అగ్ని మహా పురాణము
భువనకోశ నిరూపణము
అగ్ని దేవుడు పలికెను-
వసిష్ఠా! జంబూ, ప్లక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాక, పుష్కరములనెడు ఏడు ద్వీపములు నలుమూలల లవణజల, ఇక్షురస, మద్య, ఘృత, దధి, క్షీర, మధుర జలములు గల ఏడు సముద్రములచే చుట్టబడియున్నవి. జంబూ ద్వీపము అన్ని ద్వీపముల మధ్యన ఉన్నది. దాని మధ్య ఎత్తైన మేరు పర్వతమున్నది. దీని విస్తారము ఎనుబది నాల్గువేల యోజనములు. ఈ పర్వత రాజము పదహారువేల యోజనములు భూమిలో దిగి ఉన్నది. పై భాగమునందు దీని విస్తారము ముప్పది రెండువేల యోజనములు. క్రింద దీని విస్తారము పదునారువేల యోజనములు. ఇట్లు ఈ పర్వతము ఈ పృథ్వీరూప కమలమునకు కర్ణికవలె ఉన్నది. దీని దక్షిణమున హిమవత్, హేమకూట, నిషధ పర్వతములును, ఉత్తరమున నీల, శ్వేత, శృంగి పర్వతములును వర్ష పర్వతములుగా ఉన్నవి. మధ్య నున్న రెండు పర్వతములు (నిషధ -నీలములు) ఒక్కొక్కక్ష యోజనముల వరకు వ్యాపించి ఉన్నవి. ఇతర పర్వతములు వాటికంటె పదేసివేల యోజనములు తక్కువ. అవి అన్నియు రెండేసి వేల యోజనములు ఉన్నతములు. అంతియే వెడల్పు, ద్విజశ్రేష్ఠా! దక్షిణ వర్షము లలో మొదటిది భారత వర్షము, రెండవది కింపురుష వర్షము. మూడవది హరి వర్షము, ఉత్తరము వైపు రమ్యక, హిరణ్మయ, ఉత్తర కురు వర్షములున్నవి. అవి భారతవర్షముతో సమానములు, మునివరా! వీటిలో ఒక్కొక్కదాని విస్తారము తొమ్మిదేసి వేల యోజనములు. వీటి అన్నింటిమధ్య ఇలావృత వర్షమున్నది. దానియందు మేరు పర్వతము నిలచి యున్నది. ఇలావృతవర్షము సుమేరు పర్వతమునకు నలువైపుల తొమ్మిదేసివేల యోజనముల వరకును విస్తరించియున్నది. దీని నాలుగు వైపుల నాలుగు పర్వతములున్నవి. ఇవి సుమేరు పర్వతమును నిలబెట్టుటకై ఈశ్వరుడు ఏర్పరచిన ఆధార స్తంభములా అన్నట్లు ఉన్నవి. వీటిలో మందరాచలము తూర్పునను, గంధమాదనము దక్షిణమునను, విపులము పశ్చిమ పార్శ్వమునందును, సుపార్శ్వము ఉత్తరము నందును ఉన్నవి. ఈ పర్వతముల విస్తారము పదేసి వేల యోజనములు. ఈ పర్వతములపై నున్న పదకొండేసి యోజనముల విస్తారము గల కదంబ, జంబూ, అశ్వత్థ, వటవృక్షములు ధ్వజములవలె ప్రకాశించుచున్నవి. వీటిలో జంబూ వృక్షము, జంబూ ద్వీపమను పేరునకు కారణము. దీని పండ్లు ఏనుగంత ప్రమాణములో ఉండును. వీటి రసము జంబూనదిగా ప్రవహించుచున్నది. దీని నుండియే చాల ఉత్తమమైన జాంబూనదము (బంగారము) ఉత్పన్నమగుచున్నది. మేరువునకు తూర్పున భద్రాశ్వ వర్షము, పశ్చిమమున కేతుమాలము ఉన్నది. దానికి తూర్పున చైత్ర రథము, దక్షిణమున గంధమాధనము, పశ్చిమమున వైభ్రాజము, ఉత్తరమున నందనము అను వనములు ఉన్నవి. అట్లే దీనికి పూర్వాది దిక్కులందు అరుణోదయ, మహాభద్ర, శీతోద మానసములను సరస్సులున్నవి. సితాంభస్సు, చక్రముంజము మొదలగునవి (భూపద్మ కర్ణికయగు)మేరువు యొక్క పూర్వదిశ యందున్న కేసరముల వంటి పర్వతములు, దక్షిణమున త్రికూటాదులు, పశ్చిమమున శిభివాసాదులు, ఉత్తరమున శంఖకూటాదులును కేసర పర్వతములు. సుమేరువుపై బ్రహ్మపురి ఉన్నది.
