అగ్ని మహా పురాణము
రణదీక్షా వర్ణనము
పుష్కరుడు పలికెను:
ఇపుడు యుద్ధ యాత్రా విధానమును, యుద్ధ సమయమున చేయదగిన పనులను చెప్పెదను. ఏడు రోజులలో యుద్ధయాత్ర చేయవలెననగా మొదటి రోజున శ్రీమహా విష్ణువును, మహేశ్వరుని పూజించవలెను. మోదకాదులతో గణాధిపతిని పూజించవలెను. రెండవరోజున దిక్పాలకుల పూజచేసి, శయ్యపై కూర్చుండిగాని, అంతకు పూర్వమేగాని ఈ అర్థముగల మంత్రము జపించవలెను-త్రినేత్రా! రుద్రా! వరదాయకా! వామనా! వికటరూపధరా! శివా! నీవు స్వప్నాధిష్టాన దేవతవు నీకు మాటి మాటికి నమస్కరించుచున్నాను. నీవు దేవాధి దేవతలకు కూడ అధిపతివి. త్రిశూలధారివి. వృషభారూఢుడవు. సనాతనా! పరమేశ్వరా! నీకీ యుద్ధమునందు ఇష్టము కలుగునో, అనిష్టము వాటిల్లునో స్వప్నమునందు చెప్పుము’. ఆ సమయమునందు పురోహితుడు ‘యజ్ఞాగ్రతో దూరముపైతి’ (యజు. 31. 1) అను మంత్రము పఠించవలెను. మూడవ రోజున దిక్కులను రక్షించు రుద్రులను దిక్పాలకులను పూజించవలెను. నాల్గవ రోజున గ్రహములను, ఐదవ రోజున అశ్వినీ కుమారులను, మార్గమున వచ్చు దేవీ, దేవతా, నద్యాదులను పూజించి, ద్యులోకము అంతరిక్ష భూలోకములందుండు దేవతలకు బలి సమర్పించవలెను. రాత్రి భూత గణములకు బలి ఇవ్వవలెను. వాసుదేవ, భద్రకాళీ, లక్ష్యాదుల పూజచేసి సకల దేవతలను ప్రార్థించవలెను. ‘వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, వరాహ, శివ, ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత, సూర్య, సోమ, భౌమ, బుధ, బృహస్పతి, శుక్ర, శనైశ్చర, రాహు, కేతు, గణేశ, కార్తికేయ, చండికా, ఉమా, లక్ష్మీ, సరస్వతీ, దుర్గా, బ్రహ్మాణ్యాది గణ, రుద్ర, ఇంద్రాది దేవ, అగ్ని నాగ, గరుడులును, ద్యులోకము అంతరిక్ష భూములపై నివసించు ఇతరదేవతలును నాకు విజయమును ఇచ్చెదరుగాక. నేనిచ్చిన ఈ బలిని, పూజను స్వీకరించి దేవతలు అందరును యుద్ధము నందు నా శత్రువులను నశింపజేయుదురు గాక. దేవతలారా! నేను మాతృ, పుత్ర భృత్య సహితుడనై మిమ్మును శరణు జొచ్చుచున్నాను. మీరు శత్రుసేన వెనక నుండి దానిని నశింపచేయుడు. నేను సమస్కరించుచున్నాను. యుద్ధము నుండి విజయ వంతుడనై తిరిగి వచ్చినచో ఇపుడు చేసిన బలి పూజాదుల కంటె అధికముగ సమర్పించెదను.
ఆరవ రోజున రాజ్యాభిషేకము చేసికొనినట్లు విజయస్నానము చేసి ఏడవ రోజున త్రివిక్రముని పూజించవలెను. నీరాజన మంత్రములతో ఆయుధ, వాహన పూజ చేయవలెను. ‘పుణ్యాహ’ ‘జయ’ శబ్దములతో బ్రాహ్మణ ముఖము నుండి ఈ మంత్రములను వినవలెను -‘రాజా! ద్యులోక, అంతరిక్ష, భూములపై నివసించు దేవతలు నాకు దీర్ఘాయువు నిచ్చెదరు గాక. దేవతలవలె నీవు సిద్ధిని పొందెదవుగాక. ఈ నీయాత్ర దేవతా యాత్ర యగునుగాక. దేవతలు నిన్ను రక్షింతురు గాక’. ఈ ఆశీర్వాదము విని రాజు ముందుకు సాగవలెను, ‘ధన్వనాగా’ (యజు, 2.39) ఇత్యాది మంత్రముతో ధనుర్బాణములు చేత ధరించి, ‘తద్విష్ణోః’ (యజు. 6. 5) ఇత్యాది మంత్రము జపించుచు శత్రువు వైపు ఎడమకాలు ఉంచి ముప్పది రెండు అడుగులు ముందుకు వేయవలెను. పిదప పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తరముల వైపు వెళ్ళుటకు వరుసగ ఏనుగులు, రథములు, గుఱ్ఱములు, భారమును మోయు జంతువులు-వీటి పై ఎక్కి యుద్ధ వాద్య ఘోషములతో ముందుకు సాగవలెను. వెనుకకు తిరిగి చూడగూడదు.
