్ఛ్రములు చేసినచో సర్వ మనోరథములను పొందును. (171)