అగ్ని మహా పురాణము

Table of Contents

గణపూజా నిరూపణము

ఈశ్వరుడు పలికెను:

పైన తేజస్సు (ర) కల విశ్వరూపమును (హు) ఉధృతము చేసి నరసింహము (క్షు) కింద కృతాంతము (య్) ఉంచవలెను. దానిచివర ప్రణవము చేర్చవలెను. ర్ హ్ క్ష్ మోం’ ఏర్పడినది. దీని పిమ్మట ఊహకము (ఊ) అంశము (౦) విశ్వమును (హ) కలుపవలెను. (హూం) ఇవి రెండును వరసగ అంతస్థము కంఠ్యోష్టము చెప్పబడును. దీని అంతమున నమః చేర్చుటచే రెండు మంత్రములను నాలుగు అక్షరము కలవవును. విశ్వరూపము కారణమని చెప్పబడినది. దానిని పండ్రెండు మాత్రలచే గుణితము చేయవలయును. ఈ పండ్రెండులో ఐదు హ్రస్వబీజములతో ఈశానాది పంచ బ్రహ్మమూర్తులను పూజించి దీర్ఘాత్మకములగు ఆరు బీజములతో వెనుకటి వలెనే అంగన్యాసము చేయవలెను. హ్రీం వ్రాసి పిదప స్ఫురస్ఫుర వ్రాయవలెను. పిదప ఆ రెండింటికిని ‘ప్ర’ చేర్చవలెను. పిదప ‘కః ‘వమ’ ‘బంధ’ ఈ మూడు పదములను రెండేసి పర్యాయములు వ్రాసి పిదప ఘాతయ అనునది వ్రాసి అంతమున హుంఫట్ చేర్చవలెను. ఇది అఘోరాస్త్ర మంత్రము. ఇపుడు శివగాయత్రి చెప్పబడుచున్నది. ‘మహేశాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నః శివః ప్రచోదయాత్’ ఈ శివగాయత్రి సకల ఫలప్రదము.

యాత్రయందును, విజయాది కార్యములందు శ్రీలాభము నిమిత్తమై ముందు గణపూజ చేయవలెను. చతురస్ర క్షేత్రమును అన్నివైపుల పండ్రెండేసి కోష్టములలో విభజించవలెను. మధ్యనున్న నాలుగు పదములలో త్రికోణము రచించి దాని మధ్య త్రిదళకమలము వ్రాయవలెను. దాని పృష్ఠమున పథిక వీథి భాగములందు మూడు దళములతో అశ్వయుక్త కమలము ఏర్పరుపవలయును. పిదప వసుదేవ పుత్రులతో (వాసుదేవ సంకర్షణగద) ప్రకాశించుచున్న త్రిదళ కమలముతో పాద పట్టికను నిర్మించవలెను. దానిపైన భాగ ప్రమాణముచే ఒక వేది రచించవలెను. పూర్వాది దిశలందు ద్వార కోణ భాగములతో ఉపద్వార మేర్పరచినచో ఆ మండలము విఘ్న నాశకమగును. మధ్యనున్న కమలము దాని వెలుపలవున్న కమలములు ఆరక్త వర్ణములై వుండవలెను. వీథిశ్వేత వర్ణమై వుండవలెను. ద్వారములరంగు ఇష్టమువచ్చినట్లు వుండవచ్చును. కర్ణికను పీతవర్ణముతోను కేసరములు కూడ ఆ దేవ వర్ణములోను ఉండవలెను. దీనికి విఘ్నమర్ద మండలమని పేరు. దీని మధ్య భాగమున గణపతిని పూజించవలెను. నామాద్యక్షరమును అనుస్వార సహితముగ పలికి ఆది యందు ‘ఓం’ అంతమునందు ‘నమః’ చేర్చవలెను. హ్రస్వాన్త బీజ యుక్తములగు ఈశాన తత్పురుషాది మంత్రములతో బ్రహ్మమూర్తులను పూజించి దీర్ఘాంత బీజములతో అంగన్యాసము చేయవలెను. ఆ మండలము యొక్క పూర్వ దిక్కు యందున్న పంక్తియందు, ‘గజ గజశీర్ష గాంగేయ, గణనాయక, గగ, నగ, గోపతి’ అను పేర్లు వ్రాయవలెను. చివరి రెండు పేర్లను మూడేసి పర్యాయములు వ్రాయవలెను.

విచిత్రాంశ, మహాకాయ, లంబోష్ఠ లంబకర్ణ లంబోదర, మహాభాగ, వికృత, పార్వతీ ప్రియ, భయావహ, భద్ర భగణ, భయసూదన అను పండ్రెండు నామములు దక్షిణ దిక్పంక్తి యందు వ్రాయవలెను. పశ్చిమమున దేవత్రాస, మహానాద, భాసుర, విఘ్నరాజ, గణాధిప, ఉద్భట, స్వన, ఉద్భశుండ, భీమ, మన్మథ, మధుసూదన, సుందర, భావపుష్ట అను పేర్లును, ఉత్తరమున బ్రహ్మేశ్వర, బ్రాహ్మ, మనోవృత్తి సంలయ, లయ, నృత్య ప్రియలోల, వికర్ణ, వత్సల, కృతాంత, కాలదండ, కుంభ అను పేర్లను వ్రాసి అన్నింటిని పూజించవలెను. పదివేల జపము చేసి దశాంశ హోమము చేయవలెను. మిగిలిన మంత్రములను పదేసి పర్యాయములు జపించి ఒక్కొక్క హోమము చేయవలెను. సకల మనో రథములు సిద్ధించును. గురువునకు, భూ, గో, అశ్వ, గజ, వస్త్రాదులు ఇచ్చి పూజించవలెను. (318)