ఒక క్రోసు దూరము వెళ్లిన పిదప ఆగి దేవతాబ్రాహ్మణుల పూజ చేయవలెను. రాజు తనవెనుక వచ్చుచున్న సైన్యమును రక్షించుకొనుచు ఇతరదేశమునకు యాత్ర చేయ వలెను. విదేశమునకు వెళ్లినను తన దేశాచారమును పాలించుట రాజునకు కర్తవ్యము. ప్రతిదినమునందును దేవతాపూజ చేయవలెను. ఎవ్వని ఆదాయమునకును నష్టము కలిగించకూడదు. ఆ దేశమునందలి మనుష్యులను ఎన్నడును అవమానించరాదు. విజయము పొంది తిరిగి తన దేశమునకు వచ్చిన పిమ్మట దేవతలకు పూజలుచేసి, దానము ఈయ వలెను. మరునాడు యుద్ధప్రారంభమగుచున్నచో తొలిరోజున గజ అశ్వాది వాహనములకు స్నానము చేయించి, నృసింహస్వామిని పూజించవలెను. ఛత్రాది రాజ చిహ్నములకును, అస్త్ర శస్త్రములకును, భూత గణములకును రాత్రి పూజలు చేసి ప్రాతఃకాలమున మరల నృసింహస్వామికిని, సకల వాహనాదులకును పూజచేయవలెను. పురోహితుడు హోమము చేసిన అగ్నిని చూచి, తాను కూడ హోమముచేసి, బ్రాహ్మణుల సన్మానము చేసి, ధనుర్బాణములు ధరించి, గజారూఢుడై యుద్ధమునకు వెళ్లవలెను. శత్రుదేశమునందు అదృశ్యుడుగా ఉండి ప్రకృతి కల్పన సేనానివేశము చేయవలెను. సైనికుల సంఖ్య తక్కువగా ఉన్నచో వారిని అందరిని ఒక్కచోట చేర్చి యుద్ధము చేయవలెను; అధికముగా ఉన్న వాళ్లను ఇచ్ఛానుసారముగ విస్తరింపచేయవలెను.
అల్పసంఖ్యాకులగు సైనికులతో అధిక సంఖ్యాకులగువారిని ఎదుర్కొనుటకు సూచీ ముఖమను వ్యూహము మంచిది. ప్రాణి శరీర సదృశములు, ద్రవ్యరూపములు అని వ్యూహములు రెండు విధములు. గరుడ, మకర, చక్ర, శ్యేన, అర్ధచంద్ర, వజ్ర, శకట, సర్వతోభద్రమండల, సూచీ వ్యూహములను తొమ్మిది వ్యూహములు ప్రసిద్ధములు. అన్ని వ్యూహములందును సైనికులను ఐదు భాగములుగా విభజించి, రెండు పక్షములు, రెండు అనుపక్షములు ఏర్పరచి ఒక పంచమభాగమును గూడ ఉంచుకొనవలెను. యోధులలో ఒక భాగముతోగాని, రెండు భాగములతో గాని యుద్ధము చేయుచు మిగిలిన మూడు భాగములను వారి రక్షణకై ఉపయోగించవలెను. రాజును ఎన్నడును వ్యూహమునందు నిలుప గూడదు. రాజే మూలము. ఆ మూలము వినష్టమైనచో రాజ్యమే నశించును. అందుచే రాజు యుద్ధములో పాల్గొనగూడదు. అతడు సైన్యమునకు వెనుక ఒక క్రోసు దూరము నందు ఉండవలెను. అచట ఉండి రాజు యుద్ధమునుండి పారిపోవుచున్న యోధులకు ధైర్యము చెప్పి ప్రోత్సహించవలెను. సేనాపతి పారిపోయినను, మరణించినను సైన్యము నిలువజాలదు. వ్యూహమునందలి యోధులు ఒకరికొకరు చాల దగ్గరగా గాని, దూరముగా గాని నిలువకూడదు. ఒకరి ఆయుధములు ఒకరికి తగులకుండునంత దూరమున నిలువవలెను.
