అగ్ని మహా పురాణము

Table of Contents

పశ్యాదియోగవర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను:

ఇపుడు వశీకరణాది యోగములను చెప్పెదను, భృంగరాజము (16), సహదేవి (3), మయూరశిఖ (8), పుత్రజీవక వృక్షము బెరడు (2), అధఃపుష్ప రుద్రదంతిక (4), కుమారి (11), రుద్రజట (8), విష్ణుక్రాంత (10), శ్వేతార్కము (5), లజ్జాలుక (4), మోహలత (9), కృష్ణదత్తూరము (6), గోరక్షకర్కటి (12), మేషశృంగి (1), స్నుహి (15) అను ఓషధుల పేర్లను పదునారు కోష్ఠములు గల చక్రమునందు వ్రాయవలెను. ఓషధుల భాగములు ప్రదక్షిణ క్రమమున 16, 11, 8, 10, 5, 4, 9, 6, 12, 1, 15 అను సంఖ్యలలో నిర్దేశింపబడును. మొదటి నాలుగు ఓషధులను చూర్ణము చేసి దాని ధూపమును ఉపయోగించవలెను. లేదా వీటిని నీటితో మర్దించి, ముద్దచేసి, శరీరావయవములకు పట్టించుకొనవలెను. 9, 10, 11, 12 సంఖ్యల ఓషధులతో అంజనము తయారుచేసి నేత్రములందు ధరింపవలెను. చివరి నాలుగు ఓషధులు కలిపిన జలముతో స్నానము చేయవలెను. 5, 6, 7, 8 సంఖ్యల ఓషధులు మర్దించి అనులేపనము ఉపయోగించవలెను. అధఃపుష్పను. దక్షిణ పార్శ్వములందును, లాజవంతి మొదలైన వాటిని వామ పార్శ్వము నందును ధరించవలెను. మయూర శిఖను పాదములందును ఘృత కుమారిని శిరస్సుపైనను ధరించవలెను. రుద్రజట, గోరక్ష కర్కటి, మేఘశృంగుల ధూపమును అన్ని కార్యములందును ఉపయోగించవలెను. వీటిని మర్దించి, ముద్దచేసి శరీరము పై అలముకొన్న వానిని దేవతలు కూడ గౌరవింతురు. భృంగరాజాది ఓషధులు నాలుగును ధూపమునకు ఉపయోగించును. వాని మర్దించి శరీరమునకు పూసికొనినచో గ్రహాది జనిత బాధతొలగును. లజ్జాలుకాద్యోషధులు అంజనమునకును, శ్వేతార్కాదులు స్నానమునకును ఉపయోగించును. ఘృత కుమార్యాదులు తినుటకును, పుత్రజీవకాదులు నీటిలో కలిపి త్రాగుటకును ఉపయోగించును. 16, 4, 6, 2 సంఖ్యల ఓషధులతో తయారుచేసిన తిలకము సకలలోక మోహనము. గోరక్ష కర్కటి కృష్ణ ధత్తూరము, పుత్రజీవకము, అధఃపుష్ప అను ఓషధులను తన శరీరముపై పూసుకొనుటచే స్త్రీవశమగును. మేషశృంగి, రుద్రదంతిక, మయూర శిఖ కుమారి అను ఓషధులను యోనియందు లేపము చేయుటచే స్త్రీ వశమగును. స్నుహి, అపరా జితా, లాజవంతీ, శ్వేతార్కములతో తయారుచేసిన గుటికలు జనులను వశముచేయును. ఎవనిని వశము చేసికొనవలెనో వాని భక్ష్య, భోజ్య, పేయ పదార్థములలో ఈ గుళికలను కలిపి ఇవ్వవలెను. భృంగరాజు, మోహలతా, పుత్రజీవక, అధః పుష్పా ఓషధులను నోటిలో ధరించుటచే శత్రువులు ఉపయోగించు అస్త్రశస్త్రములు స్తంభితములగును. అధఃపుష్పా, రుద్రదంతీ, లాజవన్తీ, మోహలతలను శరీరముపై పూసుకున్న వాడు నీటిలో నివసించగలడు. శ్వేతార్క పుత్రజీవక, రుద్రదంతీ, కుమారీ ఓషధులతో తయారుచేసిన వటి ఆకలిదప్పులు మొదలగు వాటిని తొలగించును, సహదేవీ, భృంగరాజు, అపరాజితా, శ్వేతార్క ఓషధుల లేపముచే దుర్భగయగు స్త్రీ సుభగయగును. కృష్ణధత్తూర, పుత్రజీవక, విష్ణుక్రాంతా, సహదేవీ, ఓషధులను తన శరీరమునందు పూసుకొన్నవాడు సర్పములతో ఆడుకొనవచ్చును. కృష్ణదత్తూర, పుత్రజీవక, ఘృతకుమారీ, మయూరశిఖా ఓషధుల లేపమును పూసుకొనుటచే స్త్రీ సుఖముగా ప్రసవించును. అధఃపుష్పా, అపరాజితా, మోహలతా ఓషధులను వస్త్రమునకు లేపము చేసినవాడు ద్యూతమునందు విజయము పొందును. కృష్ణదత్తూర, పుత్రజీవక, అధఃపుష్పా, రుద్రదంతికా ఓషధులను పూసుకొని రతి చేయగా కుమారుడు పుట్టును. మోహలతా, అధఃపుష్పా, గోరక్ష కర్కటీ, కృష్ణ దత్తూర ఓషధులతో తయారుచేసిన వటి సర్వవశంకరము. ఈ విధముగ పదునారు పదములలో ఉన్న ఓషధుల ప్రభావము వర్ణించబడినది. (140)