దాని విస్తారము పదునాలుగు వేల యోజనములు. బ్రహ్మపురికి నాలుగు వైపుల అన్ని దిక్కులందును ఇంద్రాది లోకపాలకుల నగరములున్నవి. ఈ బ్రహ్మపురి నుండియే, విష్ణుపాదోద్గత యగు గంగానది చంద్రమండలమును నడుపుచు స్వర్గమునుండి క్రిందికి దిగుచున్నది. తూర్పున శీతానది భద్రాశ్వ పర్వతమునుండి బయల్వెడలి ఒక పర్వతము నుండి మరొక పర్వతమునకు వెళ్లుచు సముద్రములో కలియుచున్నది. ఇట్లే అలకనంద కూడ దక్షిణమువైపు భారతవర్షమునకు వచ్చి, ఏడు భాగములలో విభక్తయై సముద్రములో కలిసిపోవుచున్నది. వక్షునది పశ్చిమ సముద్రము నందును, భద్ర ఉత్తర కురువర్షమును దాటి సముద్రమునందును కలియుచున్నది. మాల్యవత్, గంధమాదన పర్వతములు ఉత్తర దక్షిణముల వైపు నీలాచల, నిషధ పర్వతముల వరకును విస్తరించియున్నవి. ఆ రెండిటి మధ్య కర్ణికాకారమైన మేరు పర్వతమున్నది. మర్యాదా పర్వతము బైటనున్న భారత, కేతుమాల, భద్రాశ్వ, ఉత్తర కురువర్షములు ఈ లోకపద్మము దళములు, జఠరదేవ కూటములు మర్యాదాపర్వతములు. ఇవి ఉత్తరము, దక్షిణముల వైపు నీలనిషధ పర్వతముల వరకును వ్యాపించియున్నవి. పూర్వ, పశ్చిమముల వైపు విస్తృతములైన గంధమాదన, కైలాసములు, ఎనుబదివేల యోజనములు విస్తృతమైనవి. తూర్పునందువలె పశ్చిమము వైపు గూడనిషధ పారి యాత్రములను రెండు మర్యాదా పర్వతములున్నవి. వాటి మూలములు సముద్రములోపల చొచ్చు కొని ఉన్నవి. ఉత్తరము వైపున త్రిశృంగము, రుధిరము, వర్షపర్వతములు పూర్వపశ్చిమ సముద్రములందు చొచ్చుకొనియున్నవి. ఈ విధముగ జఠరము మొదలగు మర్యాదా పర్వతములు మేరు పర్వతమునకు నలువైపుల ప్రకాశించుచున్నవి. మునిశ్రేష్ఠా! కేసర పర్వతముల మధ్యనున్న శ్రేణులలో లక్ష్మీ, విష్ణు, అగ్ని, సూర్యాది దేవతల నగరములున్నవి. ఇవి భూలోక సంబద్ధములేయైనను స్వర్గముతో సమానమైనవి. పాపాత్ములు ఈ నగరములలో నివసించజాలరు. శ్రీమహావిష్ణువు భద్రాశ్వ వర్షమునందు హయగ్రీవ రూపమునను, కేతుమాల వర్షమునందు వరాహ రూపమునను, భారత వర్షమునందు కూర్మ రూపమునను, ఉత్తరకురు వర్షమునందు మత్స్య రూపమునను నివాసము చేయుచున్నాడు. శ్రీమహావిష్ణువు విశ్వరూపముతో సర్వత్ర పూజింపబడుచున్నాడు, కింపురుషాది వర్షములు ఎనిమిదింటి యందును ఆకలి, భయము, శోకము మొదలగునవి ఏమియు ఉండవు. అచటి ప్రజలు ఇరువది నాల్గువేల సంవత్సరములపాటు రోగశోకాదులు ఏవియులేకుండ జీవనము గడుపుచుందురు. అచట కృత త్రేతాది కల్పన ఉండదు. వర్షములు కురియవు. కేవలము పార్థివజలమే లభ్యమగును. ఈ అన్ని వర్షములందును ఏడేసి కులపర్వతములున్నవి. వాటినుండి వందల కొలది తీర్థ రూపములగు నదులు ప్రవహించుచున్నవి. ఇప్పుడు భారతవర్షమునందున్న తీర్థములను గూర్చి చెప్పెదను. (108)