శత్రు వ్యూహమును భేదించుటకు యోధులందరును సంఘటితులై ప్రయత్నించవలెను. శత్రువులు తమ వ్యూహమును భేదించుటకై ప్రయత్నించునపుడు కూడ యోధులు సంఘటితులై ఎదిరించవలెను. శత్రుసైన్యములోనికి చొచ్చుకొని పోవుటకు వీలగునట్లు ఇచ్ఛానుసారముగ వ్యూహరచన చేయవలెను. ఏనుగుల కాళ్లను రక్షించుటకై నాలుగు రథములను నియమించవలెను. రథమును రక్షించుటకు నలుగురు ఆశ్వీకులను, వారి రక్షణకై నలుగురేసి ఖడ్గచర్మధారులగు పదాతులను నలుగురేసి ధనుర్ధారులను ఏర్పరుప వలెను. యుద్ధమున అందరికంటె ముందు ఖడ్గధారులగు పదాతులు ఉండవలెను. వారి వెనుక ధానుష్కులు, వారి వెనుక ఆశ్వికులు, వారి వెనుక రథములు, వారి వెనుక గజసేన ఉండునట్లు ఏర్పరుపవలెను.
పదాతులు, హాస్తికులు, ఆశ్వికులు ప్రయత్న పూర్వకముగ ధర్మయుద్ధము చేయవలెను. యుద్ధ భూమి అగ్రమున శూరులగు యోధులను ఉంచవలెను. పిరికివారిని ఎన్నడును ఉంచరాదు. ఎదుట నుంచిన శూరులకు శత్రువుల సమూహము మాత్రమే కనబడునట్లు ఏర్పరచవలెను.
అపుడే వారు పౌరుషము చూపి శత్రువులను పారద్రోలగలరు. పిరికి వారిని సేనాగ్రము నందుంచినచో పారిపోయి స్వయముగనే వ్యూహమును భిన్నము చేయుదురు. అందుచే వారిని ముందు ఉంచరాదు. శూరులు ముందున్నచో వెనుకనున్న భీరువులకు గూడ ఉత్సాహము కలిగింతురు. ఉన్నతులును, చిలుకముక్కు కలవారును, సౌమ్యమైన దృష్టి కలవారును, కలిసిన కనుబొమ్మలు కలవారును, కోపశీలులును, కలహప్రియులును హర్షోత్సాహభరితులును, కామపరాయణులును అగువారు శూరులైన వీరులు.
గాయపడిన వారిని, మరణించినవారిని యుద్ధభూమినుండి తొలగించుట, యుద్ధరంగమునందు ఉన్న ఏనుగులకు నీరు త్రాగించుట, ఆయుధములు అందించుట ఇది పదాతుల కర్తవ్యము. శత్రుసైనికులు తమ సైన్యమును భేదించకుండ రక్షించుచు శత్రు వ్యూహమును భేదించుట ఖడ్గవీరుల కర్తవ్యము. శత్రువులను కొట్టి యుద్ధభూమి నుండి పారద్రోలుట ధనుర్ధరుల కర్తవ్యము. ఎక్కువగా గాయపడినవారిని యుద్ధభూమినుండి తొలగించి, తిరిగి వచ్చి శత్రుసైన్యమునందు భయము ఉత్పన్నము చేయుట రథికుల కర్తవ్యము. సంఘటిత వ్యూహమును భేదించుట, భిన్నమైనదానిని కలుపుట, ప్రాకార ద్వారాదులను, ఇంటిపై భాగములను, వృక్షములను భగ్నము చేయుట గజముల కర్తవ్యము. పదాతులకు ఎగుడుదిగుడుగా నున్న భూమి, రథ, అశ్వములకు సమతల భూమి, ఏనుగులకు బురదనేల యుద్ధమునకు అనుకూలములు.
ఈ విధముగ వ్యూహరచనచేసి, సూర్యుడు వెనుకవైపు ఉన్నపుడు, శుక్ర, శనైశ్చరులును, దిక్పాలకులును అనుకూలముగా నుండగా, ఎదుటినుండి మందవాయువు వీచుచుండగా, యుద్ధము చేయుచు, నామగోత్రాదులను పేర్కొని యోధులందరికిని ఉత్సాహము కలిగించవలెను. ‘యుద్ధము నందు విజయము లభించినచో ఉత్తమ భోగములు లభించును; మరణించినచో స్వర్గసుఖము లభించును’ అనికూడ చెప్పుచుండవలెను. వీరుడు శత్రువులను జయించినచో మనోవాంఛిత భోగములను పొందును. మరణించినచో ఉత్తమగతులను పొందును. స్వామి అన్నము తిన్నందులకు ఋణవిముక్తుడగును. అందుచే యుద్ధము వంటి శ్రేష్టమైనది మరొకటి లేదు. శరీరము నుండి రక్తము స్రవించినచో వీరుడు పాపవిముక్తుడగును. యుద్ధమునందు శస్త్ర ప్రహారాది కష్టములను సహించ వలసియుండును. అదియొక గొప్ప తపస్సు. యుద్ధమునందు ప్రాణ త్యాగము చేయు వీరుని వద్దకు వేలకొలది అప్సరసలు వత్తురు. హతోత్సాహుడై యుద్ధభూమినుండి పారిపోవు యోధుని పుణ్యమంతయు అతని స్వామికి చేరును. అడుగడుగునను బ్రహ్మహత్యా పాపము వచ్చును. తన సహాయులను విడచి పారిపోవువానిని దేవతలే నశింపచేయుదురు. యుద్ధమునుండి అడుగుకదపని వీరునకు అశ్వమేధయాగ ఫలము లభించును.
ధర్మమునందు దృఢముగా నిలచు రాజునకు విజయము లభించును. యోధులు తమతో సమానమైన యోధులతోడనే యుద్ధము చేయవలెను. హస్తికాదులు హస్తికాదుల తోడనే యుద్ధము చేయవలెను. పారిపోవుచున్నవారిని చంపకూడదు. యుద్ధము చూచుటకై వచ్చినవారిని, శస్త్రహీనులను, నేలపై పడిపోయినవారిని, ఎన్నడును చంపగూడదు. అలసిపోయిన వానిని, నిద్ర వచ్చిన వానిని, నదీ మధ్యయందుగాని, అడవియందుగాని ఉన్న వానిని కొట్టగూడదు. దుర్దినమునందు శత్రువులను నశింప చేయుటకై కూట యుద్ధము చేయవలెను. రెండు చేతులు పైకెత్తి-‘చూడుడు! శత్రువులు పారిపోవుచున్నారు. మన మిత్రసేన వచ్చినది. శత్రుసేనా సంచాలకులు మరణించినారు. సేనాపతి కూడ మరణించినాడు. శత్రురాజు కూడ మరణించినాడు’ అని గట్టిగా చెప్పవలెను.
పారిపోవుచున్న శత్రుయోధులను అనాయాసముగ చంపివేయవచ్చును. ఓ ధర్మజ్ఞా! శత్రువులను మోసగించుటకు కృత్రిమమగు సుగంధ ధూపమును ప్రసరింపచేయవలెను. విజయపతాకలు ఎగురవేయవలెను. వాద్యములను భయంకరముగ మ్రోగించవలెను. విజయము లభించినచో దేవతా, బ్రాహ్మణులను పూజించవలెను. అమాత్యుడు చేసిన యుద్ధము నందు లభించిన రత్నాదులను రాజునకే ఇవ్వవలెను. శత్రుస్త్రీలపై ఎవ్వరికిని అధికారములేదు. వారికి తగు రక్షణము ఇవ్వవలెను. యుద్ధమునందు సహాయకులు లేని శత్రువును పుత్రుని పాలించినట్లు పాలించవలెను. ఆతనితో మరల యుద్ధము చేయరాదు. అతని విషయమున దేశోచితాచారాదుల పాలనము చేయవలెను. యుద్ధమునందు విజయము లభించిన పిమ్మట నగరమునకు తిరిగి వెళ్ళి ధ్రువ నక్షత్రములందు రాజ భవనమును ప్రవేశించవలెను. దేవతలను పూజించి, సైనికుల కుటుంబముల పోషణకు ఏర్పాట్లు చేయవలెను. శత్రువునుండి లభించిన ధనములో కొంతభాగము భృత్యులకు కూడ పంచి పెట్టవలెను. నేను చెప్పిన ఈ రణదీక్షానుసారము కార్యములు చేయు రాజుకు తప్పక విజయము లభించును. (236)
